Share News

ఇంజనీరింగ్‌ పనులు వేగవంతం

ABN , Publish Date - Nov 17 , 2025 | 11:25 PM

జిల్లాలో వివిధ అభివృద్ధి పథకాల్లో మంజూరైన ఇంజనీరింగ్‌ పనులను వేగవంతం చేయాలని అధికారులను కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ ఆదేశించారు.

ఇంజనీరింగ్‌ పనులు వేగవంతం
మాట్లాడుతున్న కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌

అధికారులకు కలెక్టర్‌ ఆదేశం

ఆయా పనులు జనవరిలోపు పూర్తి చేయాలని సూచన

పాడేరు, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): జిల్లాలో వివిధ అభివృద్ధి పథకాల్లో మంజూరైన ఇంజనీరింగ్‌ పనులను వేగవంతం చేయాలని అధికారులను కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ ఆదేశించారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై వివిధ శాఖల ఇంజనీరింగ్‌ అధికారులతో ఆయన సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. తుఫాన్ల కారణంగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతు పనులను సకాలంలో పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. అలాగే జన్‌మన్‌ యోజనలో మంజూరైన భవనాలను పూర్తి చేయాలన్నారు. అటవీ అనుమతులు లేని కారణంగా ఆగిన పనులపై ఆరా తీశారు. అందుకు అవసరమైన చర్యలు చేపడతామని, సంబంధిత అధికారులు తమకు ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. గ్రౌండింగ్‌ చేయాల్సిన పనులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, నిర్మాణంలో ఉన్న పనులను వేగవంతం చేయాలన్నారు. జాతీయ రహదారి విస్తరణకు సంబంధించి శాఖల అనుమతి త్వరితగతిన లభించేలా ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు. కొత్త రోడ్ల నిర్మాణానికి సంబంధిత శాఖల ఇంజనీరింగ్‌ అధికారులు ప్రతిపాదనలు చేయాలన్నారు. పూర్తయిన పనులకు సంబంధించిన బిల్లులను సకాలంలో సమర్పించాలని, పర్యాటక ప్రదేశాలకు రోడ్ల అనుసంధానంపై దృష్టి సారించాలన్నారు. జిల్లాలో పాడేరు, రంపచోడవరం, చింతూరు ఐటీడీఏల పరిధిలో జరుగుతున్న భవన, రోడ్ల నిర్మాణాలపై కలెక్టర్‌ ఆరా తీసి, అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్‌ అభియాన్‌లో మంజూరైన గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలను వేగవంతం చేయాలని, శిథిల భవనాలను గుర్తించి వాటి స్థానంలో కొత్త భవనాలకు ప్రతిపాదనలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పాడేరు, రంపచోడవరం, చింతూరు ఐటీడీఏల పీవోలు శ్రీపూజ, స్మరణ్‌రాజ్‌, శుభం నొక్వాల్‌, రోడ్లు, భవనాల శాఖ ఈఈ బాలసుందరంబాబు, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్‌ విభాగం ఈఈలు జి.డేవిడ్‌రాజ్‌, వేణుగోపాల్‌, పంచాయతీరాజ్‌ శాఖ ఈఈ టి.కొండయ్యపడాల్‌, డీఈఈ జ్యోతిబాబు, సీపీవో ప్రసాద్‌, వివిధ శాఖల ఇంజనీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

ఇంజనీరింగ్‌ పనులు వేగవంతం

Updated Date - Nov 17 , 2025 | 11:25 PM