రోజంతా ముసురు
ABN , Publish Date - Dec 02 , 2025 | 12:34 AM
మన్యంపై ఆదివారం సాయంత్రం నుంచి దిత్వా తుఫాన్ ప్రభావం చూపుతున్నది.
మన్యంపై దిత్వా తుఫాన్ ప్రభావం
మధ్యాహ్నం వరకు దట్టంగా పొగమంచు
ఆ తరువాత మోస్తరు వర్షం
వరి రైతుల్లో ఆందోళన
తాజా వాతావరణంతో జన జీవనానికి అంతరాయం
పాడేరు, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): మన్యంపై ఆదివారం సాయంత్రం నుంచి దిత్వా తుఫాన్ ప్రభావం చూపుతున్నది. తమిళనాడు, రాయలసీమ ప్రాంతాల్లోనే తుఫాన్ ప్రభావం అధికంగా ఉంటుందని భావించినప్పటికీ ఏజెన్సీలోనూ ఒక మోస్తరు వర్షం కొనసాగుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సోమవారం సైతం ముసురు వాతావరణం కొనసాగుతూ మోస్తరు వర్షం కురిసింది.
తాజా తుఫాన్ ప్రభావంతో ఈదురుగాలులు, ఉరుములు, పిడుగులు వంటివి లేకపోవడంతో కాస్త ఊరట చెందారు. కానీ కొనసాగుతున్న వర్షానికి జనజీవనానికి మాత్రం తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాగా ప్రస్తుతం వరి కోతలు, నూర్పుల సీజన్ కావడంతో రైతులు ఆయా పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో వర్షం కురిస్తే పంట నాశనమవుతుందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పలువురు రైతులు చాలా మేరకు పంటను కోసి సురక్షిత ప్రాంతాలకు తరలించగా, ఆలస్యంగా నాట్లు వేసిన రైతుల పంట ప్రస్తుతం కోసేసి పొలాల్లో ఉంచారు. తాజా వర్షాలకు ఆయా పంట దెబ్బతింటుందని ఆందోళన చెందుతున్నారు. ఇదే పరిస్థితి మరో రెండు మూడు రోజులు కొనసాగితే వరి పనలు తడిసిపోతాయని రైతులు అంటున్నారు.
తుఫాన్ నేపథ్యంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
దిత్వా తుఫాన్ ప్రభావంతో వాతావరణంలో మార్పుల కారణంగా మన్యంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. మూడు రోజుల క్రితం వరకు సింగిల్ డిజిట్‌లో ఉన్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు, రెండు రోజులుగా డబుల్ డిజిట్‌కు చేరుకున్నాయి. ఉదయం వేళలో పొగమంచు సైతం సోమవారం తగ్గుముఖం పట్టింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జల్లులతో కూడిన వర్షం, ఆ తరువాత ఒక మోస్తరు వర్షం కురిసింది. మధ్యాహ్నం మూడు గంటల తరువాత జిల్లా కేంద్రం పాడేరును పొగమంచు కమ్మేసింది. దీంతో వాహనాలు లైట్ల వెలుతురులో రాకపోకలు సాగించాయి. సోమవారం హుకుంపేటలో 15.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా, పెదబయలులో 15.5, అరకులోయలో 15.6, డుంబ్రిగుడ, జి.మాడుగులలో 16.7, పాడేరులో 15.8, చింతపల్లిలో 16.3, ముంచంగిపుట్టులో 16.4, అనంతగిరిలో 17.2, కొయ్యూరులో 20.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.