Share News

ఉక్కు దూకుడు

ABN , Publish Date - Jun 12 , 2025 | 01:18 AM

స్టీల్‌ ప్లాంటు యాజమాన్యం బ్లాస్‌ ఫర్నే్‌స-3ను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 25వ తేదీ ముహూర్తంగా నిర్ణయించింది. ఇప్పటికే దానికి అవసరమైన ప్లేట్లను చైనా నుంచి దిగుమతి చేసుకొని అమరిక పనులు పూర్తిచేసింది. ప్లాంటును పూర్తిస్థాయి సామర్థ్యంతో నడిపి 100 శాతం ఉత్పత్తి చేయాలనేది యాజమాన్యం లక్ష్యం.

ఉక్కు దూకుడు

పూర్తిస్థాయి ఉత్పత్తిపై దృష్టి

25న మూడో బ్లాస్ట్‌ ఫర్నేస్‌

ప్రారంభానికి సన్నాహాలు

యాజమాన్యం యత్నాలు సఫలీకృతమయ్యేనా?

వర్షాలతో ఐరన్‌ఓర్‌ సరఫరాపై అనుమానం

మరమ్మతుల్లో 1, 3 కోక్‌ ఓవెన్‌ బ్యాటరీలు

సిబ్బంది కుదింపు మరో సమస్య

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

స్టీల్‌ ప్లాంటు యాజమాన్యం బ్లాస్‌ ఫర్నే్‌స-3ను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 25వ తేదీ ముహూర్తంగా నిర్ణయించింది. ఇప్పటికే దానికి అవసరమైన ప్లేట్లను చైనా నుంచి దిగుమతి చేసుకొని అమరిక పనులు పూర్తిచేసింది. ప్లాంటును పూర్తిస్థాయి సామర్థ్యంతో నడిపి 100 శాతం ఉత్పత్తి చేయాలనేది యాజమాన్యం లక్ష్యం. ఇప్పుడు రెండు బ్లాస్ట్‌ ఫర్నేసుల ద్వారా రోజుకు 14 వేల టన్నుల ఉక్కు ఉత్పత్తి చేస్తున్నారు. మూడో బ్లాస్ట్‌ ఫర్నేస్‌ ప్రారంభిస్తే 21 వేల టన్నులు తీయాల్సి ఉంటుంది. వాస్తవానికి అవసరమైన ముడి పదార్థాలు సమకూర్చుకోలేకే బీఎఫ్‌-3 మూతపడింది. ఇటీవల కేంద్రం రూ.11,440 కోట్లు, రాష్ట్రం తరఫున మరో రూ.2 వేల కోట్లు ఆర్థిక సాయం అందడంతో పూర్తి ఉత్పత్తికి ఏర్పాట్లు చేస్తున్నారు.

ఉక్కు తయారీకి ఐరన్‌ఓర్‌ చాలా అవసరం. ఛత్తీ్‌సగఢ్‌లోని బైలదిల్లా నుంచి ఐరన్‌ఓర్‌ వస్తుంది. రోజుకు ఎనిమిది ర్యాకులు అవసరం. ప్రస్తుతం వర్షాకాలం. కిరండోల్‌ లైనులో కొండ చరియలు విరిగి పడి రైళ్ల రాకపోకలు ఆగిపోతుంటాయి. అటువంటి పరిస్థితి ఎదురైనా బ్లాస్ట్‌ఫర్నేస్‌లు ఆగకుండా ఉండేందుకు తగిన నిల్వలు ఉంచుకోవాలి. రైల్వేపరంగా ర్యాకులను అవసరమైనన్ని సమకూర్చాల్సి ఉంది.

ఐరన్‌ఓర్‌ అవసరమైనంత లేకుంటే దానికి బదులుగా పెల్లెట్లు వినియోగిస్తారు. ఇవి ఖరీదైనవి. టన్నుకు రూ.5 వేలు అదనపు వ్యయం అవుతుంది. కాకపోతే మరింత నాణ్యమైన స్టీల్‌ తయారవుతుంది. ముందుచూపుతో యాజమాన్యం 1.5 లక్షల టన్నుల పెల్లెట్లను ముందుగానే కొనుగోలు చేసింది. టన్నుకు రూ.10,500 వెచ్చించింది. ఈ ధర ఉత్పత్తి వ్యయాన్ని పెంచుతుంది.

అలాగే పూర్తి ఉత్పత్తికి రోజుకు 13 వేల టన్నుల కోక్‌ అవసరం. అవసరమైన కోకింగ్‌ కోల్‌ను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. కోక్‌ ఓవెన్ల ద్వారా రోజుకు 410 పుష్‌లు తీయాల్సి ఉంటుంది. కోక్‌ ఓవెన్‌ బ్యాటరీలు ఐదు ఉండగా, వాటిలో 1, 3 బ్యాటరీలకు నిర్వహణ పనులు చేపట్టాల్సి ఉంది. దీనికి రూ.5 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. ఆ పనులు పూర్తి చేయడానికి కొన్ని నెలల సమయం పడుతుంది. ఆ పనులు చేపట్టకుండానే పూర్తి ఉత్పత్తికి యత్నిస్తున్నారు. అది సాధ్యం కాదని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. 370-380 పుష్‌లకు మించి రావని అంటున్నారు. ఇవి పూర్తిస్థాయిలో పనిచేయకపోతే రోలింగ్‌ మిల్స్‌ నడపడానికి అవసరమైన గ్యాస్‌ ఉత్పత్తి కాదు. ఆ పరిస్థితి ఉత్పన్నమైతే వాటిని కొంత సమయం ఆపి, మళ్లీ ప్రారంభించాల్సి ఉంటుంది. దీనిని డౌన్‌ అండ్‌ అప్‌గా వ్యవహరిస్తారు. రోజూ ఇదే విధంగా వాటిని నడిపితే రిఫ్రాక్టరీ వ్యవస్థ దెబ్బతింటుంది. అసలుకే మోసం వస్తుంది.

తగ్గిపోయిన సిబ్బంది

స్థిర వ్యయాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి కాంట్రాక్టు వర్కర్లను వేల సంఖ్యలో తొలగించేశారు. వారిలో నైపుణ్యం కలిగిన వారూ ఉండడం వల్ల ఇప్పుడు ప్లాంటును పూర్తిస్థాయిలో నడపడానికి ఇబ్బందులు వస్తాయి. కొన్ని కీలక విభాగాల నిర్వహణను కాంట్రాక్టుకు ఇచ్చినా వారు పూర్తిస్థాయిలో పనిచేస్తారనే విశ్వాసం లేదు. అధికారులను రోజుకు 12 గంటలు పనిచేయిస్తున్నారు. ఇలా ఎన్నాళ్లు తాము చేయగలమని ప్రశ్నిస్తున్నారు. సరైన యాజమాన్యం లేకపోవడం వల్లనే స్టీల్‌ప్లాంటు నష్టాల్లోకి వెళ్లిందని ప్రకటించిన కేంద్రం ఇప్పటికీ దిద్దుబాటు చర్యలు తీసుకోకుండా పూర్తి ఉత్పత్తికి వెళ్లడం ఏ విధంగా సమంజసమని ఉద్యోగ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. తమ వైపు పూర్తి సహకారం ఉంటుందని సంఘాలు ఘంటాపథంగా చెబుతున్నాయి. జీతాలు ఇవ్వకున్నా పనిచేస్తున్నామని, హెచ్‌ఆర్‌ఏ కట్‌ చేసినా మిన్నకున్నామని, విద్యుత్‌ చార్జీలు పెంచినా కడుతున్నామని, సిబ్బందిని వేల సంఖ్యలో తీసేసినా ధర్నాలు చేయవద్దంటే చేతులు కట్టుకొని ఉన్నామని, ఇంతకంటే ఇంకేమి చేయాలని వారు ప్రశ్నిస్తున్నారు. ఇదంతా యాజమాన్యానికి సహకారం కాదా? ఇప్పటికీ విశ్వసించరా? అంటూ వాపోతున్నారు. తోటి పనివారిని ఉద్యోగం లోనుంచి తీసేస్తే దానిని కూడా ప్రశ్నించకూడదంటే...ఇక ప్రజాస్వామ్యానికి అర్థం ఉందా? అని మథనపడుతున్నారు.

Updated Date - Jun 12 , 2025 | 01:18 AM