Share News

ఇళ్ల లబ్ధిదారులకు అదనపు సాయం

ABN , Publish Date - Jul 05 , 2025 | 12:44 AM

వైసీపీ పాలనలో అసంపూర్తిగా ఉండిపోయిన ఇళ్ల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం అదనపు సాయం అందజేస్తోంది.

ఇళ్ల లబ్ధిదారులకు అదనపు సాయం

బీసీ, ఎస్సీలకు రూ.50 వేలు, మైదాన ప్రాంత గిరిజనులకు రూ.75 వేలు

ఇప్పటివరకూ రూ.2.87 కోట్లు మంజూరు

860 మంది లబ్ధిదారులకు ప్రయోజనం

విశాఖపట్నం, జూలై 4 (ఆంధ్రజ్యోతి):

వైసీపీ పాలనలో అసంపూర్తిగా ఉండిపోయిన ఇళ్ల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం అదనపు సాయం అందజేస్తోంది. బీసీ, ఎస్సీలకు రూ.50 వేలు, మైదాన ప్రాంత గిరిజనులకు రూ.75 వేలు, ఏజెన్సీ గిరిజనులకు రూ.లక్ష వంతున సాయం ఇస్తామని సీఎం నారా చంద్రబాబునాయుడు గత ఏడాది డిసెంబరులో ప్రకటించారు. అందుకు అనుగుణంగా విశాఖ జిల్లాలో 860 మంది బీసీ/ఎస్సీ/ఎస్టీ లబ్ధిదారులకు రూ.2.87 కోట్లు మంజూరుచేశారు. పనులు చేపట్టిన మేరకు లబ్ధిదారుల ఖాతాలకు సొమ్ములు జమ చేస్తున్నారు.

గత ప్రభుత్వం గ్రామీణ మండలాల్లో మూడు వేలకు పైగా ఇళ్లు మంజూరుచేసింది. ఇంటికి కేంద్రం ఇచ్చిన రూ.1.5 లక్షలకు అదనంగా ఉపాధి హామీ పథకం కింద రూ.30 వేలు రాష్ట్రం మంజూరుచేసింది. మొత్తం రూ.1.8 లక్షలతో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం చేపట్టారు. సొంత స్థలాలు లేని వారి కోసం గ్రామాల్లో ప్రభుత్వ స్థలాల్లో లేఅవుట్‌లు వేశారు. అయితే పెరిగిన ఇళ్ల సామగ్రి ధరలతో స్థోమత లేని వారు నిర్మాణాలు పూర్తిచేయలేకపోయారు. కొందరు స్లాబ్‌ల వరకు, మరికొందరు గోడల వరకూ నిర్మించి విడిచిపెట్టేశారు. అయితే కూటమి ప్రభుత్వం రాగానే అసంపూర్తి ఇళ్లకు కేటగిరీల వారీగా కొంత సాయం అందించాలని నిర్ణయించి నిధులు మంజూరుచేసింది. ఈ నేపథ్యంలో 2024 డిసెంబరు పదో తేదీ నాటికి బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన 860 మందిని గుర్తించి వారి వివరాలు ప్రభుత్వానికి పంపారు. వారికి దశల వారీగా ఇంతవరకూ రూ.2.87 కోట్లు నిధులు మంజూరుచేశారు. ఇంకా అర్హులైన లబ్ధిదారులను గుర్తించే పనిలో గృహ నిర్మాణ సంస్థ అధికారులు ఉన్నారు. కాగా ఇప్పటివరకూ 100 మంది ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయగా మరికొందరు పనులు కొనసాగిస్తున్నారని జిల్లా గృహ నిర్మాణ సంస్థ పీడీ సత్తిబాబు తెలిపారు. ఇటీవల ఆనందపురం మండలం శొంఠ్యాంలో అదనపు సాయంతో పూర్తిచేసిన ఇంటిని తనిఖీ చేశామన్నారు. అదే ఇంటికి పక్కన అసంపూర్తిగా ఉన్న ఇంటిని పరిశీలించి అదనపు సాయం కోసం ప్రతిపాదించామన్నారు.

లేఅవుట్‌లలో ఇళ్లకు కూడా...

నగరానికి ఆనుకుని వేసిన 65 లేఅవుట్‌లలో గల బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వర్గాల వారికి అదనపు సాయం ఇవ్వనున్నారు. ప్రస్తుతం లక్ష ఇళ్లను కాంట్రాక్టర్లు నిర్మిస్తున్నారు. ప్రభుత్వం మంజూరుచేసిన రూ.1.8 లక్షలతో స్లాబ్‌ వరకూ నిర్మిస్తారు. వాటిలో రూ.35 వేలు డిపాజిట్‌ చేసిన డ్వాక్రా సభ్యుల ఇళ్లకు మాత్రమే లోపల, బయట ప్లాస్టింగ్‌ చేస్తారు. మొత్తం 65 లేఅవుట్‌లలో సుమారు 32 వేల మంది డ్వాక్రా సభ్యులు రూ.35 వేలు వంతున డిపాజిట్‌ చేశారు. అయితే ప్రభుత్వం ఇచ్చిన సొమ్ములు, డ్వాక్రా సభ్యులు చెల్లించిన సొమ్ములతో కాంట్రాక్టర్లు పనులు పూర్తిచేయాలి. ఆ తరువాత ఆయా లేఅవుట్‌ల నుంచి కాంట్రాక్టర్లు పూర్తిగా వైదొలగాలి. అప్పుడు అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులను గుర్తించి అదనపు సాయం అందిస్తామని హౌసింగ్‌ పీడీ సత్తిబాబు తెలిపారు.

Updated Date - Jul 05 , 2025 | 12:44 AM