ఎయిడెడ్ అధ్యాపకులు వెనక్కి...
ABN , Publish Date - Jun 01 , 2025 | 12:18 AM
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ఎయిడెడ్ అధ్యాపకులను ఎట్టకేలకు వెనక్కి పంపాలని ఏయూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
38 మందిని రిలీవ్ చేస్తూ ఏయూ వీసీ ఆదేశాలు
గత వీసీ ప్రసాదరెడ్డి హయాంలో నియామకం
మొదటినుంచి వ్యతిరేకిస్తూ వచ్చిన వర్సిటీ ప్రొఫెసర్లు
పట్టించుకోని వైసీపీ ప్రభుత్వం
కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రభుత్వ పెద్దల దృష్టికి...
విభాగాల అధిపతులు, ప్రిన్సిపాల్స్, సీనియర్ ప్రొఫెసర్ల అభిప్రాయం మేరకు తాజాగా నిర్ణయం
విశాఖపట్నం, మే 31 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ఎయిడెడ్ అధ్యాపకులను ఎట్టకేలకు వెనక్కి పంపాలని ఏయూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వైస్ చాన్సలర్ రాజశేఖర్ శనివారం ఆదేశాలు జారీచేశారు.
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఎయిడెడ్ కళాశాలల నుంచి పలువురు అధ్యాపకులను మాజీ వీసీ ప్రసాదరెడ్డి ఏయూలో చేర్చుకున్నారు. ఈ విషయమై వివిధ విభా గాలకు చెందిన సీనియర్ ప్రొఫెసర్లు, హెచ్‌వోడీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. యూనివర్సిటీ విద్యార్థులకు ఎయిడెడ్ అధ్యాపకులతో పాఠాలు ఎలా చెప్పిస్తారంటూ ప్రశ్నిస్తూ వచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా తీసుకు వచ్చారంటూ ఫిర్యాదులు చేశారు. ఎయిడెడ్ అధ్యా పకులను వెనక్కి పంపించాలంటూ పెద్దఎత్తున నిర సనలు కూడా చేపట్టారు. అయితే, గత వీసీ ప్రసాదరెడ్డి అవేమీ పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తరువాత పలువురు ఈ విషయాన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లారు. మంత్రి నారా లోకేష్‌ను కలిసి సమస్యను తెలియజేశారు. వర్సిటీలో ఎయిడెడ్ అధ్యాపకులను కొనసాగించడంపై విమర్శలు వస్తుండడంతో వీసీ జీపీ రాజశేఖర్ కొద్దిరోజుల కిందట అన్ని విభాగాలకు చెందిన అధిపతులు, ప్రిన్సిపాల్స్, సీనియర్ ప్రొఫెసర్లతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఎయిడెడ్ అధ్యాపకులను కొన సాగించాలా?, వద్దా.? అన్న అంశంపై వారి అభిప్రాయా లను స్వీకరించారు. అందరూ ముక్తకంఠంతో వెనక్కి పంపించాలని స్పష్టం చేశారు. ఈ మేరకు వారిని రిలీవ్ చేస్తూ వీసీ శనివారం ఆదేశాలు జారీచేశారు.
మిగిలిన 38 మంది
రాష్ట్రంలోని ఎయిడెడ్ కాలేజీల్లో పనిచేస్తున్న అధ్యాపకులను 2021లో ఏయూలో చేర్చుకునేందుకు అనుగుణంగా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. ఈ ఉత్తర్వులు రావడానికి అప్పటి వీసీ ప్రసాదరెడ్డి కీలకంగా వ్యవహరించారు. తొలుత 113 మంది చేరేందుకు సుముఖత వ్యక్తంచేశారు. అయితే, అనేక కారణాల వల్ల 83 మంది మాత్రమే చేరారు. వారు చేరినప్పటి నుంచి వర్సిటీ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకించడంతో కొద్దిరోజుల్లోనే 43 మంది వెనక్కి వెళ్లిపోయారు. మరో 40 మందిలో ఒకరు చనిపోగా, మరొకరు కొద్దిరోజుల కిందట వర్సిటీ నుంచి వెనక్కి వెళ్లిపోయారు. మిగిలిన 38 మందిని తాజాగా వర్సిటీ అధికారులు రిలీవ్ చేశారు.