Share News

కృష్ణాపురం వనవిహారిలో అదనపు సదుపాయాలు

ABN , Publish Date - Jun 07 , 2025 | 11:13 PM

ఆంధ్రకశ్మీర్‌ లంబసింగి సమీపంలోని కృష్ణాపురం వనవిహారి (ఎకో టూరిజం ప్రాజెక్టు)లో అతిథులకు అదనపు సదుపాయాలు కల్పించేందుకు అటవీ శాఖ కార్యాచరణ ప్రారంభించింది. వనవిహారి అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.70 లక్షలను విడుదల చేసింది. ఈ నిధులతో సెమీ పర్మినెంట్‌ కాటేజీలు, చిల్డ్రన్‌ పార్కు, అడ్వెంచర్‌, గిరిజన వ్యవసాయ ఉత్పత్తుల హాట్‌ బజార్‌ నిర్మాణాలను నిర్మించనుంది.

కృష్ణాపురం వనవిహారిలో అదనపు సదుపాయాలు
పర్యాటకులు బస చేసేందుకు ఏర్పాటు చేసిన టెంట్లు

రూ.70లక్షలు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం

సెమి పర్మినెంట్‌ కాటేజీల నిర్మాణాలకు ప్రణాళిక

పర్యాటకుల చిల్డ్రన్‌ పార్కు, అడ్వెంచర్‌

గిరిజనులతో వ్యవసాయ ఉత్పత్తుల హాట్‌ బజార్‌

సీజన్‌నాటికి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు

చింతపల్లి, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి):

ఆంధ్రకశ్మీర్‌ లంబసింగికి గత ఐదేళ్లుగా పర్యాటకుల తాకిడి విపరీతంగా పెరిగింది. పర్యాటక సీజన్‌(నవంబరు-మార్చి)లో లంబసింగికి లక్షల్లో పర్యాటకులు సందర్శిస్తున్నారు. లంబసింగి వచ్చిన పర్యాటకులు బస చేసేందుకు వనవిహారిని అధికారులు గత ఏడాది అందుబాటులోకి తీసుకొచ్చారు. లంబసింగికి ఆరు కిలోమీటర్ల దూరంలో కృష్ణాపురం ఫైన్‌ తోటల్లో వనవిహారిని నిర్మించారు. లంబసింగి, కొత్తపల్లి జలపాతాలు, పాడేరు, అరకు ప్రాంతాలకు వెళ్లే పర్యాటకులు ఈమార్గంలోనే ప్రయాణించాలి. దీంతో బస చేసేందుకు వనవిహారి అత్యంత అనువుగా ఉందని పర్యాటకులు అంటున్నారు. సాధారణంగా కృష్ణాపురం ఫైన్‌ తోటల వద్ద సందర్శకులు ఆగి ఫొటోలు తీసుకొని, కొంత సమయ విశ్రాంతి తీసుకొని వెళుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన అటవీ శాఖ ఉన్నతాధికారులు కృష్ణాపురం ఫైన్‌ తోటల వద్ద వనవిహారిని అందుబాటులోకి తీసుకొచ్చారు. గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.25 లక్షలతో అత్యంత సహజసిద్ధంగా ప్రకృతి అందాలను ఆస్వాదించే అనువుగా వనవిహారిని రూపొందించారు. పర్యాటకులు బస చేసేందుకు 15 సింగిల్‌ టెంట్లు, 10 డబుల్‌ టెండ్లు, క్యాంటీన్‌ ఏర్పాటు చేశారు. రన్నింగ్‌ వాటర్‌, అంతర్గత రోడ్లు, మరుగుదొడ్లు నిర్మించారు. మెయిన్‌ గేట్‌ పూర్తిగా ఉడ్‌తో సుందరంగా తీర్చిదిద్దారు. వనవిహారి వినోదం కోసం ఆర్చరీ, ఊయలలు ఏర్పాటు చేశారు. పర్యాటకులు వాకింగ్‌ చేసేందుకు 4కిలోమీటర్ల ట్రెక్కింగ్‌ పాత్‌ ఏర్పాటు చేశారు. పర్యాటకులు భోజనాలు, అల్పాహారం తీసుకునేందుకు అనువుగా వుడ్‌ టేబుల్స్‌ను ఏర్పాటు చేశారు.

అందుబాటులోకి రానున్న సదుపాయాలు

వనవిహారి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.70లక్షలు మంజూరు చేయడంతో అదనపు సదుపాయాలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అటవీ శాఖ అధికారులు చర్యలు ప్రారంభించారు. పర్యాటకుల లగ్జరీ స్టే కోసం కేరళాలో అత్యంత ప్రాచుర్యం పొందిన సెమీ పర్మినెంట్‌ కాటేజీలు నాలుగు నిర్మించనున్నారు. ఈ కాటేజీల్లో డబుల్‌ బెడ్‌రూమ్‌, లివింగ్‌ ఏరియా, డ్రస్సింగ్‌ రూమ్‌, వాష్‌ రూమ్‌, టాయిలెట్స్‌ వుంటాయి. అలాగే చిల్డ్రన్‌ పార్కు, అడ్వెంచర్‌ (సాహస క్రీడలు) అందుబాటులోకి తీసుకురానున్నారు. స్థానిక గిరిజనులు పర్యాటకులకు అటవీ, వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులు విక్రయించుకునేందుకు అనువుగా హాట్‌ బజార్‌ నిర్మించనున్నారు.

రిజర్వేషన్‌ సదుపాయం

పర్యాటక సీజన్‌లో సందర్శకులు వనవిహారిలో టెంట్లు ముందుగా రిజర్వేషన్‌ చేసుకోవచ్చు. పర్యాటకులు రిజర్వేషన్‌ కోసం 9441107646 నంబర్‌కి కాల్‌ చేయవచ్చు. డబుల్‌ టెంట్‌ రూ.1,200, సింగల్‌ టెంట్‌ రూ.800 ధరలకు అందుబాటులో ఉన్నాయి. ప్రవేశ రుసుము రూ.30, కార్‌ పార్కింగ్‌కి రూ.20 ఫొటో షూటింగ్‌కి రూ.1000 చెల్లించాల్సి వుంది.

నవంబరు నాటికి అదనపు సదుపాయాలు

డీవీ నరసింహరావు, డీఎఫ్‌వో, చింతపల్లి

పర్యాటకులకు వనవిహారిలో అదనపు సదుపాయాలు నవంబరు నాటికి అందుబాటులోకి తీసుకు వస్తాం. సెమి పర్మినెంట్‌ కాటేజీలు, చిల్డ్రన్‌ పార్కు, అడ్వెంచర్‌, హాట్‌ బజార్‌ నిర్మాణాలు జూలైలో ప్రారంభిస్తాం. మూడు నెలల్లో పనులు పూర్తి చేస్తాం. వనవిహారిలో సహజసిద్ధమైన ప్రకృతి అందాలు, అడవులను పర్యాటకులకు పరిచయం చేయడం ప్రధాన లక్ష్యం.

Updated Date - Jun 07 , 2025 | 11:13 PM