Share News

నగరంలో ఏఐ టీఎంఎస్‌

ABN , Publish Date - Sep 15 , 2025 | 01:23 AM

నగరంలో రోడ్డు ప్రమాదాలకు అడుకట్టవేయడంతోపాటు నేరాల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెంట్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (ఏఐటీఎంఎస్‌) అమలుకు పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రతబాగ్చి కార్యాచరణ ప్రారంభించారు. ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించే వారిని సీసీ కెమెరాల ద్వారానే గుర్తించి, చాలాన్‌ పంపంతోపాటు, నేరాల్లో నిందితులుగా ఉన్నవారు రోడ్లపై కనిపిస్తే ఆ వివరాలు సమీపంలోని పోలీసులు చేరేలా దీనిని రూపొందించారు. దీనివల్ల నేరాల సంఖ్య కూడా తగ్గుముఖంపడుతుందని అంచనా వేస్తున్నారు. పైలట్‌ప్రాజెక్టు కింద నగరంలో ఐదు చోట్ల గతనెల పది, 11 తేదీల్లో నిర్వహించిన డెమోలో సత్ఫలితాలు వచ్చాయి.

నగరంలో ఏఐ టీఎంఎస్‌

రూ.250 కోట్ల నుంచి రూ.500 కోట్లు ఖర్చవుతుందని అంచనా

కేంద్రం నుంచి నిధుల సమీకరణకు ప్రతిపాదన

పైలట్‌ ప్రాజెక్టు కింద ఐదు చోట్ల గత నెల 10, 11 తేదీల్లో డెమో

ఎఫ్‌ఆర్‌ఎస్‌ ద్వారా అనుమానాస్పద వ్యక్తుల గుర్తింపు

14,149 ఉల్లంఘనలు నమోదు

డీపీఆర్‌ సమర్పించిన నాలుగు సంస్థలు

త్వరలో ఆర్‌ఎఫ్‌పీ పిలిచేందుకు అధికారుల కసరత్తు

(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)

నగరంలో రోడ్డు ప్రమాదాలకు అడుకట్టవేయడంతోపాటు నేరాల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెంట్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (ఏఐటీఎంఎస్‌) అమలుకు పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రతబాగ్చి కార్యాచరణ ప్రారంభించారు. ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించే వారిని సీసీ కెమెరాల ద్వారానే గుర్తించి, చాలాన్‌ పంపంతోపాటు, నేరాల్లో నిందితులుగా ఉన్నవారు రోడ్లపై కనిపిస్తే ఆ వివరాలు సమీపంలోని పోలీసులు చేరేలా దీనిని రూపొందించారు. దీనివల్ల నేరాల సంఖ్య కూడా తగ్గుముఖంపడుతుందని అంచనా వేస్తున్నారు. పైలట్‌ప్రాజెక్టు కింద నగరంలో ఐదు చోట్ల గతనెల పది, 11 తేదీల్లో నిర్వహించిన డెమోలో సత్ఫలితాలు వచ్చాయి.

నగరంలో ఏటా రెండువేల వరకు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిలో సగటున 400 మంది ప్రాణాలు కోల్పోతుండగా, మరో 1,600 మంది క్షతగాత్రులవుతున్నారు. వాహనాల సంఖ్యతో పాటు రోడ్డుప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. వాహనచోదకులు ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. హెల్మెట్‌ధారణపై అవగాహన కల్పిస్తున్నప్పటికీ పట్టించుకోవడం లేదు. ట్రిపుల్‌రైడింగ్‌, బైక్‌లతో జిగ్‌జాగ్‌లు, రాంగ్‌రూట్‌లో నడపడం, రేసింగ్‌లకు పాల్పడుతున్నారు. మరికొందరు మద్యంసేవించి వాహనాలను నడుతున్నారు. కారు నడిపేవారు సీటుబెల్ట్‌ ధరించడం లేదు. పోలీసులు ఉంటేనే నిబంధనలు పాటించడం, లేదంటే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దీనివల్ల నగరంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీపీ శంఖబ్రతబాగ్చి ట్రాఫిక్‌ నిర్వహణకు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించేందుకు సిద్ధమయ్యారు. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెంట్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ను అమలుచేయాలని భావించారు. దీనివల్ల హెల్మెట్‌లేకుండా వాహనం నడిపినా, సిగ్నల్‌ జంప్‌, ట్రిపుల్‌ రైడింగ్‌చేసినా, రాంగ్‌రూట్‌, నోపార్కిగ్‌జోన్‌లో పార్కింగ్‌, సీటుబెల్ట్‌ ధరించకపోయినా, సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ వాహనం నడిపినా కెమెరాలు గుర్తించి, ఫొటోలు, వీడియోలను తీసి, నంబర్‌ప్లేట్‌ ఆధారంగా జరిమానా లెక్కించి వాహనం యజమాని ఈ-చాలాన్‌ పంపుతుంది.

నగరంలో ్లచోరీలు, స్నాచింగ్‌లు, దోపిడీలు, హత్యలు, దాడులు, ఈవ్‌టీజింగ్‌లకు అడ్డుకట్టవేయడం ద్వారా క్రైమ్‌ రేట్‌ను తగ్గించేందుకు ఏఐటీఎంఎస్‌ ఉపయోగపడుతుందని సీపీ భావిస్తున్నారు. నేరస్తుల ఫొటోలు, ఇతర వివరాలతోపాటు స్టేట్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో, నేషనల్‌క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరోలోని డేటాను ప్రాజెక్టుకు అనుసంధానిస్తే వారు కనిపించగానే ఫేషియల్‌ రికగ్నైజేషన్‌ ద్వారా సమీపంలోని పోలీస్‌స్టేషన్‌కు సమాచారం చురుతుంది. దీనివల్ల ఏదైనా నేరం జరిగితే నిందితులను పట్టుకోవడంతోపాటు పాతనేరస్తులను, దాగివున్నవారిని సులభంగా పట్టుకునేందుకు వీలుంటుంది.

భారీగానే వ్యయం

ఏఐటీఎంఎస్‌ ప్రాజెక్టు అమలుకు కనీసం రూ.250 కోట్ల నుంచి రూ.500 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. అంతమొత్తాన్ని పోలీస్‌, జీవీఎంసీ భరించే పరిస్థితి లేదు. దీంతో కలెక్టర్‌, జీవీఎంసీ కమిషనర్‌తోపాటు ఎంపీ శ్రీభరత్‌తో చర్చించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరిస్తే ప్రాజెక్టును మూడుదశలుగా చేపట్టేలా ప్రణాళిక సిద్ధం చేశారు. దీనికి ఆమోదం లభిస్తే దేశంలోనే ఈ విధానం అమలుచేసిన మొదటి నగరంగా విశాఖకు గుర్తింపు దక్కుతుంది.

ఐదు జంక్షన్లలో డెమో

ప్రాజెక్టును అమలుచేయడానికి ముందు ఐదు సంస్థలతో పైలట్‌ ప్రాజెక్టుగా నగరంలోని ఐదు జంక్షన్లలో గతనెల పది, 11 తేదీల్లో ఉదయం పది నుంచి రాత్రి పది గంటల వరకు డెమో నిర్వహించారు. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన వాహనాల గుర్తింపు, వివరాలు సేకరించారు. ఎయిర్‌పోర్టు జంక్షన్‌ వద్ద హెల్మెట్‌లేకుండా వాహనం నడుపుతున్న 3,672 మంది ఫొటోలు, వీడియోలు తీసింది. 294 ట్రిపుల్‌రైడింగ్‌ వాహనాలను గుర్తించింది. సంగం శరత్‌ జంక్షన్‌లో రాంగ్‌రూట్‌లో వెళుతున్న 2,101వాహనాలను, నోపార్కింగ్‌ జోన్‌లో పార్క్‌ చేసిన 783 వాహనాలను గుర్తించింది. ఊర్వశిజంక్షన్‌ వద్ద సీట్‌బెల్ట్‌ పెట్టకుండా కారు డ్రైవింగ్‌ చేస్తున్న 2,631 మందితో పాటు 1,256 సిగ్నల్‌ జంపింగ్‌ వాహనాలను గుర్తించింది. రైల్వేస్టేషన్‌ డీ ఎల్‌ఓ జంక్షన్‌ వద్ద డెమోలో భాగంగా 35 కిలోమీటర్ల గరిష్ఠ వేగాన్ని నిర్ణయించగా అంతకంటే ఎక్కువ వేగంతో వెళుతున్న 3,412 వాహనాలను గుర్తించింది. ద్వారకాబస్‌స్టేషన్‌లో అనుమానాస్పద వ్యక్తుల సమాచారాన్ని టూటౌన్‌ పోలీసులకు పంపింది. దీంతో నాలుగు సంస్థలు సీపీకి డీపీఆర్‌ను అందజేశాయి.

త్వరలోనే ఆర్‌ఎఫ్‌పీ పిలుస్తాం

ఏఐ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ అమలుకు డెమో విజయవంతమయింది. నాలుగు సంస్థలు డీపీఆర్‌ అందజేశాయి. త్వరలో ఆర్‌ఎఫ్‌పీ పిలుస్తాం. నిధులను సమకూర్చుకునే అంశంపై ఆలోచిస్తున్నాం. కేంద్ర సహకారం కోసం ఎంపీ శ్రీభరత్‌ సానుకూలంగా స్పందించారు. ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే నగరంలో రోడ్డుప్రమాదాలు, నేరాల సంఖ్య తగ్గుతుంది.

- శంఖబ్రత బాగ్చి, సీపీ

Updated Date - Sep 15 , 2025 | 01:23 AM