Share News

ట్రాఫిక్‌ నియంత్రణకు ఏఐ

ABN , Publish Date - Jul 08 , 2025 | 12:59 AM

నగరంలో త్వరలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ఆధారంగా పనిచేసే ట్రాఫిక్‌ సిగ్నల్‌ వ్యవస్థ అందుబాటులోకి రానున్నది.

ట్రాఫిక్‌ నియంత్రణకు ఏఐ

  • ట్రాఫిక్‌ ఉల్లంఘనకు పాల్పడేవారి వాహనాలకు జరిమానాల విధింపు, ట్రాఫిక్‌ రద్దీని బట్టి సిగ్నల్స్‌ పడడం వంటి సేవలు అందుబాటులోకి...

  • నాలుగు సంస్థలు ఆసక్తి...

  • రెండు రోజుల క్రితం ఉన్నతాధికారులకు పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌

  • తక్కువ మొత్తానికి టెండర్‌ వేసే సంస్థకు అప్పగింత

విశాఖపట్నం, జూలై 7 (ఆంధ్రజ్యోతి):

నగరంలో త్వరలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ఆధారంగా పనిచేసే ట్రాఫిక్‌ సిగ్నల్‌ వ్యవస్థ అందుబాటులోకి రానున్నది. ఇందుకోసం పోలీస్‌ శాఖ, జీవీఎంసీ సంయుక్తంగా ప్రణాళికలు రూపొందించాయి. ఈ మేరకు నగరవ్యాప్తంగా ఉన్న సిగ్నల్స్‌ వద్ద ఏఐ ఆధారిత కెమెరాలను ఏర్పాటుచేసి, వాటిని నిర్వహించేందుకు ఆసక్తి గల సంస్థల నుంచి జీవీఎంసీ ప్రతిపాదనలను ఆహ్వానించింది. నోయిడాకు చెందిన మెటాఫ్యూజన్‌, బెంగళూరుకు చెందిన డేటా కార్ట్‌, హైదరాబాద్‌కు చెందిన బృహస్పతి టెక్నాలజీస్‌, ముంబైకి చెందిన సీఎంఎస్‌ కంప్యూటర్స్‌ సంస్థలు ఆసక్తి కనబరిచాయి. ఆయా సంస్థల ప్రతినిధులు నగరానికి వచ్చి జిల్లా కలెక్టర్‌ ఎంఎన్‌ హరేంధిరప్రసాద్‌, ఎంపీ ఎం.శ్రీభరత్‌ సమక్షంలో ఈనెల నాలుగున పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా ఏఐ ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ పనితీరు, వాటివల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ఏఐ ఆధారిత ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ అందుబాటులోకి వస్తే ట్రాఫిక్‌ ఉల్లంఘనకు పాల్పడేవారి వాహనాలకు సంబంధించిన ఫొటోలను తీసి, వాటి ఆధారంగా ఈ-చలాన్‌ ద్వారా జరిమానాలను విఽధించడం, ట్రాఫిక్‌ రద్దీని బట్టి సిగ్నల్స్‌ పడడం, అప్‌లోడ్‌ చేసిన సాఫ్ట్‌వేర్‌ ఆధారంగా పాత నేరస్థులు ఎవరైనా రోడ్లపై కనిపిస్తే వారి ఫొటోలను తీసి సమాచారాన్ని పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌రూమ్‌కు చేరవేయడం, ట్రాఫిక్‌ రద్దీ ఎక్కువగా ఉండే రోడ్ల వివరాలను కమాండ్‌ కంట్రోల్‌రూమ్‌ ద్వారా నగరంలో ప్రయాణించే వారికి తెలియజేయడంతోపాటు ప్రత్యమ్నాయ రోడ్ల వివరాలను సూచించడం వంటి సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ వివరించారు. తక్కువ మెత్తానికి ఏఐ ఆధారిత ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ ఏర్పాటు, నిర్వహణకు ముందుకువచ్చే సంస్థకు పనులు అప్పగిస్తామని జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌, సీపీ పేర్కొన్నారు. వీలైనంత త్వరగా ఏఐ ట్రాఫిక్‌ సిస్టమ్‌ను నగరంలో అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ సిస్టమ్‌ అందుబాటులోకి వస్తే నగరంలో ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు అడ్డుకట్టపడి, రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని నగరవాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jul 08 , 2025 | 12:59 AM