సర్వ సన్నద్ధం
ABN , Publish Date - Oct 27 , 2025 | 10:31 PM
మొంథా తుఫాన్ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. తుఫాన్ ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు సర్వ సన్నద్ధమైంది.
మొంథా తుఫాన్ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తం
అత్యవసర సహాయక చర్యలకు బృందాలను సిద్ధం చేసిన ఆర్ అండ్ బీ
ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్న కలెక్టర్ దినేశ్‌కుమార్
నేడు, రేపు విద్యాలయాలకు సెలవు
నేటి నుంచి 31 వరకు పర్యాటక కేంద్రాల మూసివేత
అత్యవసర సేవలకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు
పాడేరు, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన్ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. తుఫాన్ ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు సర్వ సన్నద్ధమైంది. పలు శాఖల అధికారులు చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై కలెక్టర్ దినేశ్‌కుమార్ గత మూడు రోజులుగా దిశానిర్దేశం చేస్తున్నారు. అతి భారీ వర్షాలు కురిసినా ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించకుండా అధికారులు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలోని పర్యాటక కేంద్రాలను మూసివేశారు.
తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు సర్వం సిద్ధం
మొంథా తుఫాన్ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు జిల్లాలో సర్వం సిద్ధం చేశామని, ప్రజలు ఎటువంటి ఆందోళన చెందవద్దని కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ అన్నారు. ఎస్‌పీ అమిత్‌బర్దార్, ఇన్‌చార్జి జేసీ, ఐటీడీఏ పీవో టి.శ్రీపూజతో కలిసి సోమవారం ఆయన కలెక్టరేట్‌లో విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని మొత్తం 22 మండలాలకు గాను 12 మండలాల్లో తుఫాన్ ప్రభావం ఉంటుందని గుర్తించామని, అలాగే 163 గ్రామాలు ముంపునకు గురవుతాయని గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. అత్యవసర సహాయక చర్యలను చేపట్టేందుకు 14 ప్రత్యేక బృందాలను సిద్ధం చేయడంతో పాటు 21 క్రేన్‌లను అందుబాటులో ఉంచామన్నారు. అత్యవసర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని 11 చోట్ల హెలీప్యాడ్‌లను సైతం సిద్ధం చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి మండల, గ్రామ స్థాయిలోని అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు. అతి భారీ వర్షాలు కురిసినా ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించకుండా అధికారులు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. 28, 29 తేదీల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాలని, 28 రాత్రి లేదా 29 తెల్లవారుజామున తుఫాన్ కాకినాడకు సమీపంలో తీరందాటే అవకాశముందన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని, ప్రజలు గెడ్డలు దాటవద్దని సూచించారు. చెట్లు కూలినా, రోడ్లు ధ్వంసమైన తక్షణమే పునరుద్ధరణ చర్యలు చేపట్టేందుకు, తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు పోలీసు బృందాలతో సహా అన్ని శాఖల అధికారులు సిద్ధంగా ఉన్నారని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజలు ఎటువంటి అత్యవసర సాయానికైనా కంట్రోల్ రూమ్ నంబర్: 7780292811 సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ నెల 28, 29 తేదీల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున విద్యాలయాలకు సెలవు ప్రకటించామని, ఆ రోజుల్లో ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ఆయన సూచించారు. అలాగే 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జిల్లాలోని పర్యాటక ప్రదేశాలన్నీ మూసివేశామని తెలిపారు.
అందోళన చెందుతున్న అన్నదాతలు
మొంథా తుఫాన్ ప్రభావంతో తమ పంటలు నాశనమవుతాయని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్‌లో వేసిన వరి, రాగులు, సామ, వేరుశెనగ, మొక్కజొన్న పంటలు ఆశాజనంగా పండాయి. అలాగే వరి పంట ప్రస్తుతం కోతకు వచ్చే దశకు చేరింది. మరో రెండు వారాల్లో వరి కోతలు ప్రారంభించాలనే ఆలోచనతో గిరిజన రైతులు ఉన్నారు. ఈ క్రమంలో భారీ వర్షాలు కురిస్తే తమ పంటలు నాశనమవుతాయని గిరిజన రైతులు భయాందోళన చెందుతున్నారు.