గుట్టుగా ఏసీబీ విచారణ
ABN , Publish Date - Nov 07 , 2025 | 12:59 AM
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారుల తనిఖీలు రెండో రోజూ కొనసాగాయి.
సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాల్లో రెండో రోజూ కొనసాగిన సోదాలు
పెండింగ్ డాక్యుమెంట్లపై ఆరా
షాపులు మూసేసిన డాక్యుమెంట్ రైటర్లు
విశాఖపట్నం, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి):
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారుల తనిఖీలు రెండో రోజూ కొనసాగాయి. సూపర్‌బజార్, మధురవాడ, పెదగంట్యాడ కార్యాలయాల్లో గురువారం మరింత లోతుగా పరిశీలన చేశారు. కార్యాలయాల్లో పెండింగ్ డాక్యుమెంట్లపైన, రిజిస్ట్రేషన్ పూర్తయిన తరువాత డాక్యుమెంట్లు కొనుగోలుదారులకు ఇవ్వకుండా ఉంచడంపైనా ప్రశ్నించినట్టు తెలిసింది. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ చేసిన రోజే డాక్యుమెంట్ సంబంధిత పార్టీకి అప్పగించాలి. కానీ కొన్ని డాక్యుమెంట్లు వారాల తరబడి కార్యాలయంలోనే ఉండడంపై అనుమానాలు కలిగి వాటిపై ప్రశ్నించినట్టు సమాచారం. రిజిస్ట్రేషన్ పూర్తయిన డాక్యుమెంట్లను ఇంతకు ముందులా డాక్యుమెంట్ రైటర్లకు ఇవ్వడం లేదని, కొనుగోలుదారుడే బయోమెట్రిక్ వేసి తీసుకువెళ్లాల్సి ఉందని, వారు రాకపోవడం వల్లే ఇవ్వలేకపోయామని సబ్ రిజిస్ట్రార్లు వివరించినట్టు తెలిసింది. లంచాల వ్యవహారం ఆశించిన స్థాయిలో బయటకపోవడంతో ఏసీబీ అధికారులు పెండింగ్ డాక్యుమెంట్ల ద్వారా ఏమైనా తెలుస్తుందేమోనని ఆయా పార్టీలతోను మాట్లాడినట్టు చెబుతున్నారు. అందుకనే మధురవాడలో రికార్డ్ రూమ్‌కు బుధవారం రాత్రి సీల్ చేశారు.
డాక్యుమెంట్ రైటర్ల షాపులు మూసివేత
సూపర్‌బజార్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీ చేసినప్పుడు డాక్యుమెంట్ రైటర్ల సహాయకులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర డబ్బులు, డాక్యుమెంట్ల వివరాలు స్టేట్‌మెంట్లలో పెట్టారు. దాంతో భయపడిన డాక్యుమెంట్ రైటర్లు గురువారం షాపులు మూసేసి వెళ్లిపోయారు.