త్వరలో అధునాతన వైద్యం
ABN , Publish Date - Nov 09 , 2025 | 12:43 AM
స్థానిక ఎన్టీఆర్ వైద్యాలయం ఆవరణలో 50 పడకలతో నిర్మితమవుతున్న క్లిష్టతర వ్యాధుల సంరక్షణ విభాగం (క్రిటికల్ కేర్ బ్లాక్-సీసీబీ) ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నది. దీనిని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.22.25 కోట్లు మంజూరు చేసింది. ఇందులో రూ.15 కోట్ల వరకు భవన నిర్మాణానికి ఖర్చు చేయగా రూ.7 కోట్లతో అధునాతన వైద్య పరికరాలను సమకూరుస్తున్నారు. సీసీబీలో డయాలసిస్ యూనిట్, బర్న్‌వార్డు, హైరిస్క్ వార్డు, ఆపరేషన్ థియేటర్లు వుంటాయి. ఎక్స్‌రే ప్లాంట్, అలా్ట్రస్కాన్ వంటి పరికరాలు అందుబాటులోకి రానున్నాయి. భవనం మొత్తానికి ఏసీ సదుపాయం వుంది.
అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలో క్రిటికల్ కేర్ బ్లాక్
డయాలసిస్, బర్న్, హైరిస్క్ వార్డులు
ఆధునిక ఎక్స్‌రే ప్లాంట్, అలా్ట్రస్కాన్
ఈ నెలాఖరుకు భవనం అప్పగించనున్న కాంట్రాక్టర్
వైద్య పరికరాలు అమర్చిన వెంటనే సేవలు ప్రారంభం
అనకాపల్లి టౌన్, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్టీఆర్ వైద్యాలయం ఆవరణలో 50 పడకలతో నిర్మితమవుతున్న క్లిష్టతర వ్యాధుల సంరక్షణ విభాగం (క్రిటికల్ కేర్ బ్లాక్-సీసీబీ) ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నది. దీనిని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.22.25 కోట్లు మంజూరు చేసింది. ఇందులో రూ.15 కోట్ల వరకు భవన నిర్మాణానికి ఖర్చు చేయగా రూ.7 కోట్లతో అధునాతన వైద్య పరికరాలను సమకూరుస్తున్నారు. సీసీబీలో డయాలసిస్ యూనిట్, బర్న్‌వార్డు, హైరిస్క్ వార్డు, ఆపరేషన్ థియేటర్లు వుంటాయి. ఎక్స్‌రే ప్లాంట్, అలా్ట్రస్కాన్ వంటి పరికరాలు అందుబాటులోకి రానున్నాయి. భవనం మొత్తానికి ఏసీ సదుపాయం వుంది.
జాతీయ రహదారిపైన, పరిశ్రమల్లో సంభవించిన ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారిని తొలుత అనకాపల్లి ఎన్టీఆర్ వైద్యాలయానికి తీసుకువస్తుంటారు. అయితే ఇక్కడ అధునాతన వైద్య పరికరాలు, సూపర్ స్పెషాలిటీ వైద్యులు లేకపోవడంతో క్షతగాత్రులకు ప్రథమ చికిత్స చేసి, విశాఖ కేజీహెచ్‌కు రిఫర్ చేస్తున్నారు. దీనివల్ల సకాలంలో వైద్యం అందక పలువురు మృత్యువాత పడుతున్నారు. దీనిని నివారించడానికి, క్షతగాత్రులకు ఇక్కడే మెరుగైన వైద్యం అందించడానికి అత్యాధునిక పరికరాలతో ‘క్లిష్టతర వ్యాధుల సంరక్షణ విభాగాన్ని’ అందుబాటులోకి తీసుకురానున్నారు. వాస్తవంగా క్రిటికల్ కేర్ బ్లాక్ గత ప్రభుత్వ హయాంలోనే మంజూరుకాగా.. పనులు చాలా మందకొడిగా సాగాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పనులు వేగవంతం చేయించారు. భవన పనులు చాలా వరకు పూర్తయ్యాయి. ఆధునిక వైద్య పరికరాలను ఏర్పాటు చేసిన వెంటనే దీనిని ప్రారంభిస్తారని తెలిసింది. సీసీబీ సేవలు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయని డీసీహెచ్‌ఎస్ డాక్టర్ శ్రీనివాస్‌ను ‘ఆంధ్రజ్యోతి’ ప్రశ్నించగా.. కాంట్రాక్టర్ అన్ని పనులు పూర్తిచేసి ఈ నెలాఖరుకు భవనాన్ని అప్పగిస్తారని చెప్పారు. అధునాతన వైద్య పరికరాలు వస్తున్నాయని, కాంట్రాక్టర్ భవనం అప్పగించిన వెంటనే వీటిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. వీలైనంత త్వరగా రోగులకు సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన పేర్కొన్నారు.