Share News

రెండు చోరీ కేసుల్లో నిందితుడి అరెస్టు

ABN , Publish Date - Jul 23 , 2025 | 12:53 AM

మాడుగులలో రెండు ఇళ్లల్లో చోరీలకు పాల్పడిన వ్యక్తిని మంగళవారం అరెస్టు చేసి సొత్తును స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ ఎం.శ్రావణి చెప్పారు. తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె వెల్లడించిన వివరాలిలా వున్నాయి. మాడుగులకు చెందిన కోడూరు లక్ష్మి ఈ నెల మొదటి వారంలో ఇంటికి తాళాలు వేసి, విశాఖలో వుంటున్న అల్లుడి ఇంటికి వెళ్లింది.

రెండు చోరీ కేసుల్లో నిందితుడి అరెస్టు
నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న బంగారం, వెండి వస్తువులు.

21.5 తులాల బంగారం, 900 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం

అనకాపల్లి టౌన్‌, జూలై 22 (ఆంధ్రజ్యోతి): మాడుగులలో రెండు ఇళ్లల్లో చోరీలకు పాల్పడిన వ్యక్తిని మంగళవారం అరెస్టు చేసి సొత్తును స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ ఎం.శ్రావణి చెప్పారు. తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె వెల్లడించిన వివరాలిలా వున్నాయి. మాడుగులకు చెందిన కోడూరు లక్ష్మి ఈ నెల మొదటి వారంలో ఇంటికి తాళాలు వేసి, విశాఖలో వుంటున్న అల్లుడి ఇంటికి వెళ్లింది. 14వ తేదీన ఇంటికి వచ్చి చూడగా, తలుపులు తీసి వున్నాయి. బీరువాలో భద్రపరిచిన ఇరవైన్నర తులాల బంగారం, అర కిలో వెండి వస్తువులు, లక్షా 90 వేల రూపాయల నగదు కనిపించలేదు. అంతకుముందు నాలుగో తేదీన కోరుకొండ జగన్నాథస్వామి నివాసంలో తులం బంగారం, పావు కిలో వెండి వస్తువులు చోరీకి గురయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. కోడూరు లక్ష్మి ఇంటికి సమీపంలో నివాసం వుంటున్న బెజవాడ రాము అనే వ్యక్తి ఈ చోరీలకు పాల్పడినట్టు గుర్తించారు. అతని కోసం గాలిస్తుండగా మంగళవారం ఉదయం ఘాట్‌రోడ్డు జంక్షన్‌ వద్ద పట్టుబడ్డాడు. రాము గతంలో ఒక హల్వా షాపులో కూలీగా పనిచేసేవాడు. చెడు వ్యసనాలు వున్న ఇతనికి.. వచ్చే కూలి డబ్బులు చాలకపోవడంతో చోరీలకు అలవాటు పడ్డాడు. నిందితుడు నుంచి ఇరవై ఒకటిన్నర తులాల బంగారం వస్తువులు, 900 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కోడూరు లక్ష్మి నివాసంలో చోరీ చేసిన నగదును సొంతానికి వాడేసుకున్నాడు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. కాగా నిందితుడు రాముపై విశాఖ నగర పరిధిలోని మహారాణిపేట, టూ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ల్లో రెండు కేసులున్నాయని డీఎస్పీ తెలిపారు. మీడియా సమావేశంలో కె.కోటపాడు సీఐ పి.పైడపునాయుడు, మాడుగుల ఎస్‌ఐ నారాయణరావు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jul 23 , 2025 | 12:53 AM