పేరుకుపోతున్న ఫ్లైయాష్
ABN , Publish Date - Dec 24 , 2025 | 01:13 AM
థర్మల్ విద్యుత్ పవర్ ప్లాంట్ల ద్వారా వస్తున్న ఫ్లైయాష్ (బూడిద) వినియోగంలో వ్యూహాత్మక విధానాలు అనుసరించకపోవడంతో కాలుష్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.
వినియోగంలో లోపించిన వ్యూహం
రోజురోజుకీ పెరుగుతున్న కాలుష్యం
వచ్చిన బూడిదను వచ్చినట్టు బయటకు పంపడానికి ఏర్పాట్లు చేయాలనే డిమాండ్
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
థర్మల్ విద్యుత్ పవర్ ప్లాంట్ల ద్వారా వస్తున్న ఫ్లైయాష్ (బూడిద) వినియోగంలో వ్యూహాత్మక విధానాలు అనుసరించకపోవడంతో కాలుష్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇటీవల దీనిపై సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫ్లైయాష్‌ను 100 శాతం వినియోగించుకునేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఫ్లైయాష్‌ను పాండ్ (చెరువు)కు తరలించకుండా వినియోగదారులకు అందించే అంశాలపై అధికారులు దృష్టిసారించారు.
జిల్లా వరకు చూస్తే పరవాడలోని ఎన్‌టీపీసీ థర్మల్ పవర్ ప్లాంటులో రోజుకు పది వేల టన్నుల ఫ్లైయాష్ ఉత్పత్తి అవుతోంది. దీనిని రెండేళ్ల క్రితం వరకు ఉచితంగా ఇచ్చేవారు. ఇటుకల తయారీదారులు దీనిని లారీల ద్వారా తీసుకువెళ్లేవారు. కేంద్ర ప్రభుత్వం యాష్ పాండ్లను ఖాళీ చేయాలని, నిల్వలు ఉంచకూడదని ఆదేశించింది. విద్యుదుత్పత్తి రంగంలో ఉన్న అదానీ సంస్థ ఆ బూడిదను కూడా క్యాష్ చేసుకోవడానికి యత్నించింది. ఎవరికీ ఉచితంగా ఇవ్వవద్దని, ఎంతో కొంత ధర చెల్లిస్తే సద్వినియోగం అవుతుందని ఆదేశాలు ఇప్పించింది. అప్పటివరకు ఉచితంగా లభించిన ఫ్లైయాష్‌ను డబ్బులు ఇచ్చి కొనుక్కోవలసిన పరిస్థితి ఏర్పడింది. దాంతో ఇటుకల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. ధరలు కూడా పెరిగాయి. ఇటుక తయారీదారులే సంఘాలుగా ఏర్పడి టెండర్లు వేసి టన్ను రూ.50 చొప్పున ఎన్‌టీపీసీ వద్ద కొనుగోలు చేసి, రూ.100 చొప్పున ఇటుక తయారీదారులకు విక్రయించడం ప్రారంభించాయి. అది కూడా వెంటనే ఇవ్వడం లేదు. లారీలను ప్లాంటు వద్ద నిలిపితే లోడింగ్‌కు గంటల సమయం పడుతోంది. దీంతో రవాణా చార్జీలు పెరగిపోతున్నాయి.
ఫ్లైయాష్‌తో ఇటుకలు తయారుచేసే పరిశ్రమలు ఉమ్మడి జిల్లాలో సుమారు 300 వరకూ ఉన్నాయి. అవన్నీ పరవాడ ఎన్‌టీపీసీ ప్లాంటుపైనే ఆధారపడి పనిచేస్తున్నాయి. ఎన్‌టీపీసీ నుంచి బూడిదను సిమెంట్ పరిశ్రమలు కూడా తీసుకువెళుతున్నాయి. జాతీయ రహదారుల నిర్మాణంలో వినియోగిస్తున్నారు. ఇటీవల విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు. పరవాడ ఎన్‌టీపీసీలో ఉత్పత్తి అయ్యే బూడిదను 100 శాతం వినియోగిస్తున్నామని చెబుతున్నా...పాండ్‌లో నిల్వలు భారీగానే ఉన్నాయి. హిందూజాలో ఈ నిల్వలు మరింత అధికం. భారీ వర్షాలు కురిసినప్పుడు బూడిద వర్షపు నీటితో కలిసి పరిసరాల్లోని పొలాల్లోకి వెళుతోంది. దాంతో అవి నిస్సారంగా మారిపోతున్నాయి. అదేవిధంగా పాండ్లలో నిల్వ చేసిన బూడిద గాలులకు ఎగిరి పరిసర గ్రామాలపైకి చేరి శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతోంది. పిట్టవానిపాలెం గ్రామం ఈ కారణంగానే చాలావరకు ఖాళీ అయిపోయింది. ఈ సమస్యల నివారణకు వచ్చిన బూడిదను వచ్చినట్టు బయటకు పంపడానికి ఏర్పాట్లు చేయాల్సి ఉంది.
డెలివరీ విధానం అమలుచేయాలి
రాష్ట్ర ప్రభుత్వం 100 శాతం ఫ్లైయాష్‌ను ఉపయోగించుకోవాలని ఆదేశించినందున థర్మల్ పవర్ ప్లాంట్లలో వెంటనే బయటకు వెళ్లే ఏర్పాట్లు చేయాలి. ఇటుకల తయారీదారులకు సత్వరం అందించేందుకు ప్రత్యేక విధానం అమలుచేయాలి. క్యూలైన్లలో గంటల కొద్దీ వాహనాలను నిలిపే పరిస్థితికి చరమగీతం పాడాలి. బూడిదకు విపరీతమైన డిమాండ్ ఉంది. వీలైనంత తక్కువ ధరకు అందించగలిగితే మూతపడిన ఇటుకల పరిశ్రమలు మళ్లీ తెరుచుకుంటాయి.
- కాళిదాసు, డైరెక్టర్ ఇన్‌స్వారెబ్