అడ్మిషన్లు అంతంతే...
ABN , Publish Date - Jul 18 , 2025 | 12:59 AM
కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెరిగినప్పటికీ.. పలు ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులు అరకొరగానే వున్నారు. జిల్లాలో 61 పాఠశాలల్లో పది మంది, అంతకన్నా తక్కువ విద్యార్థులు వున్నట్టు జిల్లా విద్యా శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి మేరకు అదనంగా వున్న టీచర్లను ఇతర పాఠశాలలకు సర్దుబాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఫొటో:
17ఏకేపీ.1.
17ఏకేపీ.2. అనకాపల్లి మండలం గోపాలపురంలో ఏడుగురు విద్యార్థులు మాత్రమే వుండడంతో నిరుపయోగంగా వున్న భవనం
ప్రభుత్వ పాఠశాలల్లో అనుకున్న స్థాయిలో పెరగని ప్రవేశాలు
61 ప్రాథమిక పాఠశాలల్లో పది మందికన్నా తక్కువ విద్యార్థులు
అదనంగా ఉన్న ఉపాధ్యాయులు ఇతర స్కూళ్లకు సర్దుబాటు
ఈ నెలాఖరు వరకు కొనసాగనున్న స్పెషల్ డ్రైవ్
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెరిగినప్పటికీ.. పలు ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులు అరకొరగానే వున్నారు. జిల్లాలో 61 పాఠశాలల్లో పది మంది, అంతకన్నా తక్కువ విద్యార్థులు వున్నట్టు జిల్లా విద్యా శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి మేరకు అదనంగా వున్న టీచర్లను ఇతర పాఠశాలలకు సర్దుబాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
నూతన విద్యా విధానం అమలు పేరుతో గత వైసీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేసింది. దీంతో పలు ప్రాథమిక పాఠశాలలు ఒకటి, రెండు తరగతులకే పరిమితం అయ్యాయి. మూడు నుంచి ఐదో తరగతి వరకు సమీపంలోని ఉన్నత పాఠశాలలకు తరలించడంతో పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలను అంతదూరం పంపించడం ఇష్టం లేక ప్రైవేటు పాఠశాలల్లో చేర్చించారు. దీంతో ప్రాథమిక పాఠశాలలు అరకొర విద్యార్థులతో వెలవెలపోయాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్.. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచడానికి పలు చర్యలు చేపట్టారు. చాలా కాలం నుంచి అమలులో వున్న ఉచిత మధ్యాహ్న భోజనం, పుస్తకాలు, యూనిఫారంతోపాటు తల్లికి వందనం పథకాన్ని ప్రతి విద్యార్థికీ అమలు చేస్తున్నది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రవేశాలు ఆశాజనంగానే వున్నాయి. అయితే పలు ప్రాథమిక పాఠశాలల్లో కనీసస్థాయిలో విద్యార్థులు లేని పరిస్థితి నెలకొంది. ఇటువంటిచోట్ల అదనంగా వున్న ఉపాధ్యాయులకు విద్యా శాఖ అధికారులు ఇతర పాఠశాలలకు సర్దుబాటు చేస్తున్నారు.
అనకాపల్లి మండలం గోపాలపురం ప్రాథమిక పాఠశాలలో ఏడుగురు విద్యార్థులు మాత్రమే ఉన్నారు. దీంతో నాడు-నేడు కార్యక్రమం కింద గతంలో నిర్మించిన అదనపు భవనాలు ఖాళీగా వున్నాయి. ఎలమంచిలి మండలం లైన్ కొత్తూరు ఎంపీపీ పాఠశాలలో కూడా ఏడుగురు విద్యార్థులు మాత్రమే ఉన్నారు. ఈ రెండు పాఠశాలలు కాదు.. జిల్లాలో పది మంది లోపు విద్యార్థులున్న పాఠశాలలు 61 ఉన్నట్టు జిల్లా విద్యా శాఖాధికారులు గుర్తించి, ప్రభుత్వానికి నివేదించినట్టు తెలిసింది. జిల్లాలోని పాఠశాలల్లో ప్రవేశాలు తగ్గడం వాస్తవమేనని, అయితే కలెక్టర్ ఆదేశాల మేరకు పాఠశాలల్లో ప్రవేశాలు పెంచేందుకు స్పెషల్ డ్రైవ్ కొనసాగిస్తున్నట్టు జిల్లా విద్యా శాఖ అధికారి గిడ్డి అప్పారావునాయుడు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ఇది సత్ఫలితాలు ఇస్తుండడంతో ఈ నెలాఖరు వరకు స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందన్నారు.