చురుగ్గా విద్యుత్ సబ్‌స్టేషన్ పనులు
ABN , Publish Date - Aug 11 , 2025 | 12:46 AM
చోడవరం మేజర్ పంచాయతీసహా, మరో తొమ్మిది పంచాయతీలు, రెండు శివారు గ్రామాల ప్రజల కరెంటు కష్టాలు త్వరలో తీరనున్నాయి. ఎన్నో సంవత్సరాలుగా విద్యుత్ సరఫరాలో ఈ గ్రామాల విద్యుత్ వినియోగదారుల ఇబ్బందులు విజయదశమి నాటికి గట్టెక్కనున్నాయి.
లక్ష్మీపురం వద్ద ఇప్పటికే 60 శాతం పూర్తి
రెండు నెలల్లో అందుబాటులోకి..
చోడవరం, పరిసర పంచాయతీలకు తీరనున్న కరెంటు కష్టాలు
చోడవరం, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): చోడవరం మేజర్ పంచాయతీసహా, మరో తొమ్మిది పంచాయతీలు, రెండు శివారు గ్రామాల ప్రజల కరెంటు కష్టాలు త్వరలో తీరనున్నాయి. ఎన్నో సంవత్సరాలుగా విద్యుత్ సరఫరాలో ఈ గ్రామాల విద్యుత్ వినియోగదారుల ఇబ్బందులు విజయదశమి నాటికి గట్టెక్కనున్నాయి.
కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత 33 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణాన్ని చోడవరం శివారు లక్ష్మీపురం పంచాయతీ సమీపంలో ఈ ఏడాది జూన్ నెలాఖరున ప్రారంభించారు. ప్రస్తుతం నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. మరోవైపు సబ్‌స్టేషన్ నుంచి ఆయా పంచాయతీలకు విద్యుత్ సరఫరా కోసం స్తంభాలు, లైన్లు వేస్తున్నారు. అలాగే చీడికాడ రోడ్డులో ఉన్న మరో విద్యుత్ సబ్‌స్టేషన్‌కు దీనిని అనుసంధానం చేయడానికి అవసరమైన లైన్లు వేస్తున్నారు. కొత్త సబ్‌స్టేషన్ అందుబాటులోకి వస్తే చోడవరం పట్టణంతోపాటు చుట్టుపక్కల వున్న గాంధీగ్రామం, నరసయ్యపేట, అంకుపాలెం, శ్రీరాంపట్నం, గౌరీపట్నం, ఖండేపల్లి, దామునాపల్లి, మైచర్లపాలెం, లక్ష్మీపురం పంచాయతీలు, శివారు గ్రామాలైన రేవళ్లు, పీఎస్‌పేటలకు విద్యుత్ కష్టాలు తీరనున్నాయి. వాస్తవానికి ఇక్కడ విద్యుత్ సబ్ స్టేషన్ గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే మంజూరైంది. దీని నిర్మాణానికి నరసయ్యపేట వద్ద ఎంపిక చేసిన స్థలంపై వివాదం కారణంగా వాయిదా పడింది. తరువాత నరసయ్యపేట వద్ద స్థలం సమస్య తొలగినప్పటికీ, నాటి వైసీపీ పాలకులు సబ్‌స్టేషన్ నిర్మాణంపై దృష్టిపెట్టలేదు. పైగా చోడవరానికి మంజూరైన సబ్‌స్టేషన్ వేరే ప్రాంతానికి తరలిపోయింది. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజు దీనిపై దృష్టిసారించారు. విద్యుత్ సబ్‌స్టేషన్‌కు లక్ష్మీపురం వద్ద స్థలం సమకూర్చడంతో వెంటనే నిర్మాణ పనులు మొదలుపెట్టారు.
అస్తవ్యస్తంగా విద్యుత్ సరఫరా
చోడవరంలో ప్రస్తుతం వున్న సబ్‌స్టేషన్ కింద సుమారు 20 వేల విద్యుత్ కనెక్షన్లు వున్నాయి. వీటిలో 11 వేల కనెక్షన్లు ఒక్క చోడవరం పట్టణంలోనే వున్నాయి. నానాటికీ విద్యుత్ కనెక్షన్లు పెరుగుతుండడం, మరోవైపు విద్యుత్ వినియోగం అధికం కావడంతో సబ్‌స్టేషన్‌పై లోడ్ పెరిగిపోతున్నది. దీంతో అప్రకటిత విద్యుత్ కోతలు, లోఓల్టేజీ సమస్యతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సబ్‌స్టేషన్‌పై లోడు తగ్గించడానికి పంచాయతీలకు సరఫరా నిలిపివేసి చోడవరం పట్టణానికి సరఫరా ఇస్తున్నారు. మరికొన్నిసార్లు చోడవరానికి సరఫరా ఆపేసి, చుట్టుపక్కల పంచాయతీలకు విద్యుత్ ఇస్తున్నారు. దీనివల్ల కరెంటు ఎప్పుడు ఉంటుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇటువంటి తరుణంలో ఎమ్మెల్యే రాజు, మరో సబ్‌స్టేషన్ మంజూరు చేయించారు. ప్రస్తుతం నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇంతవరకు సుమారు 60 శాతం పనులు పూర్తయ్యాయి. రెండు నెలల్లో ఇది అందుబాటులోకి వస్తుందని, దీంతో విద్యుత్ సమస్యలు వుండవని అదికారులు చెబుతున్నారు.