రెండు ఆశ్రమాలకు వసతి
ABN , Publish Date - May 17 , 2025 | 12:59 AM
గడిచిన ఆరేళ్లుగా వసతి సమస్యతో సతమతమైన గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలకు కూటమి ప్రభుత్వం రాకతో మోక్షం లభించింది. ఆరేళ్ల క్రితం ఆశ్రమాల్లో ప్రారంభమైన అదనపు తరగతుల భవనాల పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు పనులను నిలుపుదల చేయాల్సి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిధులను మంజూరు చేసి పూర్తి చేయించింది. వివరాల్లోకి వెళితే..
కూటమి ప్రభుత్వం రాకతో మోక్షం
మంప, శరభన్నపాలెంల్లో అదనపు భవనాలకు
ఆరేళ్ల క్రితం నిధులు మంజూరు
చకచకా పనులు చేసిన కాంట్రాక్టర్లు
బిల్లులు మంజూరు చేయని వైసీపీ ప్రభుత్వం
కోర్టును ఆశ్రయించిన కాంట్రాక్టర్లు
బిల్లులు చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చినా
స్పందించని వైసీపీ ప్రభుత్వం
కూటమి ప్రభుత్వం రాకతో నిధులు విడుదల
శరవేగంతో పనులు పూర్తి
కొయ్యూరు, మే 9 (ఆంధ్రజ్యోతి):
గడిచిన ఆరేళ్లుగా వసతి సమస్యతో సతమతమైన గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలకు కూటమి ప్రభుత్వం రాకతో మోక్షం లభించింది. ఆరేళ్ల క్రితం ఆశ్రమాల్లో ప్రారంభమైన అదనపు తరగతుల భవనాల పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు పనులను నిలుపుదల చేయాల్సి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిధులను మంజూరు చేసి పూర్తి చేయించింది. వివరాల్లోకి వెళితే..
మండలంలోని మంప, శరభన్నపాలెం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో అదనపు భవనాలకు 2018 సంవత్సరంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. మంప ఆశ్రమ పాఠశాలలో అదనపు భవనాలకు ఎడ్యుకేషన్ ఇన్‌ఫ్రాస్త్రక్చర్ నిఽధులు రూ.1.6 కోట్లు, కిచెన్ కమ్ డైనింగ్ భవన నిర్మాణాలకు రూ.40 లక్షలు మంజూరు చేసింది. అలాగే శరభన్నపాలెం బాలుర ఆశ్రమ పాఠశాలలో అదనపు వసతి భవన నిర్మాణాలకు రూ.2 కోట్లు మంజూరు చేసింది. వీటి నిర్మాణ బాధ్యతలను గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ అధికారులు అప్పగించారు. వారు టెండర్లు పిలిచి పనులను కాంట్రాక్టర్లకు అప్పగించారు. మంప ఆశ్రమంలో రూ.1.3 కోట్ల మేర పనులు చేయగా.. శరభన్నపాలెం ఆశ్రమంలో రూ.90 లక్షల మేర పనులు పూర్తి చేశారు. మంపలో డైనింగ్ కమ్ కిచెన్ షెడ్డుకు పునాదులు వేశారు. అనంతరం రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత కూడా కాంట్రాక్టర్లు పనులు చేశారు. అధికారులు పనుల వివరాలను ఎం.బుక్‌ల్లో నమోదు చేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి బిల్లులు పంపారు. అయితే వైసీపీ ప్రభుత్వం వీటికి సంబంధించి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. దీంతో కాంట్రాక్టర్లు పనులు నిలిపేశారు. బిల్లుల చెల్లింపులు జరగకపోవడంతో కాంట్రాక్టర్లు అప్పులకు వడ్డీలు పెరిగి తీవ్ర ఆర్థిక ఇబ్బందుల పాలయ్యారు. దీంతో కాంట్రాక్టర్లు కోర్టులను ఆశ్రయించి చెల్లింపులు చేసేలా ఆర్డరు తెచ్చుకున్నారు. అయినప్పటికీ గత ప్రభుత్వం కోర్టు ఆదేశాలను అమలుపర్చకుండా కాలయాపన చేసింది. పది నెలల క్రితం అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం అభివృద్ది పనులపై సమగ్ర నివేదిక రప్పించుకుంది. మండలంలో మంప, శరభన్నపాలెం ఆశ్రమ పాఠశాలల్లో పనులు నిలిపివేసిన విషయాన్ని గుర్తించి, వాటికి నిధులు మంజూరు చేసింది. దీంతో కాంట్రాక్టర్లు పనులను పూర్తి చేశారు. ఈ అదనపు భవనాలు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. రెండు ఆశ్రమాలకు వసతి సమస్య తీరడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.