విద్యతోనే ఉన్నత లక్ష్యాల సాధన
ABN , Publish Date - Oct 08 , 2025 | 12:53 AM
విద్యతోనే ఉన్నత లక్ష్యాలను సాధించగలరని కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ అన్నారు. మండలంలోని గుత్తులపుట్టు బాలికల ఆశ్రమ పాఠశాలలో సూపర్- 50 పేరిట టెన్త్ విద్యార్థులకు నిర్వహించే ప్రత్యేక బోధనను మంగళవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, వారిని మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థులు ప్రత్యేక బోధనను సద్వినియోగం చేసుకుని టెన్త్‌లో చక్కని ఫలితాలు సాధించాలన్నారు.
- టెన్త్ ప్రత్యేక బోధన ప్రారంభోత్సవంలో కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్
- ఈ ఏడాది సూపర్- 50 కోచింగ్‌కు 104 మంది ఎంపిక
పాడేరు, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): విద్యతోనే ఉన్నత లక్ష్యాలను సాధించగలరని కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ అన్నారు. మండలంలోని గుత్తులపుట్టు బాలికల ఆశ్రమ పాఠశాలలో సూపర్- 50 పేరిట టెన్త్ విద్యార్థులకు నిర్వహించే ప్రత్యేక బోధనను మంగళవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, వారిని మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థులు ప్రత్యేక బోధనను సద్వినియోగం చేసుకుని టెన్త్‌లో చక్కని ఫలితాలు సాధించాలన్నారు. ఏజెన్సీలోని టెన్త్ విద్యార్థులకు సూపర్- 50 పేరిట ప్రత్యేకంగా నిర్వహించే శిక్షణకు ఎంపిక చేసేందుకు గత నెల ఒకటో తేదీన నిర్వహించిన స్ర్కీనింగ్ టెస్ట్‌కు 538 మంది హాజరయ్యారని, వారిలో 104 మంది తమ ప్రతిభ చూపి అందులో ఎంపికయ్యారన్నారు. వారిలో పాడేరు మండలం దిగువ మోదాపుట్టు ఆశ్రమ పాఠశాలలో 25 మంది బాలురు, గుత్తులపుట్టు ఆశ్రమ పాఠశాలలో 25 మంది బాలికలు, చింతపల్లి బాలుర ఆశ్రమ పాఠశాలలో 26 మంది, బాలికల ఆశ్రమ పాఠశాలలో 28 మందికి ప్రత్యేక శిక్షణ అందిస్తామన్నారు. అలాగే ఏటీడబ్ల్యూలు, హెచ్‌ఎంలు మరింత ప్రత్యేక శ్రద్ధతో ఈ కార్యక్రమాన్ని శత శాతం విజయవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. ఐటీడీఏ పీవో టి.శ్రీపూజ మాట్లాడుతూ గిరిజన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని టెన్త్‌లో పదికి పది పాయింట్లు సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ డీడీ పీబీకే పరిమిళ, ఏటీడబ్ల్యూవో అఖిల, ప్రధానోపాధ్యాయులు, సబ్జెక్టు టీచర్లు పాల్గొన్నారు.