సచివాలయాల ఉద్యోగుల సర్దుబాటు
ABN , Publish Date - Apr 11 , 2025 | 11:03 PM
గ్రామాల్లో ప్రజలకు మెరుగైన పౌర సేవలను అందించాలనే లక్ష్యంతో గ్రామ సచివాలయాల ఉద్యోగుల సర్దుబాటుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. జనాభా ఆధారంగా సచివాలయాల్లోని సిబ్బందిని మూడు కేటగిరిల్లో సర్దుబాటు చేయనుంది.

జనాభా ఆధారంగా ఏ, బీ, సీలుగా విభజన
జిల్లాలో మొత్తం 352 సచివాలయాలు
2,500 పైబడి జనాభా ఉన్నవి 19 మాత్రమే
2500 మంది జనాభాకు ఆరుగురు,
2,500 నుంచి 3,500లోపు జనాభా ఉంటే ఏడుగురు,
3,500 పైబడిన జనాభాకు ఎనిమిది మంది సిబ్బంది
త్వరలో సచివాలయాలకు సిబ్బంది కేటాయింపు
వారం రోజుల ముందే చెప్పిన ‘ఆంధ్రజ్యోతి’
(పాడేరు-ఆంధ్రజ్యోతి)
గ్రామాల్లో ప్రజలకు మెరుగైన పౌర సేవలను అందించాలనే లక్ష్యంతో గ్రామ సచివాలయాల ఉద్యోగుల సర్దుబాటుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. జనాభా ఆధారంగా సచివాలయాల్లోని సిబ్బందిని మూడు కేటగిరిల్లో సర్దుబాటు చేయనుంది. ఈ అంశంపై ఈనెల ఆరున ‘ఆంధ్రజ్యోతి’లో ‘గ్రామ సచివాలయాల వ్యవస్థ ప్రక్షాళన’ శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురించిన సంగతి పాఠకులకు తెలిసిందే.
జిల్లాలో 2,500 జనాభా పైబడినవి 19 మాత్రమే
జిల్లాలో 22 మండలాల్లోని 352 గ్రామ సచివాలయాలను ఏ, బీ, సీలుగా విభజించి, సిబ్బందిని కేటాయించనున్నారు. 2,500 లోపు జనాభా ఉన్న సచివాలయంలో ఆరుగురు సిబ్బంది, 2,500 నుంచి 3,500 మంది సిబ్బంది ఉంటే ఏడుగురు, 3,500 పైబడి జనాభా ఉంటే 8 మంది సిబ్బందిని ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలోని 352 సచివాలయాల్లో 2,500 పైబడి జనాభా ఉన్న సచివాలయాలు 19 మాత్రమే ఉన్నాయి. మిగిలిన 333 సచివాలయాల్లో 2,500 మంది లోపు జనాభా ఉంది. దీంతో అధిక సంఖ్యలో సచివాలయాల్లో ఆరుగురు సిబ్బందిని పక్కాగా నియమించే అవకాశాలున్నాయి. దీంతో ఇన్నాళ్లు పనిభారంతో సతమతమవుతున్న సిబ్బంది ఊరట కలగడంతోపాటు ప్రజలకు సకాలంలో పౌర సేవలు అందే పరిస్థితులు ఏర్పడ్డాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
సర్దుబాటుతో బహుళ ప్రయోజనం
గ్రామ సచివాలయాల ఉద్యోగుల సర్దుబాటుతో బహుళ ప్రయోజనాలు కలుగుతాయని అధికారులు, సిబ్బంది అంటున్నారు. ప్రస్తుతం ఒక ప్రాతిపదిక లేకపోవడంతోపాటు ఉన్నచోట అధికంగాను, లేని చోట తక్కువగాను సిబ్బంది ఉంటున్నారు. దీంతో కొంతమంది సిబ్బందిపై పని భారం పడుతుండగా, మరికొందరికి పని లేని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితులు సిబ్బంది మధ్య సఖ్యతను దెబ్బతీయడంతోపాటు ప్రజలకు మెరుగైన సేవలు అందని దుస్థితి నెలకొంది. తాజా నిర్ణయంతో అటువంటి సమస్యలకు ఆస్కారం లేకుండా సచివాలయ పాలన సజావుగా సాగుతుందని సిబ్బంది అంటున్నారు.