మన్యంలో దాల్చినచెక్క సాగుకు కార్యాచరణ
ABN , Publish Date - Nov 25 , 2025 | 11:59 PM
మన్యంలో దాల్చినచెక్క సాగును ప్రారంభించేందుకు స్థానిక ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు కార్యాచరణ ప్రారంభించారు.
హెచ్‌ఆర్‌ఎస్‌లో నర్సరీ అభివృద్ధి
వచ్చే ఏడాది మేలో గిరిజన రైతులకు మొక్కలు పంపిణీ
గిరిజన ప్రాంతం సాగుకు అత్యంత అనుకూలమని శాస్త్రవేత్తలు నిర్ధారణ
చింతపల్లి, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): మన్యంలో దాల్చినచెక్క సాగును ప్రారంభించేందుకు స్థానిక ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు కార్యాచరణ ప్రారంభించారు. గిరిజన ప్రాంతం దాల్చినచెక్క సాగుకు అత్యంత అనుకూలమని శాస్త్రవేత్తలు ప్రయోగాత్మక సాగు ద్వారా నిర్ధారించారు. ఈ మేరకు గిరిజన రైతులను దాల్చినచెక్క సాగును ప్రోత్సహించేందుకు శాస్త్రవేత్తలు శ్రీకారం చుట్టారు. గిరిజన రైతులకు మొక్కలను పంపిణీ చేసేందుకు ఉద్యాన పరిశోధన స్థానంలో నర్సరీని అభివృద్ధి చేస్తున్నారు. వచ్చే ఏడాది మే నెల నాటికి రైతులకు మొక్కలు అందజేసేందుకు శాస్త్రవేత్తలు చర్యలు తీసుకుంటున్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా విభిన్న వాతావరణం కలిగి, ఉత్తర భారతదేశాన్ని పోలి ఉంటుంది. దీంతో అరుదైన దేశ, విదేశీ పంటలను సాగు చేసుకునేందుకు గిరిజన ప్రాంత నేలలు, వాతావరణం అనుకూలిస్తున్నది. ఇప్పటికే గిరిజన ప్రాంతంలో విదేశీ పంటలు డ్రాగన్‌ఫ్రూట్, అవకాడో, స్ట్రాబెర్రీ ఉద్యాన పంటలను ఆదివాసీ రైతులు సాగు చేస్తున్నారు. తాజాగా సుగంధ ద్రవ్య పంట దాల్చినచెక్క సాగును ప్రోత్సహించేందుకు ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. దాల్చినచెక్క మొక్కల నుంచి బిర్యాని ఆకు వస్తుంది. మొక్క బెరడు నుంచి దాల్చినచెక్క వస్తుంది. ఈ మొక్కలను సాగు చేసుకోవడం వలన రైతు బిర్యాని ఆకు, దాల్చినచెక్కను సేకరించుకుని మార్కెటింగ్ చేసుకోవచ్చు. దాల్చినచెక్క, బిర్యాని ఆకు ద్వారా రైతు మంచి ఆదాయం పొందవచ్చు. ఈ మొక్కలు గరిష్ఠంగా 25 ఏళ్లకు పైగా దిగుబడులను ఇస్తుంది. దీంతో ఈ పంట ద్వారా గిరిజన రైతులు దీర్ఘకాల ఆదాయం పొందవచ్చు. ఇప్పటికే కొంత మంది గిరిజన రైతులు బిర్యాని ఆకు కోసం పెరట్లో దేశవాళి రకం మొక్కలను సాగు చేసుకుంటున్నారు. తూర్పుకనుముల అడవుల్లోనూ దాల్చినచెక్క మొక్కలు ఉన్నాయి.
సాగుకు అత్యంత అనుకూలం
దాల్చినచెక్క సాగుకు గిరిజన ప్రాంతం అత్యంత అనుకూలమని స్థానిక ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు పదేళ్ల క్రితం పరిశోధనల ద్వారా నిరూపించారు. ఉద్యాన పరిశోధన స్థానంలో వివిధ దశల్లో దాల్చినచెక్క మొక్కలపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. దాల్చినచెక్క గిరిజన ప్రాంతంలో ఏపుగా పెరగడంతో పాటు అధిక మొత్తంలో దాల్చిన చెక్క, బిర్యాని ఆకు దిగుబడులనిస్తుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. పరిశోధన స్థానంలో 15 ఏళ్లుగా సాగు చేస్తున్న దాల్చినచెక్క తోటలు ఉన్నాయి. ఈ తోట నుంచి శాస్త్రవేత్తలు విత్తనాలను సేకరించి గిరిజన రైతులకు మొక్కలను పంపిణీ చేసేందుకు నర్సరీని అభివృద్ధి చేస్తున్నారు. తొలివిడతగా నాలుగు వేల మొక్కలను శాస్త్రవేత్తలు నర్సరీ ద్వారా సిద్ధం చేస్తున్నారు.
వాణిజ్య సరళిలో సాగుకు ప్రోత్సాహం
దాల్చినచెక్క పంటను ఆదివాసీ రైతులు వాణిజ్య సరళిలో సాగు చేసుకునేందుకు అనువుగా శాస్త్రవేత్తలు ప్రణాళికలు సిద్ధం చేశారు. గిరిజన ప్రాంత రైతులు కాఫీ, మిరియాల పంటలను ప్రధాన వాణిజ్య పంటగా సాగు చేసుకుంటున్నారు. రాజ్‌మా, పసుపు, అల్లం పంటలను ద్వితీయ వాణిజ్య పంటగా సాగు చేస్తున్నారు. దాల్చినచెక్క గిరిజన ప్రాంతంలో సాగుకు అనుకూలమని పదేళ్ల క్రితమే శాస్త్రవేత్తలు నిర్ధారించినప్పటికి గిరిజన ప్రాంతంలో సాగు విస్తరణకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కూటమి ప్రభుత్వం గిరిజన రైతులకు గంజాయికి ప్రత్యామ్నాయ పంటను పరిచయం చేసేందుకు చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు వెంకటరామన్నగూడెం ఉద్యాన విశ్వవిద్యాలయం అధికారుల సూచనలతో స్థానిక ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు దాల్చినచెక్క పంటను సైతం గిరిజన ప్రాంతంలో వాణిజ్య పంటల స్థానంలో చేర్చేందుకు కార్యాచరణ ప్రారంభించారు.
నాణ్యమైన అధిక దిగుబడులు
స్థానిక ఉద్యాన పరిశోధన స్థానంలో సాగు చేస్తున్న దాల్చినచెక్క మొక్కల నుంచి నాణ్యమైన దిగుబడులు వస్తున్నాయి. బిర్యాని ఆకు, దాల్చినచెక్క అత్యంత నాణ్యత కలిగి ఉంటుంది. తీపి, కారం ఘాటు కలబోసిన మసాల ఘుమఘుమలు అద్భుతంగా ఉన్నాయి. దీంతో మార్కెట్‌లో మంచి ధర లభిస్తున్నది. గిరిజన రైతులు దాల్చినచెక్క మొక్కలను సాగు చేసుకోవడం వలన మంచి ఆదాయం పొందే అవకాశం ఉన్నది. ప్రతి ఏడాది హెక్టారుకు ఒక టన్ను నుంచి 1.5 టన్నుల బిర్యాని ఆకు పొందవచ్చు. అలాగే దాల్చిన చెక్కను రెండేళ్లకు ఒకసారి సేకరించుకోవాలి. మూడో ఏడాది నుంచి పదో ఏట వరకు హెక్టారు నుంచి 60-125 కిలోల దాల్చినచెక్క దిగుబడులు పొందవచ్చు. పదో ఏట నుంచి హెక్టారుకి 250-300కిలోల దాల్చినచెక్క పొందవచ్చు. బిర్యాని ఆకు ద్వారా ప్రతి ఏడాది, దాల్చినచెక్క ద్వారా రెండేళ్లకు ఒకసారి రైతులు ఆదాయం పొందవచ్చు.