Share News

ఆయాయే టీచర్‌

ABN , Publish Date - Jun 26 , 2025 | 11:33 PM

పాఠశాల పునఃప్రారంభం నుంచి మండలంలోని పద్మాపురం గ్రామంలో గల ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాలలో ఆయాయే టీచర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక్కడి ఉపాధ్యాయుడు బదిలీపై వెళ్లిపోవడంతో విద్యార్థులు చదువుకు, మధ్యాహ్న భోజనానికి దూరం కాకుండా ఆయాగా పని చేస్తున్న కె.విజయమ్మ పాఠశాలను నడుపుతున్నారు.

ఆయాయే టీచర్‌
పిల్లలకు అక్షరాలు నేర్పిస్తున్న ఆయా విజయమ్మ

పాఠశాల పునఃప్రారంభం నుంచి పద్మాపురంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఇదే పరిస్థితి

ఇక్కడి ఉపాధ్యాయుడు బదిలీపై వెళ్లిపోగా, ఎవరినీ నియమించని వైనం

విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన

అరకులోయ, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): పాఠశాల పునఃప్రారంభం నుంచి మండలంలోని పద్మాపురం గ్రామంలో గల ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాలలో ఆయాయే టీచర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక్కడి ఉపాధ్యాయుడు బదిలీపై వెళ్లిపోవడంతో విద్యార్థులు చదువుకు, మధ్యాహ్న భోజనానికి దూరం కాకుండా ఆయాగా పని చేస్తున్న కె.విజయమ్మ పాఠశాలను నడుపుతున్నారు. తన కుమార్తెతో పాటు డిగ్రీ చదువుతున్న మరో యువతితో పిల్లలకు పాఠాలు చెప్పిస్తున్నారు. కాగా పాఠశాలకు టీచర్‌ను నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులు గురువారం ఆందోళన చేశారు.

పద్మాపురం గ్రామంలోని ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి నాల్గవ తరగతి వరకు 48 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ ఏడాది బడి ఈడు పిల్లలు మరో 15 మంది చేరారు. అయితే బదిలీల్లో భాగంగా ఇక్కడి టీచర్‌ వెళ్లిపోయారు. ఆయన స్థానంలో ఎవరినీ నియమించలేదు. పాఠశాల పునఃప్రారంభం నుంచి ఉపాధ్యాయుడు లేకపోవడంతో పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. వారు బడికి దూరం కాకూడదనే ఉద్దేశంతో ఆయా విజయమ్మ విశాఖలో ఎల్‌ఎల్‌బీ చదువుతున్న తన కుమార్తె తనుష్కా, విశాఖలో డిగ్రీ చదువుతున్న అదే గ్రామానికి చెందిన అనుషాలతో పిల్లలకు పాఠాలు చెప్పిస్తున్నారు. మధ్యాహ్నం సన్నబియ్యంతో విద్యార్థులకు భోజనం పెడుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ పాఠశాలకు ఉపాధ్యాయుడిని నియమించకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే టీచర్‌ను నియమించాలని ఆందోళన చేస్తున్నారు.

Updated Date - Jun 26 , 2025 | 11:33 PM