Share News

ఆదివాసీ స్పెషల్‌ డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేయాలి

ABN , Publish Date - Apr 22 , 2025 | 12:24 AM

ఆదివాసీ స్పెషల్‌ డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసి శతశాతం ఆదివాసీ నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ ఏజెన్సీ డీఎస్సీ సాధన కమిటీ ఆధ్వర్యంలో గిరిజన సంఘం, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఆదివాసీ స్పెషల్‌ డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేయాలి
రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న గిరిజన సంఘం నాయకులు

రోడ్డుపై బైఠాయించి గిరిజన సంఘం నాయకుల నిరసన

పాడేరురూరల్‌, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): ఆదివాసీ స్పెషల్‌ డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసి శతశాతం ఆదివాసీ నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ ఏజెన్సీ డీఎస్సీ సాధన కమిటీ ఆధ్వర్యంలో గిరిజన సంఘం, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. అంతకు ముందు గిరిజన సంఘం కార్యాలయం నుంచి ఐటీడీఏ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టగా, పోలీసులు అడ్డుకోవడంతో ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఈ క్రమంలో గిరిజన సంఘం నాయకులు, పోలీసుల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. మంత్రితో మాట్లాడిస్తామని వారికి పోలీసులు నచ్చజెప్పడంతో శాంతించారు. అక్కడ నుంచి ఐటీడీఏ పాలక వర్గ సమావేశంలో ఉన్న గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మడి సంధ్యారాణిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు పి.అప్పలనర్స మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గతంలో ఇచ్చిన హామీని కూడా విస్మరించారన్నారు. జీవో నంబర్‌ 3ను రద్దు చేసి ఐదేళ్లు అయినా పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయడం లేదన్నారు. మెగా డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేయగా, గిరిజన సంక్షేమశాఖలో 889 పోస్టులు అల్లూరి జిల్లా ఆదివాసీలకు కేటాయించాల్సి ఉందన్నారు. అయితే ఆదివాసీలకు కేవలం 57 పోస్టులు మాత్రమే కేటాయించడం దారుణమన్నారు. ప్రభుత్వం తక్షణమే జనరల్‌ డీఎస్సీ నోటిఫికేషన్‌తో పాటు ఆదివాసీ స్పెషల్‌ డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీకి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు పి.బాలదేవ్‌, ఎస్‌.ధర్మన్నపడాల్‌, కార్తీక్‌, జీవన్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 22 , 2025 | 12:24 AM