ధాన్యం కొనుగోళ్లకు ముందస్తు ప్రణాళిక
ABN , Publish Date - Oct 08 , 2025 | 01:10 AM
ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు జిల్లా అధికారులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ధాన్యం అమ్ముకునే విషయంలో రైతులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా సంబంధిత అధికారులు, ఉద్యోగులకు దిశానిర్దేశం చేశారు. ధాన్యం విక్రయించడానికి ముందుకు వచ్చిన రైతులందరి నుంచి సేకరించాలని అధికారులు నిర్ణయించారు.
రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు
ఇప్పటికే సమన్వయ కమిటీ ఏర్పాటు
63 క్లస్టర్లుగా కొనుగోలు కేంద్రాలు
30 వేల టన్నుల వరకు ధాన్యం సేకరించే అవకాశం
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు జిల్లా అధికారులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ధాన్యం అమ్ముకునే విషయంలో రైతులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా సంబంధిత అధికారులు, ఉద్యోగులకు దిశానిర్దేశం చేశారు. ధాన్యం విక్రయించడానికి ముందుకు వచ్చిన రైతులందరి నుంచి సేకరించాలని అధికారులు నిర్ణయించారు. ధాన్యం సేకరణకు సంబంధించి ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్ కె.విజయకృష్ణన్, జేసీ జాహ్నవితో కలిసి పౌర సరఫరాల శాఖ అధికారులతో ఇటీవల సమీక్ష సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ జయంతి ఆధ్వర్యంలో ఽధాన్యం సేకరణకు సమన్వయ కమిటీని నియమించారు.
వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలో 54,465 హెక్టార్లలో వరి సాగు చేపట్టారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తుండడం, వాతావరణం అనుకూలంగా వుండడంతో వరిపైరు ఏపుగా పెరుగుతున్నది. ప్రస్తుతం దుబ్బు, పొట్ట దశల్లో వుంది. వచ్చే నెల రెండో వారం నుంచి వరి కోతలు మొదలయ్యే అవకాశం ఉంది. రైతులు తమ వెసులుబాటును బట్టి నూర్పిడి చేసి, ధాన్యం విక్రయిస్తారు. ధాన్యం సేకరణ, మిల్లులకు తరలింపు, రైతులకు డబ్బుల చెల్లింపు విషయంలో ఎక్కడా అన్నదాతలు ఇబ్బంది పడకుండా జిల్లా పౌర సరఫరాల సంస్థ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో సుమారు 90 వేల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. రైతులు ఇంటి అవసరాలు, వచ్చే ఏడాది పంట కోసం ఉంచుకునే విత్తనాలు పోగా, సుమారు 30 వేల టన్నుల ధాన్యం విక్రయిస్తారని అధికారులు భావిస్తున్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో ధాన్యం మద్దతు ధరలను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఏ గ్రేడ్ రకం క్వింటా రూ.2,389, సాధారణ రకం రూ.2,369కి కొనుగోలు చేయాలని నిర్దేశించింది. ధాన్యం కొనుగోలుకు ముందే ఈ-క్రాప్, ఈ-కేవైసీ నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ధాన్యం కొనుగోలులో ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా కస్టోడియన్ అధికారులను, మండల స్థాయిలో ధాన్యం కొనుగోలు కమిటీలను నియమించనున్నారు. ఈ కమిటీల ద్వారా ఏ ప్రాంతం నుంచి, ఎంత ధాన్యం వస్తుందో ముందుగానే అంచనా వేసి సేకరణ జరుపుతారు. జిల్లాను 63 క్లస్టర్లుగా విభజించి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు ఇప్పటికే అంచనాకు వచ్చారు. ధాన్యం నాణ్యత, తేమ శాతంపై కొనుగోలు కేంద్రాల సిబ్బందికి శిక్షణ ఇస్తారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కంప్యూటర్లు, గోనె సంచులు, తూనిక యంత్రాలు, తేమ శాతం కొలిచే పరికరాలను అందుబాటులో వుంచుతారు.