అతీగతీ లేని అదానీ డేటా సెంటర్
ABN , Publish Date - Oct 14 , 2025 | 01:24 AM
గూగుల్ డేటా సెంటర్, రైడెన్ డేటా సెంటర్, సిఫీ డేటా సెంటర్...ఇప్పుడు మారుమోగుతున్న పేర్లు. కానీ ఆరేళ్ల క్రితమే విశాఖపట్నంలో డేటా సెంటర్ ఏర్పాటుకు అదానీ సంస్థ ముందుకువచ్చింది.
ఆరేళ్ల క్రితం భూమి కేటాయింపు
రూ.14,634 కోట్ల పెట్టుబడుల పెట్టి, 24,990 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ
ఇప్పటికి రెండుసార్లు శంకుస్థాపనలు
పది నెలల క్రితం పర్యావరణ అనుమతులు
ప్రస్తుతం ప్రహరీ గోడ నిర్మాణానికే పరిమితం
పనులు ఎప్పటికి మొదలయ్యేనో...
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
గూగుల్ డేటా సెంటర్, రైడెన్ డేటా సెంటర్, సిఫీ డేటా సెంటర్...ఇప్పుడు మారుమోగుతున్న పేర్లు. కానీ ఆరేళ్ల క్రితమే విశాఖపట్నంలో డేటా సెంటర్ ఏర్పాటుకు అదానీ సంస్థ ముందుకువచ్చింది. ఆ ప్రాజెక్టుకు రెండుసార్లు శంకుస్థాపన జరిగింది. అయితే అనుమతులన్నీ మంజూరు చేసి రెండేళ్లు గడుస్తున్నా పనులు ముందుకుసాగడం లేదు. ఇప్పుడు తాపీగా ఆ భూమికి ప్రహరీ నిర్మిస్తున్నారు. ఇక అసలు పనులు ఎప్పుడు ప్రారంభిస్తారో?
అదానీ డేటా సెంటర్ నిర్మాణానికి తెలుగుదేశం ప్రభుత్వం 2019లోనే భూమి కేటాయించింది. ఆ ప్రాజెక్టుకు అదే ఏడాది ఫిబ్రవరిలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ ఒప్పందం రద్దు చేసింది. తమకు దీర్ఘకాలిక ఒప్పందాలు నప్పవని, వెంటనే ప్రాజెక్టు పూర్తి చేయాలంటూ మధురవాడ హిల్ నంబరు 130 ఎకరాలు కేటాయించింది. అప్పట్లో ఎకరా 15 కోట్ల రూపాయల విలువచేసే భూమిని ఏపీఐఐసీ ద్వారా కోటి రూపాయల చొప్పున ఇచ్చింది. దీని కోసం అదానీ సంస్థ ‘వైజాగ్ టెక్ పార్క్ లిమిటెడ్’ అని స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేసింది. ఏపీఐఐసీ వేసిన ఈ లేఅవుట్‌కు వీఎంఆర్‌డీఏ వెంటనే అప్రూవల్ ఇచ్చింది.
ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్‌కు ఒప్పందం
ప్రభుత్వం కేటాయించిన భూమిలో ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ ఏర్పాటుచేస్తామని అదానీ యాజమాన్యం ప్రకటించింది. డేటా సెంటర్‌తో పాటు బిజినెస్ పార్క్ నిర్మిస్తామని పేర్కొంది. దశల వారీగా రూ.14,634 కోట్ల పెట్టుబడుల పెట్టి, 24,990 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపింది. మొదట 200 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ పెడతామని ప్రకటించింది. ఆ తరువాత మరో 100 మెగావాట్లతో మరో డేటా సెంటర్ నిర్మిస్తామని పేర్కొంది. కేటాయించిన భూమిలో 82 ఎకరాల్లో 200 మెగావాట్ల డేటా సెంటర్, 28 ఎకరాల్లో ఐటీ బిజినెస్ పార్క్, 11 ఎకరాల్లో స్కిల్ యూనివర్సిటీ నెలకొల్పుతామని ఒప్పందం చేసింది.
ఎస్‌పీవీ...ఆ తరువాత జాయింట్ వెంచర్
డేటా సెంటర్లకు అవసరమైన విద్యుత్‌ను రెన్యువబుల్ ఎనర్జీ ద్వారా సమకూర్చుకుంటామని ప్రకటించింది. అదానీ గ్రూపు విద్యుత్ రంగంలో భారీ పెట్టుబడులు పెట్టడంతో విద్యుత్‌కు ఇబ్బందులు ఉండవని ప్రభుత్వం భావించింది. డేటా పంపింగ్ కోసం సముద్ర అంతర్భాగం నుంచి సబ్‌మెరైన్ కేబుల్ తీసుకువచ్చి, ఆగ్నేయ ఆసియా దేశాలకు కనెక్టివిటీ పెంచుతామని తెలిపింది. వైజాగ్ టెక్ పార్క్ పేరుతో ఎస్‌పీవీ పెట్టి, తరువాత ‘అదానీ కనెక్ట్స్’ జాయింట్ వెంచర్‌కు వెళుతున్నట్టు ప్రకటించింది. మాట మార్చేసి తొలుత 100 మెగావాట్ల డేటా సెంటర్ పెడతామంటోంది.
ఈ ప్రాజెక్టుకు ఈ ఏడాది జనవరిలోనే పర్యావరణ అనుమతులు లభించాయి. ఈ భూమి కంబాలకొండ సెన్సిటివ్ జోన్ పరిధిలో ఉండడం వల్ల 30 మీటర్ల పరిధిలో గ్రీన్ బెల్ట్ అభివృద్ధి చేయాలని షరతు పెట్టారు. కేటాయించిన భూమిలో కొన్నిచోట్ల అనుమానాలు ఉన్నాయని చెప్పడంతో ఆరు నెలల క్రితమే విశాఖ గ్రామీణ తహశీల్దార్, సర్వే విభాగం కలిసి వెళ్లి వారి భూమిని అప్పగించారు. ఇప్పుడు తీరుబడిగా ఆ భూమికి ప్రహరీ నిర్మాణం మాత్రమే చేస్తున్నారు. ఇతరత్రా పనులు ఏమీ చేయడం లేదు. ఇప్పట్లో అదానీకి ఇక్కడ డేటా సెంటర్ నిర్మించే ఆలోచన లేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
నోటీసులు ఇస్తాం: ఏపీఐఐసీ అధికారి
భూమి స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి మూడేళ్లలో ఆపరేషన్లు చేపట్టాలనే నిబంధనతో ఒప్పందం జరిగింది. ఇప్పటికే రెండేళ్లు అయ్యింది. పనులు ప్రారంభించకపోతే త్వరలోనే నోటీసులు ఇస్తాం. జరిమానా చెల్లించి ఒప్పందం పునరుద్ధరించుకోవలసి ఉంటుంది.