Share News

ఇకపై అగ్రికల్చర్‌ డిప్లొమా మూడేళ్లు

ABN , Publish Date - May 13 , 2025 | 12:05 AM

రెండేళ్ల అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ను మూడేళ్ల డిప్లొమా కోర్సుగా మార్పు చేస్తూ ఆచార్య ఎన్‌జీరంగా విశ్వవిద్యాలయం అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ కోర్సు స్థాయి పెంచి, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపర్చేందుకు విశ్వవిద్యాలయం ఈ నూతన డిప్లొమా విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది.

ఇకపై అగ్రికల్చర్‌ డిప్లొమా మూడేళ్లు
చింతపల్లి అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్న టీచింగ్‌ అసోసియేట్‌

రెండేళ్ల కోర్సు రద్దు

ఈ ఏడాది నుంచి నూతన విద్యావిధానంలో ప్రవేశాలు

- మూడేళ్ల డిప్లొమా పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఏజీబీఎస్సీ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశం

ఉత్తర్వులు జారీచేసిన ఆచార్య ఎన్‌జీరంగా విశ్వవిద్యాలయం అధికారులు

చింతపల్లి, మే 12 (ఆంధ్రజ్యోతి): రెండేళ్ల అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ను మూడేళ్ల డిప్లొమా కోర్సుగా మార్పు చేస్తూ ఆచార్య ఎన్‌జీరంగా విశ్వవిద్యాలయం అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ కోర్సు స్థాయి పెంచి, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపర్చేందుకు విశ్వవిద్యాలయం ఈ నూతన డిప్లొమా విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఈ వార్షిక సంవత్సరం నుంచే మూడేళ్ల కోర్సు విధానం అమలులోకి రానున్నది. ప్రస్తుతం అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ద్వితీయ సంవత్సరంలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులు మాత్రమే రెండేళ్ల కోర్సును పూర్తి చేసుకోనున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సామాన్య, మధ్యతరగతి గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు పదవ తరగతి అర్హతతో వ్యవసాయ విద్య ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఆచార్య ఎన్‌జీరంగా విశ్వవిద్యాలయం రెండేళ్ల కాల పరిమితి గల అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ కోర్సును 1999 నుంచి అందుబాటులోకి తీసుకొచ్చింది. తొలిసారిగా అనకాపల్లి, మార్టెరే(పశ్చిమగోదావరి)లో అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలను ఏర్పాటు చేశారు. 2005లో పొదనలకూరు(నెల్లూరు), రెడ్డిపల్లి(అనంతపురం), ఉటుకూరు(కడప)లో మూడు కళాశాలలు ఏర్పాటు చేశారు. ఈ కోర్సుకి విద్యార్థుల నుంచి డిమాండ్‌ పెరగడంతో 2007, 2011 నుంచి కళాశాలల సంఖ్యను పెంచడం జరిగింది. ప్రస్తుతం ఏపీలో ప్రభుత్వ అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలు 16, సీడ్‌ టెక్నాలజీ ఒకటి, ఆర్గానిక్‌ అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ కళాశాల ఒకటి, ప్రైవేటు అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలు 42, సీడ్‌ టెక్నాలజీ ఐదు, ఆర్గానిక్‌ అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ కళాశాల ఒకటి ఉన్నాయి. ఈ కళాశాలల్లో ఇప్పటి వరకు రెండేళ్ల కాలపరిమితి కలిగిన అగ్రికల్చర్‌ పాలిటెక్నికల్‌ కోర్సులను నిర్వహిస్తున్నారు.

ఉపాధి అవకాశాలు మెరుగు కోసం మూడేళ్లు

అగ్రికల్చర్‌ డిప్లొమా కోర్సు ద్వారా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచాలనే లక్ష్యంతో ఆచార్చ ఎన్‌జీరంగా విశ్వవిద్యాలయం అధికారులు రెండేళ్ల కాల పరిమితిని మూడేళ్ల కోర్సుగా స్థాయి పెంచారు. ఐదేళ్ల క్రితం వరకు రెండేళ్ల అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ కోర్సుకి మంచి డిమాండ్‌ ఉండేది. ఈ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు లభించేవి. ప్రస్తుతం ఈ కోర్సు అభ్యసించే విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తున్నది. దీంతో ఈ కోర్సును పటిష్టం చేసేందుకు ఎన్‌ఈపీ-2020, ఐసీఏఆర్‌, ప్రొఫెషనల్‌ స్టాండర్డ్‌ సెట్టింగ్‌ బాడీ(పీఎస్‌ఎస్‌బీ) విధివిధానాల ఆధారంగా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన కమిటీ అధ్యయనం చేసి మూడేళ్ల కోర్సు ప్రవేశపెట్టాలని సిఫారసు చేసింది. కమిటీ సిఫారసుతో ఐసీఏఆర్‌ విధివిధానాలు ఆధారంగా రెండేళ్ల అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ కోర్సును మూడేళ్ల డిప్లొమా కోర్సుగా మార్పు చేస్తూ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ ఉత్తర్వులు జారీచేశారు.

ఏజీబీఎస్సీ రెండో సంవత్సరంలో ప్రవేశం

మూడేళ్ల డిప్లొమా కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు అగ్రీసెట్‌ ద్వారా ఏజీబీఎస్సీ రెండవ సంవత్సరంలో ప్రవేశాలు పొందేందుకు అవకాశం కల్పించారు. ఇప్పటి వరకు రెండేళ్ల అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు అగ్రిసెట్‌ ద్వారా ఏజీబీఎస్సీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తున్నారు. మూడేళ్ల డిప్లొమా కోర్సులో ఏజీబీఎస్సీ ప్రథమ సంవత్సరం సిలబస్‌ను అనుసంధానం చేయనున్నారు. దీంతో ఇంటర్మీడియట్‌తో ఏజీబీఎస్సీకి వెళ్లే విద్యార్థుల కంటే డిప్లొమా ద్వారా ప్రవేశం పొందిన విద్యార్థులు సులభంగా రాణించగలుగుతారని విశ్వవిద్యాలయం అధికారులు అభిప్రాయపడుతుతున్నారు.

Updated Date - May 13 , 2025 | 12:05 AM