Share News

చురుగ్గా రైతుబజార్‌ పనులు

ABN , Publish Date - Nov 29 , 2025 | 12:46 AM

అనకాపల్లి ప్రజల చిరకాల వాంఛ ఎట్టకేలకు నెరవేరబోతోంది. పదేళ్లుగా ఊరిస్తున్న రైతు బజార్‌ ఎన్టీఆర్‌ మార్కెట్‌ యార్డులో ఏర్పాటు కానుంది. ఇప్పటికే యార్డులోని నాగదుర్గమ్మ ఆలయానికి వెళ్లే మార్గంలోని 17, 18 నంబర్లు గల బ్లాకులను సుందరంగా తీర్చిదిద్దడంలో మార్కెటింగ్‌ శాఖ నిమగ్నమైంది.

చురుగ్గా రైతుబజార్‌ పనులు
రైతు బజార్‌లో సిద్ధమవుతున్న బ్లాకులు

నెరవేరనున్న అనకాపల్లి వాసుల కల..

ఎన్టీఆర్‌ మార్కెట్‌ యార్డులో ఏర్పాటు

రూ.14 లక్షలు మంజూరు చేసిన ప్రభుత్వం

నెల రోజుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం

అనకాపల్లి టౌన్‌, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి):

అనకాపల్లి ప్రజల చిరకాల వాంఛ ఎట్టకేలకు నెరవేరబోతోంది. పదేళ్లుగా ఊరిస్తున్న రైతు బజార్‌ ఎన్టీఆర్‌ మార్కెట్‌ యార్డులో ఏర్పాటు కానుంది. ఇప్పటికే యార్డులోని నాగదుర్గమ్మ ఆలయానికి వెళ్లే మార్గంలోని 17, 18 నంబర్లు గల బ్లాకులను సుందరంగా తీర్చిదిద్దడంలో మార్కెటింగ్‌ శాఖ నిమగ్నమైంది.

అనకాపల్లి ప్రజలకు సరసమైన ధరలకు కూరగాయలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు 2018లో రైతు బజార్‌ ఏర్పాటుకు టీడీపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అప్పటి ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ రైతు బజార్‌ ఏర్పాటు కోసం ప్రత్యేక దృష్టి సారించారు. విజయవాడ నుంచి మార్కెటింగ్‌ శాఖ అధికారులు అనకాపల్లికి వచ్చి రైతు బజార్‌ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. డీసీఎంఎస్‌ స్థలాన్ని అప్పట్లో పీలా సారథ్యంలో అధికారులు పరిశీలించారు. అయితే ఆ స్థలాన్ని ఇవ్వడానికి డీసీఎంఎస్‌ అంగీకరించకపోవడంతో కొబ్బరికాయల మార్కెట్‌, మరో రెండు ప్రాంతాలను కూడా పరిశీలించారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం ఓటమి చెంది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటి ప్రజాప్రతినిధులు రైతు బజార్‌ పట్ల పెద్దగా ఆసక్తి చూపిన దాఖలాలు లేవు. అయితే 2022 మార్చిలోనే అనకాపల్లిలో రైతు బజార్‌ ఏర్పాటుకు సంబంధించిన జీవోను వైసీపీ ప్రభుత్వం విడుదల చేసినట్టు తెలిసింది. అయినప్పటికీ కూడా వైసీపీ పాలకులు రైతు బజార్‌ ఏర్పాటుపై దృష్టి సారించలేదన్న విమర్శలు లేకపోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అనకాపల్లిలో రైతు బజార్‌ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ కృతనిశ్చయంతో ఉన్నారు. దీంట్లో భాగంగా జిల్లా కలెక్టర్‌ విజయకృష్ణన్‌, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ఇటీవల ఎన్టీఆర్‌ మార్కెట్‌యార్డును సందర్శించారు. యార్డులో ఖాళీగా, నిరుపయోగంగా ఉన్న బ్లాకులను పరిశీలించారు. కరోనా సమయంలో కూరగాయల వ్యాపారం ఎన్టీఆర్‌ మార్కెట్‌ యార్డులో జరిగింది. అప్పట్లోనే ప్రజలు మార్కెట్‌కు వచ్చి కూరగాయల కొనుగోలుకు అలవాటు పడ్డారు. కరోనా తరువాత యఽథావిధిగా గాంధీమార్కెట్‌లోనే వ్యాపారం సాగుతోంది. వీటి అన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఇటు పార్కింగ్‌కు, వ్యాపారానికి అనువుగా ఉండే ఎన్టీఆర్‌ మార్కెట్‌ యార్డులో రైతు బజార్‌ ఏర్పాటు చేస్తున్న విషయాన్ని ఇటీవల ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ప్రకటించారు. మార్కెట్‌యార్డులో రైతు బజార్‌ ఏర్పాటుకు ప్రభుత్వం కూడా రూ.14లక్షలు మంజూరు చేసింది. టెండర్లు ప్రక్రియ పూర్తయిన తరువాత మార్కెటింగ్‌ శాఖ ఏడీ అశోక్‌కుమార్‌ ఆధ్వర్యంలో రైతు బజార్‌ ఏర్పాటు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే 17, 18 బ్లాకులతో పాటు గతంలో చేపల మార్కెట్‌ కోసం నిర్మించిన రెండు బ్లాకులను కూడా సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే చిన్న చిన్న బ్లాకులుగా ఏర్పాటు చేసి నంబర్లు కూడా వేశారు. డిసెంబరు నెలాఖరుకు రైతు బజార్‌ ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ఈ విషయమై మార్కెటింగ్‌ శాఖ ఏడీ అశోక్‌కుమార్‌ ‘ఆంధ్రజ్యోతి’ సంప్రదించగా.. పనులను వేగవంతం చేస్తున్నామన్నారు. ప్లాస్టింగ్‌లు పూర్తయ్యాయని, రంగులు వేసి విద్యుత్‌ సౌకర్యం కల్పించనున్నామన్నారు. ఈ బజార్‌లో 150 మంది వర్తకులు, రైతులు తమ ఉత్పత్తులను విక్రయించేందుకు అవకాశం ఉందన్నారు. 20 రోజుల్లో నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

Updated Date - Nov 29 , 2025 | 12:46 AM