Share News

చంద్రబాబుపైనే ఆశలు

ABN , Publish Date - Dec 20 , 2025 | 01:47 AM

రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాలో పారిశ్రామికంగా శరవేగంగా అడుగులు పడుతున్నాయి.

చంద్రబాబుపైనే ఆశలు

జిల్లాలో అధ్వానంగా రహదారులు

అభివృద్ధికి నోచుకోని సాగునీటి వనరులు

మూతపడిన సహకార చక్కెర కర్మాగారాలు

గత ప్రభుత్వ నిర్వాకంతో వ్యవస్థలన్నీ నిర్వీర్యం

నేడు సీఎం చంద్రబాబునాయుడు జిల్లా పర్యటన

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాలో పారిశ్రామికంగా శరవేగంగా అడుగులు పడుతున్నాయి. ఏడాదిన్నర కాలంలోనే సుమారు రెండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారు. వీటిల్లో కొన్ని పరిశ్రమలు, కంపెనీలకు శంకుస్థాపనలు జరగ్గా, మరికొన్నింటికి సంబంధించి ఎంవోయూలు పూర్తయ్యాయి. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో బల్క్‌డ్రగ్‌ పార్కు ఏర్పాటు పనులు జోరుగా సాగుతున్నాయి. అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంఎస్‌ఎంఈలు ఏర్పాటవుతున్నాయి. అనకాపల్లి-అచ్యుతాపురం మధ్య నాలుగు వరుసల రహదారి నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. అయితే జిల్లాలో అత్యంత దారుణంగా వున్న బీఎన్‌ రోడ్డుకు ఇంతవరకు మోక్షం కలగలేదు. గత ప్రభుత్వ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన సాగునీటి వనరుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టలేదు. సహకారం రంగంలోని నాలుగు షుగర్‌ ఫ్యాక్టరీల్లో మూడింటిని గత వైసీపీ ప్రభుత్వం మూసివేయగా, మిగిలిన గోవాడ ఫ్యాక్టరీ ఈ ఏడాది మూతపడింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం జిల్లా పర్యటనకు వస్తున్నారు. అధ్వానంగా వున్న సాగునీటి వనరులు, రహదారుల అభివృద్ధికి నిధుల కేటాయింపుపై, సహకార చక్కెర ఫ్యాక్టరీల పునరుద్ధరణ, గోవాడ చెరకు రైతులకు, కార్మికులకు బకాయిల చెల్లింపుపై సీఎం హామీలు ఇస్తారని జిల్లా వాసులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

అధ్వానంగా రహదారలు

జిల్లాలో రహదారులు అధ్వానంగా తయారయ్యాయి. వీటిలో చాలా వరకు గత ఏడాది ‘పల్లె పండుగ’ పేరుతో మరమ్మతు పనులు చేపట్టినప్పటికీ ఈ ఏడాది వర్షాకాలంలో పాడైపోయి, పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. గత వైసీపీ ప్రభుత్వం ఒక్క ఏడాది కూడా రహదారుల గురించి పట్టించుకోకపోవడమే ఈ దుస్థితికి కారణమన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత రహదారులు బాగుపడతాయని ప్రజలు ఆశించారు. గత ఏడాది పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలోని రహదారులకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టి, గోతులను చాలా వరకు పూడ్చారు. అయితే ఈ ఏడాది ఆగస్టు నుంచి అక్టోబరు వరకు కురిసిన భారీ వర్షాలతో రహదారులు ఛిద్రమై గోతులు మళ్లీ ప్రత్యక్షం అయ్యాయి. ఇక ఆర్‌అండ్‌బీ పరిధిలోని అనకాపల్లి- వెంకన్నపాలెం, సబ్బవరం మండలం లింగాలతిరుగుడు నుంచి వెంకన్నపాలెం, చోడవరం, వడ్డాది మీదుగా రోలుగుంట వరకు బీఎన్‌ రోడ్డు, వడ్డాది- పాడేరు రోడ్డులో వి.మాడుగుల మండల పరిధిలో, అడ్డరోడ్డు- నర్సీపట్నం రహదారిలో కోటవురట్ల మండంలోని ఇందేశమ్మవాక ప్రాంతంలో పూర్తిగా ఛిద్రం అయ్యాయి. వర్షం కురిస్తే గోతుల్లో నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. వర్షాలు లేకపోతే దుమ్ము, ధూళి ఎగిసి పడుతున్నది.

కదలిక లేని ఉత్తరాంధ్ర సుజల స్రవంతి

సుమారు ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు, వందలాది గ్రామాల ప్రజలకు తాగునీరు అందించడానికి రూపకల్పన చేసిన బాబూ జగ్జీవన్‌రామ్‌ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసింది. అనకాపల్లి జిల్లాలో కాలువ తవ్వకం కోసం సుమారు మూడు వేల ఎకరాలను సేకరించాల్సి ఉండగా ఇంతవరకు 1,850 ఎకరాల సేకరణ మాత్రమే జరిగింది. టీడీపీ గతంలో అధికారంలో వున్నప్పుడు తాళ్లపాలెం వద్ద చేపట్టిన కొద్దిపాటి పనులు మినహా, గత ఎడేళ్లకాలంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.

నత్తనడకన పోలవరం ఎడమ కాలువ పనులు

పోలవరం ఎడమ కాలువ పనులు సైతం గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పూర్తిగా పడకేశాయి. ఐదేళ్ల కాలంలో ఒక్క తట్ట మట్టి కూడా తవ్వలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత సుమారు ఏడాది వరకు ఇదే పరిస్థితి కొనసాగింది. ఎట్టకేలకు ఇటీవల పాయకరావుపేట నియోజకవర్గం పరిధిలో ఆరో ప్యాకేజీ కింద 111వ కిలోమీటరు నుంచి 136 కిలో మీటర పనులు మొదలయ్యాయి. అయితే అనుకున్నంత వేగంగా సాగడంలేదు. ఇక ఏడో ప్యాకేజీలో దార్లపూడి నుంచి కశింకోట మండలం తాళ్లపాలెం వరకు పనులు నత్తనడకన సాగుతున్నాయి.

షుగర్‌ ఫ్యాక్టరీలకు ‘సహకార’ం లభించేనా!

జిల్లాలో ఏడేళ్ల క్రితం వరకు సహకార రంగంలో నాలుగు షుగర్‌ ఫ్యాక్టరీలు వుండేవి. వీటిలో తుమ్మపాల, ఏటికొప్పాక, తాండవ ఫ్యాక్టరీలను గత వైసీపీ ప్రభుత్వం మూసివేయించింది. చోడవరం షుగర్‌ ఫ్యాక్టరీని గత ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోకపోవడంతో పీకల్లోతు నష్టాల్లోకి కూరుకుపోయింది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పరిస్థితి మరింత దిగజారింది. చెరకు రైతులకు, కార్మికులకు బకాయిలు చెల్లించలేక ఈ ఏడాది క్రషింగ్‌ జరపలేమంటూ యాజమాన్యం చేతులెత్తేసింది. గోవాడలో ఇథనాల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయిస్తామన్న కూటమి ప్రజాప్రతినిధుల హామీలు ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. దీంతో ఈ షుగర్‌ ఫ్యాక్టరీ భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైంది. సీఎం చంద్రబాబునాయుడు గోవాడతోపాటు మిగిలిన షుగర్‌ ఫ్యాక్టరీల పునరుద్ధరణ, ఇథనాల్‌ ప్లాంట్ల ఏర్పాటుపై స్పష్టమైన హామీ ఇస్తారని చెరకు రైతులు, ఫ్యాక్టరీల కార్మికులు ఆశగా ఎదురుచూస్తున్నారు.


నేడు సీఎం చంద్రబాబు రాక

తాళ్లపాలెంలో ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమానికి హాజరు

ప్రజావేదికలో గ్రామస్థులతో ముఖాముఖి

అనకాపల్లి హైవే జంక్షన్‌లో దివంగత మాజీ ప్రధాని వాజపేయి విగ్రహావిష్కరణ

అనకాపల్లి, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి):

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం జిల్లా పర్యటనకు రానున్నారు. ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా కశింకోట మండలం తాళ్లపాలెంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 11.15 గంటలకు తాళ్లపాలెం చేరుకుంటారు. ఇక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల కళాశాలకు చేరుకుంటారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో కొద్దిసేపు సమావేశమై మాట్లాడతారు. 11.45 గంటల నుంచి 11.55 గంటల వరకు తాళ్లపాలెం గ్రామస్థులతో మాట్లాడి పారిశుధ్య పనుల గురించి చర్చిస్తారు. అనంతరం బంగారయ్యపేటలో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని సందర్శిస్తారు. 12.35 గంటల వరకు ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొంటారు. 12.35 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి తాళ్లపాలెంలోని ప్రైవేటు లేఅవుట్‌లో ఏర్పాటు చేసిన ప్రజా వేదిక వద్దకు చేరుకుంటారు. 1.10 గంటల నుంచి 2.50 గంటల వరకు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 2.55 గంటల నుంచి 4.20 గంటల వరకు ఉగ్గినపాలెం గ్రామ టీడీపీ క్యాడర్‌తో, పార్టీ ముఖ్యనేతలతో, నక్కపల్లి మండలం రాజయ్యపేట మత్స్యకారులతో సమావేశమవుతారు. 4.30 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి 4.40 గంటలకు అనకాపల్లి జలగలమదుం జంక్షన్‌ సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో జాతీయ రహదారి డబుల్‌ ట్రంపెట్‌ వద్ద ఏర్పాటు చేసిన దివంగత మాజీ ప్రధాని వాజపేయి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం హెలిప్యాడ్‌కు చేరుకుని 5.35 గంటలకు హెలికాప్టర్‌లో విజయవాడకు బయలుదేరతారు.

Updated Date - Dec 20 , 2025 | 01:47 AM