Share News

కార్మిక శాఖలో అదనపు వసూళ్లు?

ABN , Publish Date - Dec 17 , 2025 | 01:08 AM

వాణిజ్య, వ్యాపార సంస్థలకు సంబంధించి రిజిస్ర్టేషన్‌ పనులకు కార్మిక శాఖలో కొంతమంది సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయించిన ఫీజుతోపాటు అంతేమొత్తంలో లంచంగా డిమాండ్‌ చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కార్మిక శాఖలో అదనపు వసూళ్లు?
చోడవరంలో సహాయ కార్మిక శాఖ అధికారి కార్యాలయం

చేతివాటం ప్రదర్శిస్తున్న సిబ్బంది

రిజిస్ట్రేషన్‌కు రెట్టింపు ఫీజు డిమాండ్‌

ఆన్‌లైన్‌ విజిట్‌ పేరుతో మామూళ్లు

అనధికారిక సిబ్బంది ద్వారా వసూళ్ల

చోడవరం, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి):

వాణిజ్య, వ్యాపార సంస్థలకు సంబంధించి రిజిస్ర్టేషన్‌ పనులకు కార్మిక శాఖలో కొంతమంది సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయించిన ఫీజుతోపాటు అంతేమొత్తంలో లంచంగా డిమాండ్‌ చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కార్మిక శాఖ కొత్త నిబంధనల ప్రకారం వ్యాపార, వాణిజ్య సంస్థలు తప్పనిసరిగా తమ దుకాణాలను రిజిస్ట్రేషన్‌ చేసుకోవడంతోపాటు, తమ వద్ద పనిచేసే కార్మికుల వివరాలను అందజేయాలి. అయితే ఈ ప్రక్రియ కొత్తది కావడం, వ్యాపారుల్లో చాలామందికి అవగాహన లేకపోవడాన్ని కార్మిక శాఖకు చెందిన కొంతమంది సిబ్బంది తమకు అనుకూలంగా మార్చుకొని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఎంపిక చేసుకున్న కొంతమంది వ్యాపారులకు ఫోన్లు చేసి... ‘వెంటనే కార్యాలయానికి రండి, లేకపోతే మీకు నోటీసులు వస్తాయి. ఆపై మీ దుకాణానికి సీలు వేయాల్సి వస్తుంది’ అంటూ బెదిరిస్తున్నట్టు పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ వ్యాపారి ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక దుకాణం రిజిస్ట్రేషన్‌కు రూ.1,000 నుంచి రూ.1,500 ఫీజుగా తీసుకోవాలి. కానీ కార్మిక శాఖలో రెట్టింపు సొమ్ము డిమాండ్‌ చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. కార్మిక శాఖ ఉద్యోగులు తమ చేతికి మట్టి అంటకుండా వుండేందుకు ఈ వ్యవహారాలను చక్కబెట్టడానికి అనధికారికంగా వ్యక్తులను నియమించుకున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు.

ఇంకా ఆన్‌లైన్‌ విజిట్‌ పేరుతో చిన్నపాటి దుకాణాల నుంచి పెట్రోల్‌ బంకులు వంటి పెద్ద వ్యాపార సంస్థల వరకు తనిఖీలు నిర్వహిస్తూ, ఎటువంటి లోపాలు లేనప్పటికీ మామూళ్లు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

అదనంగా డబ్బులు వసూలు చేయడం లేదు.

పి.సూర్యనారాయణ. సహాయ కార్మిక శాఖ అధికారి, చోడవరం

వాణిజ్య, వ్యాపార సంస్థల రిజిస్ట్రేషన్‌, ఆన్‌లైన్‌ విజిట్‌లకు అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు అవాస్తవం. కొత్తగా వచ్చిన ఆన్‌లైన్‌ విజిట్‌లపై వ్యాపారులకు అవగాహన లేకపోవడం వల్ల ఈ విధంగా ప్రచారం జరుగుతున్నది. రిజిస్ట్రేషన్‌కు ప్రభుత్వం నిర్ణయించిన మేర రుసుము వసూలు చేస్తున్నాం. అదనపు వసూళ్లకు పాల్పడడం లేదు. మా కార్యాలయంలో అనధికార వ్యక్తులెవరినీ నియమించుకోలేరు.

Updated Date - Dec 17 , 2025 | 01:08 AM