పక్కాగా ఓటర్ల మ్యాపింగ్
ABN , Publish Date - Nov 26 , 2025 | 12:16 AM
జిల్లాలో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను పక్కాగా నిర్వహించాలని అధికారులను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశించారు.
అధికారులకు కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశం
7న ఎన్నికల సీఈవో జిల్లా పర్యటన
పాడేరు, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను పక్కాగా నిర్వహించాలని అధికారులను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశించారు. జిల్లాలో ఓటర్ల మ్యాపింగ్‌పై వివిధ శాఖల అధికారులతో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. జిల్లాలోని పాడేరు, రంపచోడవరం, అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 2002లో ఓటరు జాబితా ఆధారంగా తాజా ఓటర్ల జాబితాను పరిశీలించి, వారిని మ్యాపింగ్ చేయాలన్నారు. మూడు నియోజకవర్గాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, తహశీల్దార్లు, సూపర్‌వైజర్లు, బూత్ లెవల్ అధికారులు యుద్ధప్రాతిపదికన ఈ ప్రక్రియను చేపట్టాలన్నారు. ప్రధానంగా పాడేరు నియోజకవర్గం పరిధిలో జి.మాడుగుల, కొయ్యూరు మండలాలు, రంపచోడవరం నియోజకవర్గంలో వై.రామవరం మండలంలో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ ఎక్కువగా పెండింగ్‌లో ఉందని తెలిపారు. ఆయా ప్రాంతాలకు చెందిన అధికారులు ఓటర్ల మ్యాపింగ్‌పై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు. ఈ నెల 27న ముఖ్య ఎన్నికల అధికారి వీడియో కాన్ఫరెన్స్ ఉందని, మ్యాపింగ్ ప్రక్రియలను పూర్తి చేయాలన్నారు. అలాగే రాష్ట్ర ఎన్నికల సీఈవో వివేక్‌యాదవ్ డిసెంబరు 7న జిల్లాలో పర్యటిస్తారని, అప్పటికి పెండింగ్ పనులన్నీ పూర్తి చేయాలని, ఓటర్ల మ్యాపింగ్‌లో తప్పులు, నిర్లక్ష్యం వంటివి ప్రదర్శించే వారిపై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. బూత్ లెవల్ అధికారులుగా వ్యవహరిస్తున్న వీఆర్‌వోలు, సర్వేయర్లు, ఇతర శాఖల సిబ్బంది తమ పనులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, వారికి ఎంపీడీవోలు సహకరించాలన్నారు. ఓటర్ల మ్యాపింగ్‌తో పాటు కొత్త ఓటర్ల నమోదు, మృతుల పేర్లు తొలగింపు, ఇతర సవరణలు పక్కాగా చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి జేసీ, ఐటీడీఏ పీవో టి.శ్రీపూజ, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, ఆర్‌డీవో లోకేశ్వరరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అంబేడ్కర్, అన్ని మండలాలకు చెందిన తహశీల్దార్లు, సూపర్‌వైజర్లు, బీఎల్‌వోలు పాల్గొన్నారు.