సెజ్ పరిశ్రమల్లో ప్రమాదాలపై అప్రమత్తత
ABN , Publish Date - Aug 12 , 2025 | 11:24 PM
జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా మంగళవారం రాంబిల్లి, అచ్యుతాపురం పోలీసు స్టేషన్లను తనిఖీ చేశారు. ఆయా స్టేషన్‌ల పరిసరాలను పరిశీలించి, రికార్డులు తనిఖీ చేశారు.
నేరాల కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలి
ఎస్పీ తుహిన్ సిన్హా
రాంబిల్లి, అచ్యుతాపురం పీఎస్‌ల తనిఖీ
రాంబిల్లి, అచ్యుతాపురం,ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా మంగళవారం రాంబిల్లి, అచ్యుతాపురం పోలీసు స్టేషన్లను తనిఖీ చేశారు. ఆయా స్టేషన్‌ల పరిసరాలను పరిశీలించి, రికార్డులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక ఆర్థిక మండలిలోని పరిశ్రమల్లో జరుగుతున్న ప్రమాదాల విషయంలో పోలీసు సిబ్బంది అప్రమత్తంగా వుండాలన్నారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు డ్రంకెన్ డ్రైవ్, తనిఖీలు చేపట్టాలని, అతివేగం, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడం, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం వంటివాటిపై దృష్టి సారించాలని చెప్పారు. తరచూ ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి, తగు నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అచ్యుతాపురంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తగు చర్యలు చేపట్టామని చెప్పారు. గంజాయి రవాణా, నాటుసారా తయారీదారులపై కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనుమానాస్పదంగా సంచరించే వారిని ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ద్వారా తనిఖీ చేయాలని సూచించారు. స్టేషన్ పరిధిలో అవసరమైన ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేయడంతోపాటు సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. రౌడీ షీటర్లు, చెడునడత కలిగిన వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. నేరాల నియంత్రణకు రాత్రిపూట గస్తీని ముమ్మరం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అపరిష్కృతంగా వున్న కేసుల గురించి తెలుసుకుని, త్వరగా పరిష్కరించాలని పలు సూచనలు చేశారు. ఎస్పీ వెంట రాంబిల్లిలో సీఐ నరసింగరావు, ఎస్‌ఐ నాగేంద్ర, అచ్యుతాపురంలో సీఐ నమ్మి గణేశ్, ఎస్‌ఐలు సుధాకర్, వెంకటరావు వున్నారు.