సాగునీరు పుష్కలం
ABN , Publish Date - Oct 14 , 2025 | 01:31 AM
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో నైరుతి రుతుపవనాల ద్వారా జిల్లాలో వర్షాలు సమృద్ధిగా కురిశాయి.
జలాశయం గరిష్ఠ ప్రస్తుత
నీటిమట్టం నీటిమట్టం
రైవాడ 114 మీటర్లు 113.39 మీటర్లు
కోనాం 101 మీటర్లు 99.6 మీటర్లు
పెద్దేరు 137 మీటర్లు 135.7 మీటర్లు
తాండవ 380 అడుగులు 376.5 అడుగులు
కల్యాణపులోవ 460 అడుగులు 450.50 అడుగులు
----------
నిండుకుండల్లా జలాశయాలు
పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు
రిజర్వాయర్లలోకి వరద నీరు
తాండవ మినహా మిగిలినవన్నీ ఫుల్
ఇప్పటికే పలుమార్లు గేట్లు ఎత్తిన అధికారులు
అనకాపల్లి, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి):
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో నైరుతి రుతుపవనాల ద్వారా జిల్లాలో వర్షాలు సమృద్ధిగా కురిశాయి. జూలైలో మినహా మిగిలిన అన్ని నెలల్లో సాధారణంకన్నా ఎక్కువ వర్షంపాతం నమోదైంది. దీంతో సాగునీటి జలాశయాల్లోకి పుష్కలంగా నీరు చేరుతున్నది. పెద్దేరు రిజర్వాయర్ ఆగస్టు చివరి వారంలోనే నిండింది. అప్పటి నుంచి అడపాదడపా గేట్లు ఎత్తి, అదనపు నీటిని దిగువకు విడిచిపెడుతున్నారు. తరువాత గత నెలలో రైవాడ, కోనాం, కల్యాణపులోవ జలాశయాలు నిండాయి. ఆయా ప్రాజెక్టుల అధికారులు ఇన్‌ఫ్లోనుబట్టి అదనపు నీటిని దిగువకు విడుదలచేస్తూ జలాశయాల్లో నీటి నిల్వలను క్రమబద్ధీకరిస్తున్నారు. వాస్తవంగా తాండవ జలాశయం కూడా పూర్తిగా నిండాల్సింది. కానీ ఆయకట్టు అధికంగా వుండడంతో రిజర్వాయర్‌లోకి ఎంత నీరు వచ్చిచేరుతున్నదో.. ఇంచుమించుగా అంతేనీటిని కాలువల ద్వారా పొలాలకు విడిచిపెడుతున్నారు. దీంతో తాండవ జలాశయంలో నీటి మట్టం గరిష్ఠస్థాయికి నాలుగైదు అడుగుల దిగువన కొనసాగుతున్నది. రైవాడ జలాశయం గరిష్ఠ నీటిమట్టం 114 మీటర్లు కాగా సోమవారం 113.39 మీటర్ల వద్ద స్థిరంగా వుంది. తాండవ గరిష్ఠ నీటిమట్టం 380 అడుగులు 376.5 అడుగులు వుంది. కాగా బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో రానున్న రెండు రోజులు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ సూచించడంతో జల వనరుల శాఖ అధికారులు అమప్రమత్తమయ్యారు. రిజర్వాయర్లలోకి వచ్చే వరదనీటికి అనుగుణంగా స్పిల్‌వే గేట్లు ఎత్తి అదనపు నీటిని దిగువకు విడిచిపెడతామని జిల్లా జలవనరుల శాఖ అధికారి త్రినాథం తెలిపారు.
ముసురు
పలు మండలాల్లో భారీ వర్షం
మిగిలిన ప్రాంతాల్లో మోస్తరు జల్లులు
(ఆంధ్రజ్యోతి- న్యూస్‌నెట్‌వర్క్)
బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనాల ప్రభావంతో జిల్లాలో సోమవారం ముసురు వాతావరణం నెలకొంది. ఆదివారం అర్ధరాత్రి తరువాత పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. సోమవారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై వుంది. నర్సీపట్నం, రావికమతం, బుచ్చెయ్యపేట, గొలుగొండ, చీడికాడ మండలాల్లో ఉరుములు, పిడుగులతో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. మిగిలిన మండలాల్లో జల్లులు పడ్డాయి. సాయంత్రం తరువాత కూడా ఆకాశం మేఘావృతమై అడపాదడపా మోస్తరు వర్షం కురుస్తున్నది. పట్టణ ప్రాంతాలు, మండల కేంద్రాల్లో డ్రైనేజీలు పొంగి రోడ్లపై వర్షం ననీరరు ప్రవహించింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వర్షాల కారణంగా రహదారులు మరింత దెబ్బతింటున్నాయి. గెడ్డలు, వాగులు, నదుల్లో వరద ప్రవాహం కొనసాగుతున్నది. రిజర్వాయర్లలోకి వరద నీరు చేరుతోంది. అత్యధిక శాతం చెరువులు ఇప్పటికే పూర్తిగా నిండాయి. మెట్ట ప్రాంతాల్లో వరి, చెరకు, కూరగాయ పంటలకు వర్షం మేలు చేస్తుందని రైతులు చెబుతున్నారు.