నర్సీపట్నం ఆస్పత్రిలో చురుగ్గా అభివృద్ధి పనులు
ABN , Publish Date - Oct 24 , 2025 | 12:38 AM
స్థానిక ప్రాంతీయ ఆస్పత్రిలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఏళ్ల తరబడి ఇబ్బంది పెడుతున్న డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా పనులు చేపడుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే, శాసనసభ స్పీకర్ అయిన చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆస్పత్రి నిర్వహణపై దృష్టి పెట్టారు. తరుచూ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశాలు నిర్వహిస్తూ, అధికారులను సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. దీంతో ఆస్పత్రి నిర్వహణ విషయంలో గత ప్రభుత్వం కంటే ఇప్పుడు పర్యవేక్షణ పెరిగింది.
ప్రత్యేక దృష్టి సారించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు
డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం
రూ.40 లక్షలు స్పెషల్ గ్రాంట్‌తో పనులు
ఆపరేషన్ థియేటర్‌లో సెంట్రల్ ఆక్సిజన్
సీఎస్‌ఆర్ నిధులతో అత్యాధునిక లైఫ్ సపోర్టు అంబులెన్స్
ఎస్‌ఎన్‌సీయూ గది ఆధునికీకరణ
త్వరలో అందుబాటులోకి క్యాంటీన్
నర్సీపట్నం, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): స్థానిక ప్రాంతీయ ఆస్పత్రిలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఏళ్ల తరబడి ఇబ్బంది పెడుతున్న డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా పనులు చేపడుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే, శాసనసభ స్పీకర్ అయిన చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆస్పత్రి నిర్వహణపై దృష్టి పెట్టారు. తరుచూ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశాలు నిర్వహిస్తూ, అధికారులను సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. దీంతో ఆస్పత్రి నిర్వహణ విషయంలో గత ప్రభుత్వం కంటే ఇప్పుడు పర్యవేక్షణ పెరిగింది. అయ్యన్న సతీమణి, 26వ వార్డు కౌన్సిలర్ చింతకాయల పద్మావతి సైతం తరచూ ఆస్పత్రిని సందర్శిస్తున్నారు. జిల్లా కలెక్టర్ ద్వారా సీఎస్‌ఆర్ గ్రాంట్ నుంచి అత్యాధునిక లైఫ్ సపోర్టు అంబులెన్స్ మంజూరు చేయించారు. రూ.5 లక్షలతో ఆపరేషన్ థియేటర్‌లో సెంట్రల్ ఆక్సిజన్ వ్యవస్థను ఏర్పాటు చేయించారు. తాజాగా రూ.40 లక్షల స్పెషల్ గ్రాంట్‌తో ఏపీఎంఐడీసీ ఆధ్వర్యంలో ఆస్పత్రిలో డ్రైనేజీ ఆధునికీకరణ, మరుగుదొడ్లు మరమ్మతు పనులు జరుగుతున్నాయి. ఆస్పత్రి వెనుక భాగంలో డ్రగ్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయం ముందు ఇంకుడు గొయ్యి నిర్మిస్తున్నారు. ఈ పనులు పూర్తయితే ఆస్పత్రి ఆవరణలో డ్రైనేజీ వుండదు. ప్రసూతి విభాగంలో నిరుపయోగంగా ఉన్న ఎస్‌ఎన్‌సీయూ గది ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయి. దీనిని కూడా ప్రసూతి విభాగానికి ఉపయోగిస్తామని సూపరింటెండెంట్ డాక్టర్ సుధాశారద తెలిపారు.
ఆస్పత్రిలో క్యాంటీన్
ప్రాంతీయ ఆస్పత్రిలో క్యాంటీన్ ఏర్పాటు చేస్తున్నారు. కేఎల్‌పురానికి చెందిన స్వయం సహాక సంఘం (ఎస్‌హెచ్‌జీ) సభ్యురాలు రాజ్యలక్ష్మికి మూడు సంవత్సరాలపాటు క్యాంటీన్ నడుపుకోవడానికి అనుమతి ఇచ్చారు. మండల సమాఖ్య స్త్రీ నిధి నుంచి రూ.లక్ష, సీఐఎఫ్ నుంచి రూ.50 వేలు రుణంగా మంజూరు చేశారు. ఏరియా ఆస్పత్రి త్వరలో క్యాంటీన్ అందుబాటులోకి రానుంది.