సాంకేతికతను అందిపుచ్చుకున్న ఆదివాసీలు
ABN , Publish Date - Nov 21 , 2025 | 11:32 PM
ఆదివాసీ రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్నారు. కాఫీ పార్చిమెంట్ తయారీకి మోటారు పల్పర్లను వినియోగిస్తున్నారు. మార్కెట్‌లో పార్చిమెంట్‌కి అధిక ధర లభిస్తుండడంతో కాఫీ పండ్లను పల్పర్ సహాయంతో పల్పింగ్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
మోటారు పల్పర్‌తో కాఫీ పల్పింగ్
పార్చిమెంట్ తయారీలో నిమగ్నం
ధర అధికంగా లభించడంతో ఆసక్తి
చింతపల్లి, నవంబరు 21(ఆంధ్రజ్యోతి):కాఫీ దిగుబడులు ప్రారంభం కావడంతో రైతులు పండ్లను సేకరించడం, వెంటనే పల్పింగ్ పనుల్లో నిమగ్నమవుతున్నారు. గిరిజన ప్రాంతంలో రైతులు 60 ఏళ్ల నుంచి కాఫీని సంప్రదాయేతర పంటగా సాగు చేస్తున్నారు. కాఫీ సాగులో కాలక్రమేణ మెలకువలు నేర్చుకుంటూ నాణ్యమైన దిగుబడులు సాధిస్తున్నారు. గిరిజన ప్రాంత రైతులు సాగు చేస్తున్న అరకు కాఫీ విశిష్టత ఖండంతరాలకు విస్తరించింది. కాఫీ సాగు, మార్కెటింగ్‌ని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. కాఫీ మార్కెటింగ్‌కి ముఖ్యమంత్రి చంద్రబాబు బ్రాండింగ్ తీసుకొస్తున్నారు. దీంతో కాఫీకి గత ఏడాది రికార్డు స్థాయిలో ధరలు లభించాయి. కాఫీ చెర్రీ కంటే పార్చిమెంట్‌కి రెట్టింపు ధర లభిస్తుంది. గతంలో రైతులు కాఫీ పండ్లను చెర్రీగా తయారు చేసుకుని విక్రయించేవారు. దీంతో రైతులు 50 శాతం ధరను నష్టపోయేవారు. దీంతో పార్చిమెంట్ కాఫీ తయారీ కోసం కేంద్ర కాఫీ బోర్డు ప్రోత్సహిస్తూ రాయితీపై బేబీ పల్పర్లను పంపిణీ చేసింది. ఈ పల్పర్లను మాన్యువల్‌గా(చేతితో) పండ్లను పల్పింగ్ చేయాల్సి వచ్చేది. దీంతో పార్చిమెంట్ తయారీకి అధికంగా శ్రమించాల్సి వస్తుందని రైతులు పార్చిమెంట్ తయారీపై ఆసక్తి చూపలేదు. దీంతో ఎన్‌డీఏ ప్రభుత్వం మోటారు పల్పర్లను గత ఏడాది కేంద్ర కాఫీ బోర్డు ద్వారా 50 శాతం రాయితీపై రైతులకు పంపిణీ చేస్తున్నది. దీంతో రైతులు మోటారు పల్పర్ల సహాయంతో పల్పింగ్ చేసుకుని పార్చిమెంట్ ఉత్పత్తి చేస్తున్నారు. ప్రస్తుతం జీసీసీ పార్చిమెంట్ కిలోకి రూ.450 ధర ప్రకటించింది, బెంగళూరు మార్కెట్‌లో కిలో రూ.520 నుంచి రూ.530ధర లభిస్తున్నది. గిరిజన రైతులు కాఫీని పార్చిమెంట్ తయారీకి ఆసక్తి చూపడంతో ఈ ఏడాది అధిక ఆదాయం పొందే అవకాశముందని కేంద్ర కాఫీ బోర్డు అధికారులు చెబుతున్నారు.