Share News

సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో అర్ధరాత్రి వరకూ ఏసీబీ తనిఖీలు

ABN , Publish Date - Nov 08 , 2025 | 01:24 AM

జిల్లాలోని మూడు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు చేపట్టిన సోదాలు గురువారం రాత్రి ఒంటి గంటతో ముగిశాయి.

సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో అర్ధరాత్రి వరకూ ఏసీబీ తనిఖీలు

ఐవీఆర్‌ఎస్‌ ఫీడ్‌ బ్యాక్‌ ఆధారంగా సోదాలు

ప్రొసీజర్‌, సిబ్బంది ప్రవర్తనపై కూడా దృష్టి

పరిశీలనలో గుర్తించిన అంశాలను ప్రభుత్వానికి నివేదిస్తామని అధికారుల వెల్లడి

నగదుగా దొరికింది రూ.10 వేలు మాత్రమే

కార్యాలయాల్లో డాక్యుమెంట్లు తక్షణమే తీసుకువెళ్లాలని సబ్‌ రిజిస్ర్టార్‌ల లేఖలు

విశాఖపట్నం, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలోని మూడు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు చేపట్టిన సోదాలు గురువారం రాత్రి ఒంటి గంటతో ముగిశాయి. రెండు రోజుల పరిశీలనలో గుర్తించిన అంశాలను ప్రభుత్వానికి నివేదిస్తామని తనిఖీ అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతి శాఖ పనితీరుపైనా ఐవీఆర్‌ఎస్‌ ద్వారా అభిప్రాయాలు తీసుకుంటోంది. వాటి ద్వారా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ఏసీబీని ఆదేశించింది. రిజిస్ట్రేషన్లకు లంచాల డిమాండ్‌, అక్కడి సిబ్బంది దుష్ప్రవర్తన, ప్రొసీజర్‌ను పక్కనపెట్టి అధికారులు వ్యవహరించే తీరు, తదితర అంశాలపై ఏసీబీ అధికారులు అధికంగా దృష్టి పెట్టినట్టు సమాచారం.

పెండింగ్‌ డాక్యుమెంట్లే అధికం

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు సమర్పించాల్సిన పత్రాల్లో ఏవైనా లేనప్పుడు వాటి రిజిస్ట్రేషన్‌ పెండింగ్‌ పెడతారు. సూచించిన పత్రాలు తీసుకువచ్చాక రిజిస్ట్రేషన్‌ పూర్తిచేస్తారు. అంతవరకు పెండింగ్‌ నంబర్‌తో పక్కన ఉంచుతారు. ఇది ఒక రకం పెండింగ్‌. ప్రభుత్వ భూములను ఆక్రమించి ఇళ్లు నిర్మించుకున్న పేదలకు టీడీపీ ప్రభుత్వం గతంలో పట్టాలు ఇచ్చింది. వాటికి ఇప్పుడు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల ద్వారా కన్వేయన్స్‌ డీడ్స్‌ ఇస్తోంది. వీఆర్‌ఓల ద్వారా మండలాల తహశీల్దార్లు ఈ రిజిస్ట్రేషన్లను చేయిస్తున్నారు. జిల్లాలో 24 వేల రిజిస్ట్రేషన్లు చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 13 వేలు పూర్తయ్యాయి. ఆక్రమితదారుడి పేరిట రిజిస్ట్రేషన్‌ చేసిన తరువాత ఆ డాక్యుమెంట్‌ను తహశీల్డార్‌ సూచించిన వీఆర్‌ఓకే ఇస్తారు. కక్షిదారులకు ఇవ్వరు. అయితే వీఆర్‌ఓలు గ్రామంలో అన్ని రిజిస్ట్రేషన్లు పూర్తయిన తరువాత వచ్చి తీసుకువెళతామంటూ వాటిని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఉంచేస్తున్నారు. ఇవి రెండో రకం పెండింగ్‌ డాక్యుమెంట్లు. ఇలాంటివి ఒక్కో కార్యాలయంలో 200 వరకూ ఉన్నాయి. వీటిని కూడా ఏసీబీ అధికారులు తప్పుబట్టారు. ఎప్పటికప్పుడు ఎందుకు ఇవ్వడం లేదని సబ్‌ రిజిస్ట్రార్లను ప్రశ్నించారు. అందులో తమ జాప్యం లేదని రెవెన్యూ సిబ్బందే రావడం చెప్పినట్టు సమాచారం. ఏసీబీ అధికారుల అభ్యంతరం చెప్పిన నేపథ్యంలో అన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల నుంచి రెవెన్యూ అధికారులకు వాటిని తీసుకువెళ్లాల్సిందిగా శుక్రవారం లేఖలు వెళ్లాయి.

విశాఖలో దొరికింది రూ.10 వేలు మాత్రమే

ఏసీబీ అధికారులు విశాఖ జిల్లాలో మూడు కార్యాలయాల్లో సోదాలు చేస్తే సూపర్‌బజార్‌ (ఆర్‌వో) కార్యాలయంలో మాత్రమే రూ.10 వేల నగదు ఒక పెళ్లి కార్డు కవరులో దొరికింది. అది ఎవరు తెచ్చారు?, ఎవరికి ఇచ్చారు?...అనే వివరాలు బయటకు రాలేదు. మధురవాడ, పెదగంట్యాడ కార్యాలయాల్లో ఏమీ లభించలేదు. పలువురు డాక్యుమెంట్‌ రైటర్ల వద్ద నగదు, వారి ఫోన్ల లావాదేవీలను ఏసీబీ అధికారులు పరిశీలించారు. వాటి వివరాలు కూడా నమోదు చేసుకున్నారు.

Updated Date - Nov 08 , 2025 | 01:24 AM