Share News

మన్యంలో అలర్ట్‌

ABN , Publish Date - Nov 29 , 2025 | 11:43 PM

మావోయిస్టులు ఈ నెల 30న భారత్‌ బంద్‌కు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందస్తు చర్యల్లో భాగంగా గాలింపు చర్యలు, వాహన తనిఖీలను ముమ్మరం చేశారు.

మన్యంలో అలర్ట్‌
గూడెంకొత్తవీధిలో వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు

నేడు మావోయిస్టుల బంద్‌ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం

విస్తృతంగా వాహన తనిఖీలు

అనుమానితులపై నిఘా

గూడెంకొత్తవీధి, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టులు ఈ నెల 30న భారత్‌ బంద్‌కు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందస్తు చర్యల్లో భాగంగా గాలింపు చర్యలు, వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మాతో సహా మావోయిస్టు అగ్రనేతలు, దళ సభ్యులు మరణించిన విషయం తెలిసిందే. ఎదురుకాల్పులు, మావోయిస్టుల అరెస్టులకు వ్యతిరేకంగా మావోయిస్టులు ఆదివారం బంద్‌కు పిలుపునిచ్చారు. మావోయిస్టులు ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశం ఉందనే నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసులు వారం రోజులుగా సరిహద్దు అడవులను ప్రత్యేక పోలీసు బలగాలతో జల్లెడ పడుతున్నాయి. ఓ వైపు అడవులను గాలిస్తూనే ప్రధాన కేంద్రాల్లో వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. మండలంలోని రింతాడ, పెదవలస, జీకేవీధి, ధారకొండ, సీలేరు ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అనుమానితులపై ఆరా తీస్తూ గుర్తింపు కార్డులు, వాహనాల రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేసి విడిచిపెడుతున్నారు.

సీలేరులో...

సీలేరు: జీకేవీధి మండలం ఏవోబీ సరిహద్దుల్లోని సీలేరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పోలీస్‌ బలగాలు అప్రమత్తమయ్యాయి. సీలేరు ఎస్‌ఐ ఎండీ యాసిన్‌ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం నుంచి సీఆర్‌పీఎఫ్‌ స్పెషల్‌ పార్టీ బలగాలు విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టాయి. సరిహద్దుల్లో వచ్చీపోయే వాహనాలను, అనుమానిత వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. కొత్త వ్యక్తులు ఎవరైనా అనుమానాస్పదంగా గ్రామాల్లో సంచరిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని ఎస్‌ఐ యాసిన్‌ కోరారు.

వారపు సంతలో...

ముంచంగిపుట్టు: మండల కేంద్రంలో శనివారం జరిగిన వారపు సంతలో పోలీసులు గస్తీ నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నాలుగు రోడ్ల కూడలి, సంత నలుమూలల పోలీసులు పహారా కాశారు. మారుమూల గ్రామాల నుంచి సంతకు వచ్చే వాహనాలను, తిరుగు ప్రయాణం అయినవాటిని, ప్రయాణికుల లగేజీలను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. జోలాపుట్టు, దోడిపుట్టు రాత్రి బస్సు సర్వీసులను రద్దు చేశారు.

నేడు సీలేరు మీదుగా తిరిగే నైట్‌ సర్వీసులు రద్దు

సీలేరు : మావోయిస్టుల బంద్‌ నేపథ్యంలో సీలేరు మీదుగా నడిపే నైట్‌ సర్వీసులను, సీలేరు నైట్‌ హాల్టు బస్సును ఆదివారం రద్దు చేశామని విశాఖపట్నం డిపో మేనేజర్‌ మాధురి తెలిపారు. నిఘా వర్గాల హెచ్చరికల మేరకు జిల్లా పోలీసు ఉన్నతాధికారుల ముందస్తు చర్యల్లో భాగంగా సీలేరు మీదుగా తిరిగే నైట్‌ సర్వీసులను రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేశారని, ఈ మేరకు సీలేరు నైట్‌ హాల్ట్‌, విశాఖపట్నం- భద్రాచలం, అలాగే భద్రాచలం- విశాఖపట్నం నైట్‌ సర్వీసులను ఆదివారం రద్దు చేశామని ఆయన తెలిపారు. డే సర్వీసులు యథావిధిగా తిరుగుతాయని పేర్కొన్నారు.

Updated Date - Nov 29 , 2025 | 11:43 PM