Share News

ఉపాధ్యాయులు సమయపాలన పాటించకుంటే చర్యలు

ABN , Publish Date - Oct 10 , 2025 | 10:43 PM

ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు సమయపాలన పాటించకపోతే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) పి. బ్రహ్మజీరావు హెచ్చరించారు.

ఉపాధ్యాయులు సమయపాలన పాటించకుంటే చర్యలు
టీఏఆర్‌ఎల్‌ శిక్షణలో ఉపాధ్యాయులతో మాట్లాడుతున్న డీఈవో బ్రహ్మజీరావు

జిల్లా విద్యాశాఖ అధికారి బ్రహ్మజీరావు

టెన్త్‌ ఫలితాల్లో 80 శాతం ఉత్తీర్ణత సాధించాలి

విద్యార్థి స్థాయికి తగ్గట్టు బోధన చేయాలి

చింతపల్లి, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు సమయపాలన పాటించకపోతే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) పి. బ్రహ్మజీరావు హెచ్చరించారు. శుక్రవారం స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో సరైన స్థాయిలో బోధించడం(టీఏఆర్‌ఎస్‌)పై ఉపాధ్యాయుల శిక్షణ తరగతులను ఆయన తనిఖీ చేశారు. అనంతరం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ ప్రతి విద్యార్థి కనీస సామర్థ్యాలపై పట్టు సాధించేందుకు ఉపాధ్యాయులు కృషిచేయాలన్నారు. విద్యార్థి స్థాయికి తగిన బోధన అందించి ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాలన్నారు. ఉపాధ్యాయులు కచ్చితంగా సమయానికి పాఠశాలకు హాజరుకావాలన్నారు. ఆలస్యంగా పాఠశాలకు హాజరవుతున్న ఉపాధ్యాయులను లీఫ్‌ యాప్‌ ద్వారా గుర్తించామన్నారు. ఈ పరిస్థితి పునరావృతమైతే చర్యలు తప్పవన్నారు. సోమవారం నుంచి ఎఫ్‌ఏ-2 పరీక్షలు ప్రారంభం కానున్నాయన్నారు. ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. ప్రస్తుతం పదో తరగతి ఉత్తీర్ణత 22 శాతం ఉందన్నారు. ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో ప్రతి పాఠశాల 80 శాతానికిపైగా సాధించాలన్నారు. ఉత్తీర్ణత శాతం తగ్గితే ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామన్నారు. పదో తరగతి విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో ఎంఈవో పీబీవీవీవీ ప్రసాద్‌, ఎంఈవో-2 గెమ్మెలి బోడం నాయుడు, హెచ్‌ఎం జె.లక్ష్మణ్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 10 , 2025 | 10:43 PM