దన్‌ధాన్య కృషి యోజనతో వ్యవసాయాభివృద్ధి
ABN , Publish Date - Oct 11 , 2025 | 11:35 PM
జిల్లాలో వ్యవసాయాభివృద్ధికి ప్రధానమంత్రి దన్‌ధాన్య కృషి యోజన దోహదం చేస్తుందని జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ అన్నారు.
జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్
పాడేరు, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వ్యవసాయాభివృద్ధికి ప్రధానమంత్రి దన్‌ధాన్య కృషి యోజన దోహదం చేస్తుందని జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ అన్నారు. శనివారం దన్‌ధాన్య కృషి యోజనను ప్రధానమంత్రి మోదీ వర్చువల్‌గా ప్రారంభించిన సందర్భంగా కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. దేశవ్యాప్తంగా దన్‌ధాన్య కృషి యోజనలో వంద జిల్లాలను ఎంపిక చేస్తే.. దానిలో మన జిల్లా ఉండడం ఎంతో సంతోషమన్నారు. ఈ పథకంతో రానున్న ఆరేళ్లలో వ్యవసాయం, అనుబంధ రంగాలు గణనీయంగా అభివృద్ధి చెందుతాయన్నారు. రైతులకు సంపూర్ణంగా మేలు చేయాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన పీఎం దన్‌ధాన్య కృషి యోజనతో వ్యవసాయ స్థితిగతులు ఊహించని విధంగా మారుతాయన్నారు. గిరిజన రైతులు కూడా సంఘాలుగా ఏర్పడి వ్యవసాయాన్ని చేపట్టాలన్నారు. మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ.. రైతులను సంపూర్ణంగా ప్రోత్సహించి, వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికే ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జనపద కళలు, సృజనాత్మకత అకాడమీ చైర్మన్ వంపూరు గంగులయ్య, బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు పాంగి రాజారావు, జిల్లా వ్యవసాఽధికారి ఎస్‌బీఎస్.నందు, జిల్లా ఉద్యావనవనాధికారి కె.బాలకర్ణ, ప్రకృతి వ్యవసాయం జిల్లా అదనపు ప్రాజెక్టు మేనేజర్ ఎల్.భాస్కరరావు, చిన్ననీటి పారుదల శాఖ డీఈఈ నాగేశ్వరరావు, అధికారులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాల ప్రతినిధులు, ఆదర్శ రైతులు పాల్గొన్నారు.