దృష్టంతా చలానాలపైనే..
ABN , Publish Date - May 18 , 2025 | 12:28 AM
మహా నగరంలో ట్రాఫిక్ పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ట్రాఫిక్ నియంత్రణ గాలికి
వచ్చే వాహనాలను ఆపి పెండింగ్ చలానాల తనిఖీ
ఒక్కో పోలీస్ స్టేషన్‌కు రోజుకు 150 చలానాల టార్గెట్
ట్రాఫిక్ పోలీసుల తీరుపై విమర్శల వెల్లువ
విశాఖపట్నం, మే 17 (ఆంధ్రజ్యోతి):
మహా నగరంలో ట్రాఫిక్ పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోడ్డు ప్రమాదాలకు ఆస్కారం లేకుండా వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించాల్సింది పోయి, వచ్చిపోయే వాహనాలను నిలిపివేసి పెండింగ్ చలానాలు ఎన్ని ఉన్నాయో తనిఖీ చేయడంలో ట్రాఫిక్ పోలీసులు నిమగ్నమైపోతున్నారు. దీనివల్ల వాహనచోదకులు ఇష్టారాజ్యంగా రాకపోకలు సాగిస్తుండడంతో ప్రమాదాలకు అవకాశం కల్పించినట్టవుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నగరంలో వాహనాల రాకపోకలు సక్రమంగా సాగిపోయేలా చూసి, ట్రాఫిక్ జామ్‌లు జరగకుండా చూడడం, వాహనచోదకులంతా ట్రాఫిక్ నిబంధనలను పక్కాగా పాటించడం ద్వారా ప్రమాదాల బారినపడకుండా కాపాడడం కోసం ట్రాఫిక్ పోలీస్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. నగరంలో ప్రతీ కూడలి వద్ద ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌లు, ఐలాండ్‌లను ఏర్పాటు చేసి అక్కడ విధులు నిర్వర్తించేలా ఒక హెడ్‌కానిస్టేబుల్/కానిస్టేబుల్‌తోపాటు హోంగార్డును నియమిస్తున్నారు. వీరంతా తమకు కేటాయించిన డ్యూటీ వేళల్లో అక్కడ నిలబడి వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించడం, ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి వాహనాన్ని నడిపితే సెల్ ఫోన్‌లో ఫొటో తీసి తమపై అధికారికి పంపి ఈ-చలానా జారీ చేసేలా పనిచేయాల్సి ఉంటుంది.
అయితే గత కొద్దిరోజులుగా నగరంలో ఎక్కడ చూసినా ట్రాఫిక్ పోలీసులు తమ ప్రధానవిధిగా చెప్పుకునే ట్రాఫిక్ క్రమబద్ధీకరణను విస్మరించి.. నలుగురైదుగురు సిబ్బంది ఒక గ్రూపుగా ఏర్పడి ఆ రోడ్డులో వచ్చే వాహనాలన్నింటినీ ఆపుతున్నారు. ఒక్కో వాహనంపై పెండింగ్ ఈ-చలానాలు ఎన్ని ఉన్నాయనేది తనిఖీ చేస్తున్నారు. ఒకవేళ ఏదైనా వాహనానికి సంబంధించి పెండింగ్ చలానాలు ఉన్నట్టు తేలితే వారితో అక్కడికక్కడే ఆన్‌లైన్‌లో ఈ-చలానాల జరిమానాను కట్టించిన తరువాతే వాహనాన్ని విడిచిపెడుతున్నారు. ఇలా అందరూ ట్రాఫిక్ విధులను పక్కన పెట్టేసి ఈ-చలానాలను కట్టించడంలోనే నిమగ్నమవుతుండడంతో కూడళ్ల వద్ద వాహనాల రాకపోకలు ఇష్టారాజ్యంగా సాగిపోతున్నాయి. దీనివల్ల ప్రమాదాలు కూడా చోటుచేసుకుంటున్నాయని పలువురు వాహనచోదకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ట్రాఫిక్ పోలీసులతో పలువురు వాహనచోదకులు వాగ్వాదానికి కూడా దిగుతున్నారు. అయితే తామేమీ చేయలేమని, ఉన్నతాధికారులు చెప్పిన ఆదేశాలను పాటించాల్సిందేనని వారు వాపోతున్నారు. ప్రతిరోజూ 150 చలానాలను కట్టించాలని తమకు టార్గెట్ విధిస్తున్నారని, ఆ లక్ష్యాన్ని అందుకోలేకపోతే శాఖాపరమైన ఇబ్బందులకు తాము గురికావాల్సి వస్తుందని వాహనదారులకు నచ్చచెబుతూ ఈ-చలానాలను ట్రాఫిక్ పోలీసులు కట్టిస్తున్నారు.