Share News

మద్యం నేరాలపై నిఘా నేత్రం

ABN , Publish Date - Jul 06 , 2025 | 12:31 AM

మద్యం నేరాలపై ప్రభుత్వం నిఘాను కట్టుదిట్టం చేస్తోంది. ప్రభుత్వం, ఎక్సైజ్‌ ఐ యాప్‌ ద్వారా వైన్‌షాపులపై అధికారుల పర్యవేక్షణను మరింత పెంచింది. ఇప్పటికే ప్రతీ మద్యం షాపు దగ్గర సీసీ కెమెరాలు తప్పనిసరి చేసి ప్రైవేటు ఐపీ(ఇంటర్నెట్‌ ప్రొటోకాల్‌) నుంచి పబ్లిక్‌ ఐపీకి మార్చింది.

 మద్యం నేరాలపై నిఘా నేత్రం
నర్సీపట్నం ఎక్సైజ్‌ స్టేషన్‌

- ఎక్సైజ్‌ ఐ యాప్‌ ద్వారా 24 గంటలూ పర్యవేక్షణ

- కానిస్టేబుల్‌ నుంచి ఉన్నతాధికారుల వరకు బాధ్యతలు

- జిల్లాలోని 8 ఎక్సైజ్‌ స్టేషన్ల పరిధిలో యాప్‌ వినియోగం

- ఇప్పటికే సీసీ కెమెరాలను పబ్లిక్‌ ఐపీకి మార్చిన వైనం

నర్సీపట్నం, జూలై 5(ఆంధ్రజ్యోతి): మద్యం నేరాలపై ప్రభుత్వం నిఘాను కట్టుదిట్టం చేస్తోంది. ప్రభుత్వం, ఎక్సైజ్‌ ఐ యాప్‌ ద్వారా వైన్‌షాపులపై అధికారుల పర్యవేక్షణను మరింత పెంచింది. ఇప్పటికే ప్రతీ మద్యం షాపు దగ్గర సీసీ కెమెరాలు తప్పనిసరి చేసి ప్రైవేటు ఐపీ(ఇంటర్నెట్‌ ప్రొటోకాల్‌) నుంచి పబ్లిక్‌ ఐపీకి మార్చింది. ఇప్పటికి ఈ ప్రక్రియ 50 శాతం పూర్తయింది. ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో బీఎస్‌ఎన్‌ఎల్‌ కేబుల్స్‌ వేయడం పూర్తయితే సీసీ కెమెరాలు పూర్తిస్థాయిలో వినియోగంలోకి వస్తాయి. దీని వలన ఎక్సైజ్‌ స్టేషన్‌తో పాటు, జిల్లా కేంద్రం, అమరావతి నుంచి కూడా పర్యవేక్షణ సులభతరం చేశారు.

తాజాగా ప్రభుత్వం ఎక్సైజ్‌ అధికారులకు ఎక్సైజ్‌ నేత్రం (ఎక్సైజ్‌ ఐ) యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఎనిమిది ఎక్సైజ్‌ స్టేషన్‌ల పరిధిలోని ఇన్‌స్పెక్టర్లు, సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, కానిస్టేబుళ్లు, హెడ్‌ కానిస్టేబుళ్లు యాప్‌ను స్మార్ట్‌ ఫోన్లలో ఇన్‌స్టాల్‌ చేసుకున్నారు. మద్యం నేరాలపై కానిస్టేబుల్‌ దగ్గర నుంచి జిల్లా స్థాయిలో ఉన్నతాధికారులు వరకు ఒక షెడ్యూల్‌ ప్రకారం పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. కానిస్టేబుల్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ మూడు రోజులకు ఒకసారి, అలాగే ఎస్‌ఐ, సీఐలు వారంలో ఒక రోజు వైన్‌ షాపులు తనిఖీలకు వెళ్లాలి. ఎక్సైజ్‌ స్టేషన్‌ నుంచి బయలుదేరే ముందే యాప్‌ ఓపెన్‌ చేసి ఆన్‌ చేయాలి. దీని వలన తనిఖీలకు వెళుతున్న అధికారి ప్రతీ కదలిక అమరావతి నుంచి పర్యవేక్షణ చేస్తారు. వారు ఏ వైన్‌ షాపు దగ్గరకు వెళ్లారు. ఏమేమి తనిఖీలు చేస్తున్నారు అన్న విషయాలు ఉన్నతాధికారుల గమనిస్తుంటారు. వెళ్లిన షాపు దగ్గర నుంచి ఫొటోలు తీయాలి. షాపులలో మద్యం లూజ్‌ సేల్స్‌, అంతరాష్ట్ర మద్యం ఏమైనా నిల్వలు ఉన్నాయా?, మద్యం దుకాణానికి అనుబంధంగా అనధికారికంగా పర్మిట్‌ రూమ్‌లు నడుపుతున్నారా? అన్న విషయాలు పరిశీలిస్తారు. ఉదయం షిఫ్ట్‌తో పాటు రెగ్యులర్‌ షిఫ్ట్‌లో ఉదయం 10 గంటలు నుంచి రాత్రి 10 గంటలకు, నైట్‌ షిఫ్ట్‌లో రాత్రి 11 గంటలు నుంచి ఉదయం 5 గంటలు వరకు పర్యవేక్షణ తప్పనిసరి చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వైన్‌ షాపులలో మద్యం లూజ్‌ విక్రయాలు చేయకూడదు. ఒక వ్యక్తికి మూడు మద్యం బాటిళ్లకు మించి ఇవ్వకూడదు. మద్యం బాటిల్‌ మీద ఉన్న నిర్ణీత ధర కంటే అధిక ధరకు విక్రయించ కూడదు. ఎక్సైజ్‌ ఐ యాప్‌ మొదటి విడత ట్రయల్‌ రన్‌ పూర్తి చేశారు. రెండో విడతలో బెల్టు షాపులు, బహిరంగ మద్యం, నాటు సారా నేరాలను యాప్‌లో సంక్షిప్తం చేయబోతున్నారు. యాప్‌ పూర్తి స్థాయిలో వినియోగంలోకి వస్తే అధికారులకు చేతినిండా పని దొరుకుతుంది. మద్యం నేరాలు అదుపులోకి వస్తాయని భావిస్తున్నారు.

పబ్లిక్‌ ఐపీకి మార్చడంలో జాప్యానికి కారణం ఇది..

జిల్లాలో నర్సీపట్నం, గొలుగొండ, వి.మాడుగుల, చోడవరం, పాయకరావుపేట, ఎలమంచలి, సబ్బవరం, అనకాపల్లి ఎక్సైజ్‌ స్టేషన్‌ల పరిధిలో 161 ప్రైవేటు వైన్‌ షాపులు ఉన్నాయి. అన్ని వైన్‌ షాపుల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రైవేటు ఐపీ నుంచి పబ్లిక్‌ ఐపీకి మారాలంటే బ్రాడ్‌బాండ్‌ ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో ప్రైవేటు ఐపీ నుంచి ప్రైవేటు ఐపీకి మార్చేశారు. కాస్త మారుమూల గ్రామాల్లో ఇంటర్నెట్‌ సౌకర్యం అందుబాటులో లేదు. కొన్ని గ్రామాలలో సిగ్నల్స్‌ సమస్య కారణంగా అవాంతరం ఏర్పడుతుందని ఎక్సైజ్‌ అధికారులు అంటున్నారు. ఇంటర్నెట్‌ సౌకర్యం లేని చోట బీఎస్‌ఎన్‌ఎల్‌తో మాట్లాడి వేయిస్తున్నారు. ఇప్పటి వరకు 50 శాతం వైన్‌ షాపులలో పబ్లిక్‌ ఐటీకి మార్చడం జరిగింది. ఇంటర్నెట్‌ కనెక్షన్‌ లేని చోట బీఎస్‌ఎన్‌ఎల్‌ కేబుల్స్‌ వేస్తున్నారు. త్వరలో సీసీ కెమెరాలు కూడా నూరుశాతం కంట్రోల్‌ రూమ్‌ల పరిధిలోకి వస్తాయని అధికారులు అంటున్నారు. తొలి విడత ఎక్సైజ్‌ ఐ యాప్‌ ట్రయల్‌ రన్‌ పూర్తి చేసినట్టు ఎక్సైజ్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ సుర్జిత్‌సింగ్‌ తెలిపారు. రెండో విడతగా మద్యం, నాటు సారా నేరాలను కూడా ఎక్సైజ్‌ యాప్‌లో చేర్చబోతున్నారని తెలిపారు. దీని వలన మోనటరింగ్‌ పెరుగుతుందని, మద్యం, నాటు సారా నేరాలపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Updated Date - Jul 06 , 2025 | 12:31 AM