Share News

ప్రకృతి అందాలకు ఫిదా

ABN , Publish Date - Nov 02 , 2025 | 11:14 PM

మన్యంలోని పర్యాటక ప్రాంతాల్లో ఆదివారం సందడి మొదలైంది. వాతావరణం ఆహ్లాదకరంగా ఉండడంతో పాటు ప్రకృతి అందాలు మరింత సుందరంగా దర్శనమిస్తుండడంతో జనం మన్యం బాట పడుతున్నారు. దీంతో ఆదివారం ఏజెన్సీలో ఎక్కడ చూసినా సందర్శకులే కనిపించారు.

ప్రకృతి అందాలకు ఫిదా
ధారాలమ్మ ఆలయం వద్ద ఆదివారం ఉదయం మంచు మేఘాలు కనువిందు చేసిన దృశ్యం

మన్యంలోని పర్యాటక ప్రాంతాలు రద్దీ

సందర్శకులతో కోలాహలం

కార్తీక మాసం పిక్నిక్‌ సీజన్‌ కావడంతో సందడి

పాడేరు, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): మన్యంలోని పర్యాటక ప్రాంతాల్లో ఆదివారం సందడి మొదలైంది. వాతావరణం ఆహ్లాదకరంగా ఉండడంతో పాటు ప్రకృతి అందాలు మరింత సుందరంగా దర్శనమిస్తుండడంతో జనం మన్యం బాట పడుతున్నారు. దీంతో ఆదివారం ఏజెన్సీలో ఎక్కడ చూసినా సందర్శకులే కనిపించారు.

అనంతగిరి మండలంలో బొర్రా గుహలు మొదలుకుని చింతపల్లి మండలం లంబసింగి వరకు సందడి మొదలైంది. అనంతగిరి మండలంలో బొర్రా గుహలు, కటికి, తాడిగుడ జలపాతాలు, అరకులోయ మండలంలో మాడగడ మేఘాల కొండ, గిరిజన మ్యూజియం, పద్మాపురం ఉద్యానవనం, గిరి గ్రామదర్శిని, డుంబ్రిగుడ మండలంలోని చాపరాయి జలవిహారి, పాడేరు మండలంలో మోదాపల్లి కాఫీ తోటలు, వంజంగి హిల్స్‌, జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం, చింతపల్లి మండలంలో తాజంగి రిజర్వాయర్‌, చెరువువేనం మేఘాల కొండ, లంబసింగి, యర్రవరం జలపాతం తదితర ప్రాంతాలను పర్యాటకులు సందర్శించారు. ఏజెన్సీలో పర్యాటకుల తాకిడి పెరగడంతో పాటు పిక్నిక్‌ల సీజన్‌ కొనసాగుతున్నదని స్థానిక తెలిపారు.

అరకులోయలో..

అరకులోయ: కార్తీక మాసంతో పాటు ఆదివారం కావడంతో అరకులోయకు పర్యాటకులు అధిక సంఖ్యలో వచ్చారు. పద్మాపురం గార్డెన్‌, గిరిజన మ్యూజియం, మాడగడ సన్‌రైజ్‌ హిల్స్‌, సుంకరమెట్ట ఉడెన్‌బ్రిడ్జి, గాలికొండ వ్యూపాయింట్‌ను సందర్శించారు. పద్మాపురం గార్డెన్‌లో హాట్‌ ఎయిర్‌ బెలూన్‌లో విహరించి ప్రకృతి అందాలను ఆస్వాదించారు. ఎక్కువ మంది పర్యాటకులు శనివారం సాయంత్రమే అరకులోయ చేరుకుని రిసార్టులు, లాడ్జిల్లో బస చేశారు. ఉదయాన్నే మాడగడకు చేరుకుని మంచు మేఘాలను తిలకించారు. సూర్యోదయం సమయంలో మంచును చీల్చుకుంటూ వచ్చే భానుడి కిరణాలను కెమెరాల్లో బంధించారు.

Updated Date - Nov 02 , 2025 | 11:14 PM