Share News

గంజాయి రవాణాపై అప్రమత్తం

ABN , Publish Date - Aug 21 , 2025 | 11:42 PM

జిల్లాలో గంజాయి రవాణాపై పోలీసు శాఖ అప్రమత్తమైంది. ఒడిశా నుంచి జిల్లా దాటి ఇతర జిల్లాలు, రాష్ట్రాల్లోకి గంజాయి రవాణా జరుగుతున్న నేపథ్యంలో గురువారం ‘ఆంధ్రజ్యోతి’లో ‘గంజాయి గుప్పు.. ఎవరిది తప్పు’ శీర్షికన ప్రచురించిన కథనానికి ఉన్నతాధికారులు స్పందించారు.

గంజాయి రవాణాపై అప్రమత్తం
గంజాయి రవాణాపై ’ఆంధ్రజ్యోతి’ కథనం క్లిప్పింగ్‌

కలకలం రేపిన ‘ఆంధ్రజ్యోతి’ కథనం

అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో ఘటనలపై నిఘా వర్గాల ఆరా

గంజాయి సాగు, రవాణాపై కఠినంగా వ్యవహరించాలని ఉన్నతాధికారుల ఆదేశం

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

జిల్లాలో గంజాయి రవాణాపై పోలీసు శాఖ అప్రమత్తమైంది. ఒడిశా నుంచి జిల్లా దాటి ఇతర జిల్లాలు, రాష్ట్రాల్లోకి గంజాయి రవాణా జరుగుతున్న నేపథ్యంలో గురువారం ‘ఆంధ్రజ్యోతి’లో ‘గంజాయి గుప్పు.. ఎవరిది తప్పు’ శీర్షికన ప్రచురించిన కథనానికి ఉన్నతాధికారులు స్పందించారు. గంజాయి విషయంలో పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించడంతో పాటు ఎక్కడా అవకతవకలు, లోటుపాట్లకు అవకాశం లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. గంజాయి స్మగ్లర్లతో లింకులపై ఆరా తీయాలని, అందుకు బాధ్యులపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌ను గంజాయి రహితం చేయాలనే ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా పటిష్ట చర్యలు చేపట్టడడంతో పాటు అందుకు విరుద్ధంగా వ్యవహరించే వారిపైనా కఠిన చర్యలు చేపట్టాలని సూచించారు. అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల పరిధిలో గంజాయి సాగు, రవాణాకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సహకరిస్తున్న వారిని గుర్తించాలని ఉన్నతాధికారులు నిఘా వర్గాలకు సూచించారు. ఈ క్రమంలో ఆ దిశగా నిఘా వర్గాలు చర్యలు చేపడుతున్నాయి. అలాగే స్మగ్లర్ల వాహనాలను వినియోగిస్తున్న పోలీసులకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నారు. అవసరమైన అన్ని చర్యలు చేపట్టి, గంజాయి రహితం దిశగా పక్కాగా చర్యలు చేపట్టాలని అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లోని పోలీసు యంత్రాంగానికి ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - Aug 21 , 2025 | 11:42 PM