Share News

సెజ్‌లో యాక్షన్‌ టెసా

ABN , Publish Date - Jun 11 , 2025 | 12:59 AM

అచ్యుతాపురం- రాంబిల్లి మండలాల పరిధిలోని ప్రత్యేక ఆర్థిక మండలి (సెకండ్‌ ఫేజ్‌)లో మంగళవారం ‘యాక్షన్‌ తెసా’ పరిశ్రమ ఏర్పాటుకు భూమి పూజ నిర్వహించారు. ఇళ్లల్లో ఇంటీరియర్‌కు వినియోగించే ఫ్లోర్‌ లేమినేషన్‌/ కప్‌బోర్డుల ప్యానల్‌ బోర్డులు తయారు చేసే ఈ కంపెనీ సుమారు రూ.200 కోట్ల పెట్టుబడితో నిర్మించనున్న పరిశ్రమకు కంపెనీ యజమానులతోపాటు కలెక్టర్‌ విజయకృష్ణన్‌, ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్‌ శంకుస్థాపన చేశారు.

సెజ్‌లో యాక్షన్‌ టెసా
యాక్షన్‌ టెసా కంపెనీ యాజమాన్య ప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేస్తున్న కలెక్టర్‌ విజయకృష్ణన్‌, ఎమ్మెల్యే విజయ్‌కుమార్‌.

105 ఎకరాల్లో రూ.200 కోట్లతో కంపెనీ ఏర్పాటు

3-4 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు

భూమి పూజ చేసిన కలెక్టర్‌, ఎలమంచిలి ఎమ్మెల్యే

రాంబిల్లి, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): అచ్యుతాపురం- రాంబిల్లి మండలాల పరిధిలోని ప్రత్యేక ఆర్థిక మండలి (సెకండ్‌ ఫేజ్‌)లో మంగళవారం ‘యాక్షన్‌ తెసా’ పరిశ్రమ ఏర్పాటుకు భూమి పూజ నిర్వహించారు. ఇళ్లల్లో ఇంటీరియర్‌కు వినియోగించే ఫ్లోర్‌ లేమినేషన్‌/ కప్‌బోర్డుల ప్యానల్‌ బోర్డులు తయారు చేసే ఈ కంపెనీ సుమారు రూ.200 కోట్ల పెట్టుబడితో నిర్మించనున్న పరిశ్రమకు కంపెనీ యజమానులతోపాటు కలెక్టర్‌ విజయకృష్ణన్‌, ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్‌ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, రాంబిల్లి మండలం కృష్ణంపాలెంలో గతంలో ఏపీఐఐసీ సేకరించిన భూముల్లో సుమారు 105 ఎకరాలను యాక్షన్‌ టెసా కంపెనీకి కేటాయించినట్టు చెప్పారు. కంపెనీ నిర్మాణం పూర్తయితే ప్రత్యక్షంగా, పరోక్షంగా మూడు వేల నుంచి నాలుగు వేల మందికి ఉపాధి కలుగుతుందన్నారు. సకాలంలో నిర్మాణం పూర్తిచేసి సెజ్‌ నిర్వాసితులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో యాక్షన్‌ టెసా కంపెనీ చైర్మన్‌ ఎన్‌కే అగర్వాల్‌, ఎండీ వివేక్‌జైన్‌, అనకాపల్లి ఆర్డీఓ ఆయీషా బేగమ్‌, రాంబిల్లి తహశీల్దార్‌ శ్రీనివాసరావు, కృష్ణంపాలెం సర్పంచ్‌ పైలా సత్తిబాబు, యాక్షన్‌ టెసా కంపెనీ ప్రతినిధులు, స్థానిక నేతలు పాల్గొన్నారు.

Updated Date - Jun 11 , 2025 | 01:00 AM