అనుమతి లేని ఫెర్టిలిటీ సెంటర్లపై చర్యలు
ABN , Publish Date - Aug 02 , 2025 | 12:48 AM
జిల్లాలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న ఫెర్టిలిటీ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ ఆదేశించారు.
ఐవీఎస్ సెంటర్ల తనిఖీకి ప్రత్యేక బృందాలు
జిల్లాలో మాతా, శిశు మరణాలు
చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టండి
అబార్షన్లు అధికంగా చేస్తున్న ఆస్పత్రులపై నిఘా పెట్టండి
వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ ఆదేశం
విశాఖపట్నం, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న ఫెర్టిలిటీ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. ఐవీఎఫ్ సెంటర్లపై నిఘా పెట్టాలని, తనిఖీకి ప్రత్యేక టీమ్‌లను నియమించాలన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఆయన శుక్రవారం మాతా, శిశు మరణాలు,వ్యాధి నిరోధక టీకాలు, మలేరియా, డెంగ్యూ తదితర అంశాలపై ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ ఐవీఎఫ్ సెంటర్లలో అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా మాతా, శిశు మరణాలు చోటుచేసుకోకుండా చూడాలన్నారు. నూతన దంపతులు, గర్భిణులు, శిశువుల రిజిస్ర్టేషన్లు సక్రమంగా జరిగేలా చూసుకోవాలన్నారు. హైరిస్క్ కేసులను ముందుగా ఆస్పత్రులకు తరలించాలన్నారు. అవసరమైనచోట ఆశ వర్కర్లు, ఎన్‌ఎంలకు తగిన తర్ఫీదు ఇవ్వాలని, విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్న వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పి.జగదీశ్వరరావుకు సూచించారు. అబార్షన్లు అధికంగా చేస్తున్న ఆస్పత్రులపై నిఘా పెట్టాలని, అందుకు గల కారణాలపై నివేదిక ఇవ్వాలన్నారు. శిశువులకు వ్యాక్సిన్లు సకాలంలో అందించాలన్నారు. మలేరియా, డెంగ్యూ, నివారణకు ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలని, దోమల ఉత్పత్తి స్థావరాలను గుర్తించి నిర్వీర్యం చేయాలన్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, షాపింగ్‌మాల్స్‌లో మిల్క్ ఫీడింగ్ గదులను ఏర్పాటుచేయాలని ఆదేశించారు. అనంతరం ఎయిడ్స్‌పై జరిగిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల్లో అవగాహన కలిగించాలన్నారు. సమీక్ష సమావేశంలో కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి, ఐసీడీఎస్ పీడీ రామలక్ష్మి, డిస్ర్టిక్ట్ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.