Share News

చురుగ్గా కేకే లైన్‌ డబ్లింగ్‌

ABN , Publish Date - Oct 18 , 2025 | 01:19 AM

వాల్తేరు రైల్వే డివిజన్‌కు అత్యధిక ఆదాయం సమకూర్చేది కొత్తవలస-కిరండూల్‌ (కేకే) లైన్‌. బచేలిలోని గనుల నుంచి ఐరన్‌ఓర్‌ను ఈ మార్గంలోనే విశాఖపట్నం తీసుకువస్తారు.

చురుగ్గా కేకే లైన్‌ డబ్లింగ్‌

కొత్తవలస-కిరండూల్‌ మధ్య అదనంగా మరో రైల్వే ట్రాక్‌ నిర్మాణం

మొత్తం సుమారు 446 కిలోమీటర్లు

ఇప్పటివరకూ సుమారు 300 కి.మీ. మేరపనులు పూర్తి

2028 నాటికి పూర్తయ్యే అవకాశం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

వాల్తేరు రైల్వే డివిజన్‌కు అత్యధిక ఆదాయం సమకూర్చేది కొత్తవలస-కిరండూల్‌ (కేకే) లైన్‌. బచేలిలోని గనుల నుంచి ఐరన్‌ఓర్‌ను ఈ మార్గంలోనే విశాఖపట్నం తీసుకువస్తారు. ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు పంపిస్తారు. ఈ మార్గం కొండలు, గుట్టలు, వాగులు మీదుగా సాగుతుంది. వర్షాలు కురిస్తే రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. కొండల పైనుంచి బండరాళ్లు పడుతుంటాయి. వాటిని యుద్ధ ప్రాతిపదికన తొలగించాల్సి వస్తుంది. ఒకే మార్గం ఉండడం వల్ల పరిశ్రమలకు ఐరన్‌ఓర్‌ సకాలంలో అందడం లేదు. దీనిని దృష్టిలో పెట్టుకొని ఈ కేకే లైన్‌ను డబ్లింగ్‌ చేయాలని (మరో మార్గం అదనంగా) నిర్ణయించారు. సుమారు 446 కి.మీ. పొడవున కొత్త మార్గం వేయాల్సి ఉంది. కొండలను తవ్వి గుహలు, నదులపై వంతెనలు నిర్మించాల్సి వస్తోంది. ఇప్పటివరకూ సుమారు 300 కి.మీ. మేర పనులు పూర్తయ్యాయి. మొత్తం పనులు 2026 మార్చి నాటికి పూర్తి కావలసి ఉండగా, ఇంకో రెండేళ్లు అదనపు సమయం పట్టే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం. ఇటీవల తరచూ వర్షాలు కురుస్తుండడంతో పనులు ఆగిపోతున్నాయని చెబుతున్నారు.

ఈ సెక్షన్‌లో ఆరు బ్లాకులు ఇంకా నిర్మించాల్సి ఉంది. రెండు స్టేషన్ల మధ్య దూరాన్ని ఒక బ్లాకుగా వ్యవహరిస్తారు. అంటే 12 స్టేషన్ల మధ్య అదనపు ట్రాక్‌ పనులు పూర్తి కావాల్సి ఉంది. వీటిలో రెండు బ్లాకులు చాలా క్లిష్టమైనవి. టన్నెళ్లు వేయాల్సి ఉంది. ఈ పనులు 2027-28 నాటికి అయ్యే అవకాశం ఉంది. బచేలి-కిరండోల్‌-కొరాపుట్‌ మధ్య నాలుగు బ్లాకుల పనులు మిగిలి ఉన్నాయి. వాటిలో ఒక బ్లాక్‌ ఈ ఏడాది చివరికి పూర్తి కానుంది. మిగిలినవి వచ్చే ఏడాది పూర్తిచేయడానికి యత్నిస్తున్నారు.

ఆరు నెలల్లోనే 48 మిలియన్‌ టన్నుల రవాణా

లలిత్‌ బొహ్రా, డీఆర్‌ఎం, వాల్తేరు

కేకే లైన్‌ వాల్తేరు డివిజన్‌కు గుండెకాయ లాంటిది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా గత ఏడాది కంటే 21 శాతం సరకు రవాణా పెరిగింది. తొలి ఆరు నెలల్లో 48 మిలియన్‌ టన్నుల సరకు రవాణా చేశాం. ఎన్‌ఎండీసీకి ర్యాకుల కొరత రాకూడదని ఇటు నుంచి ఎటువంటి సరకు లేకపోయినా ఖాళీ ర్యాకులను పంపుతున్నాం.


దీపావళి వేళ అప్పన్న దర్శన వేళల్లో మార్పులు

20, 21 తేదీల్లో సాయంత్రం ఆరు, రాత్రి 7 గంటల వరకూ అనుమతి

22న ఉదయం ఆర్జిత సేవలు రద్దు

సింహాచలం, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి):

దీపావళిని పురస్కరించుకుని సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామి దర్శన వేళల్లో స్వల్ప మార్పులు ఉంటాయని ఈఓ వేండ్ర త్రినాథరావు ప్రకటించారు. ఈనెల 20వ తేదీన నరక చతుర్దశి సందర్భంగా రాత్రి ఏడు గంటల వరకూ, అదే విధంగా 21న దీపావళి పండుగ కారణంగా సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే భక్తులకు స్వామివారి దర్శనాలు లభిస్తాయన్నారు. ఆ రెండు రోజులు రాత్రి ఆరాధన సేవా టికెట్ల విక్రయాలు ఉండవని పేర్కొన్నారు. ఈనెల 22న నృసింహస్వామి ఆవిర్భావ నక్షత్రం స్వాతిని పురస్కరించుకుని ఆలయంలో స్వాతి నక్షత్ర హవనం జరగనున్నందున ఉదయం జరగాల్సిన ఆర్జిత సహస్ర నామార్చన, గరుడ సేవలను రద్దు చేస్తున్నట్టు వెల్లడించారు. ఆర్జిత నిత్యకల్యాణం యథావిధిగా జరుగుతుందన్నారు. అదేవిధంగా ఈనెల 23 నుంచి 27 వరకు మహామునుల తిరునక్షత్ర పూజలను పురస్కరించుకుని సహస్ర తులసీ దళార్చన, గరుడసేవ, నిత్యకల్యాణం, స్వర్ణ పుష్పార్చన వంటి ఆర్జిత సేవలన్నింటినీ రద్దు చేశామన్నారు. ఈ మార్పులను భక్తులు గమనించాలని ఈఓ కోరారు.

Updated Date - Oct 18 , 2025 | 01:19 AM