మద్యం దుకాణాల్లో కల్తీ జోరు!
ABN , Publish Date - May 26 , 2025 | 12:12 AM
నగరంలో కొన్ని మద్యం దుకాణాల్లో వ్యాపారులు మాయాజాలాన్ని ప్రదర్శిస్తున్నారు.
నగరంలోని పెద్ద సిండికేట్ల దుకాణాల్లో మాయాజాలం
ఖరీదైన మద్యం సీసాలో తక్కువ ధర మద్యం మిక్కింగ్ చేసి..
ఎవరికీ అనుమానం రాకుండా సీల్‌తోపాటు తెరిచి, తిరిగి బిగింపు
ఎక్సైజ్‌శాఖ పర్యవేక్షణపై విమర్శలు
(విశాఖపట్నం/ఆంధ్రజ్యోతి)
నగరంలో కొన్ని మద్యం దుకాణాల్లో వ్యాపారులు మాయాజాలాన్ని ప్రదర్శిస్తున్నారు. ఖరీదైన మద్యం బాటిళ్ల సీల్ మొత్తాన్ని తెరిచి.. కొంత సరకు తీసి తక్కువ ధర మద్యంతో నింపేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా నగరంలో పెద్ద సిండికేట్లుగా చలామణి అవుతున్న వ్యాపారులకు చెందిన దుకాణాల్లోనే ఈ తరహా మోసం జరుగుతోందని పలువురు మద్యం వ్యాపారులే ఆరోపిస్తుండడం చర్చనీయాంశంగా మారింది.
జీవీఎంసీ పరిధిలో 145 మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటన్నింటికీ గత ఏడాది ఆగస్టులో అధికారులు లాటరీ నిర్వహించి వ్యాపారులకు అప్పగించారు. గతంలో ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాల నిర్వహణ జరగ్గా.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తిరిగి ప్రైవేటుమద్యం షాపులకు అవకాశం కల్పించింది. దీంతో గతంలో మద్యం వ్యాపారంలో బాగా ఆర్జించిన వారంతా దుకాణాలను దక్కించుకునేందుకు పోటీపడి భారీ సంఖ్యలో దరఖాస్తులు వేశారు. మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ పూర్తయిన తరువాత బెల్ట్ షాపుల ద్వారా విక్రయాలను పెంచుకోవచ్చన భావించిన వ్యాపారులకు రాష్ట్ర ప్రభుత్వం ముకుతాడు వేసింది. కేవలం మద్యం దుకాణాల్లో మాత్రమే వీటి విక్రయాలు జరపాలని, లూజ్ సేల్స్ లేకుండా సీసాలతోనే విక్రయించాలనే నిబంధన విధించడంతో పాటు ఎవరైనా దీనిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. దీంతో అధికారులు కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు మాత్రమే మద్యం విక్రయాలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఈ పరిణామం భారీగా లాభాలు ఆర్జించవచ్చని భావించిన మద్యం వ్యాపారుల ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. దరఖాస్తుల కోసమే భారీగా డబ్బులు ఖర్చు పెట్టడం, లైసెన్స్ ఫీజుల కోసం అధికంగా పెట్టుబడి పెట్టడంతో ఎలాగైనా తాము వెచ్చించిన దానికి తగిన లాభాలను సంపాదించాలని మద్యం వ్యాపారంలో పెద్ద సిండికేట్లుగా చలామణి అవుతున్నవారు భావిస్తున్నారు.
ఇందులో భాగంగానే తమకు చెందిన దుకాణాల్లో ఖరీదైన మద్యం సీసాలో తక్కువ ఖరీదైన మద్యాన్ని నింపి విక్రయాలు జరుపుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా చేస్తున్న కల్తీపై ఎవరికీ అనుమానం రాని విధంగా సీల్‌తో పాటే సీసా రింగు, మూతను కలిపి బయటకు తీస్తున్నారు. ఖరీదైన సీసాలో 25 శాతం మద్యం తీసి తిరిగి ఆ మోతాదులో తక్కువ ధర మద్యంతో నింపుతున్నారు. దీనిని ఎవరూ గుర్తించ డానికి వీల్లేకుండా తిరిగి సీల్‌తో పాటే విడదీయకుండా తీసేసిన రింగు, మూతను అమర్చుతున్నారు. దీనివల్ల మద్యం సీసాను పట్టుకుని తదేకంగా పరిశీలించినా ఎలాంటి అనుమానం రాదని మద్యం వ్యాపారంలో ఉన్నవారే చెబుతున్నారు. దీనిపై ఎక్సైజ్ శాఖ అధికారులకు సమాచారం అందినా.. తమకున్న పలుకుబడి కారణంగా వారేమీ చేయరన్నది పెద్ద సిండికేట్ల ధీమా అని పేర్కొంటున్నారు. ఎక్సైజ్‌శాఖ అధికారులు ఇలాంటి కల్తీ వ్యవహారాలపై పటిష్ఠ నిఘా పెట్టి, కల్తీ జరిగినట్టు నిర్ధారణ అయితే వెంటనే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఆ స్థాయిలో నిఘా పెట్టకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. అదే చిన్నపాటి వ్యాపారులు, రాజకీయ అండదండలు లేనివారు ఎమ్మార్పీ ఉల్లంఘన చేసినా నానా హడావుడి చేసి భయాందోళనకు గురిచేస్తుంటారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.