Share News

అపూర్వ సమ్మేళనం

ABN , Publish Date - Dec 14 , 2025 | 12:44 AM

ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల సమావేశం శనివారం సాయంత్రం ఘనంగా జరిగింది.

అపూర్వ సమ్మేళనం

ఘనంగా ఏయూ పూర్వ విద్యార్థుల సమావేశం

దేశ, విదేశాల నుంచి భారీగా హాజరు

ముఖ్య అతిథిగా ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌, మూర్తి ట్రస్ట్‌ చైర్‌పర్సన్‌, రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి

కట్టమంచికి నివాళులు

అంతకుముందు పూర్వవిద్యార్థుల సంఘం కార్యాలయాన్ని సందర్శించిన సుధామూర్తి

వర్సిటీ అభివృద్ధికి అందించాల్సిన సహకారంపై విలువైన సూచనలు

విశాఖపట్నం, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి):

ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల సమావేశం శనివారం సాయంత్రం ఘనంగా జరిగింది. బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి దేశ, విదేశాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులతోపాటు ప్రస్తుతం చదువుకుంటున్న విద్యార్థులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా హాజరైన ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌, మూర్తి ట్రస్ట్‌ చైర్‌పర్సన్‌, రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి హాజరయ్యారు. విద్యను అందించే దేవాలయం విశ్వవిద్యాలయమని, దీని నిర్మాణానికి ఎందరో త్యాగాలు చేశారన్నారు. వారి త్యాగాలను గుర్తుచేసుకుంటూ భవిష్యత్తును నిర్మించుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఏయూ పూర్వ విద్యార్థుల సంఘ వ్యవస్థాపక చైర్మన్‌ గ్రంథి మల్లికార్జునరావు మాట్లాడుతూ రానున్న వందేళ్లలోనూ గొప్ప వర్సిటీగా నిలిచేలా ఏయూను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. వర్సిటీకి ప్రతి పూర్వ విద్యార్థిని కనెక్ట్‌ చేసి, కార్యకలాపాల్లో ఇన్‌వాల్వ్‌ అయ్యేలా చేద్దామన్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాజకీయాల్లో ఆరు పర్యాయాలు విజయాలు సాధించడానికి వర్సిటీ నుంచి పొందిన స్ఫూర్తి, ఇక్కడ స్నేహాలు దోహదం చేశాయన్నారు. ఏయూ వీసీ ప్రొఫెసర్‌ జీపీ రాజశేఖర్‌ మాట్లాడుతూ శతాబ్ది సంవత్సరంలో ఉన్న ఏయూ మరో వందేళ్ల ప్రణాళికతో ముందుకు సాగుతోందన్నారు. పూర్వ విద్యార్థుల సంఘ చైర్మన్‌ కేవీవీ రావు మాట్లాడుతూ దేశ, రాష్ట్ర, వర్సిటీ భవిష్యత్తు కోసం విద్యార్థులు కృషిచేయాలన్నారు. ఈ సందర్భంగా ఏయూ అలుమ్ని సావనీర్‌ను ఆవిష్కరించారు. పూర్వ విద్యార్థి అయిన డాక్టర్‌ దేవ హెచ్‌ పురాణం, ప్రొఫెసర్‌ ఎ.జానకిరావు, డాక్టర్‌ జి.నిర్మలను సత్కరించారు. అనంతరం ముఖ్య అతిథి సుధామూర్తిని సత్కరించి, రాఘవేంద్రస్వామి చిత్రపటం, జ్ఞాపికను బహూకరించారు. కార్యక్రమంలో ప్రముఖ సినీ నటుడు, మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఆర్పీ పట్నాయక్‌, మాజీ వీసీ జీఎస్‌ఎన్‌ రాజు, దేవ హెచ్‌ పురాణం తదితరులు మాట్లాడారు. రెక్టార్‌ ప్రొఫెసర్‌ కింగ్‌, రిజిస్ర్టార్‌ ప్రొఫెసర్‌ కె.రాంబాబు, మాజీ వీసీ బీల సత్యనారాయణ, ఇంజనీరింగ్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ శశిభూషణరావుతోపాటు పూర్వ విద్యార్థులు, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

కట్టమంచికి పుష్పాంజలి

పూర్వ విద్యార్థుల సమావేశంలో పాల్గొనేందుకు హాజరైన సుధామూర్తికి తొలుత ఏయూ పరిపాలనా భవనం వద్ద వీసీ ప్రొఫెసర్‌ జీపీ రాజశేఖర్‌, ఇతర అధికారులు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం ఆమె ఎన్‌సీసీ విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. విశ్వవిద్యాలయం వ్యవస్థాపక ఉపకులపతి కట్టమంచి రామలింగారెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఏయూ పూర్వవిద్యార్థుల సంఘం కార్యాలయాన్ని సందర్శించారు. వ్యవస్థాపక చైర్మన్‌ జీఎం రావుతో కలిసి కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె వర్సిటీ అభివృద్ధికి పూర్వ విద్యార్థులు అందించాల్సిన సహకారంపై విలువైన సూచనలు చేశారు. ఏయూ లైబ్రరీలో ఉన్న తాళపత్రాల జ్ఞానాన్ని సంబంధిత నిపుణులతో అధ్యయనం చేయించి, వినియోగంలోకి తీసుకురావాలన్నారు. పూర్వ విద్యార్థులతో బంధాన్ని ఏర్పరచడం, బోధన పటిష్ఠం చేయడం, ఉపాధి అవకాశాలు మెరుగుపరచడంలో కీలక సూచనలు చేశారు.

అనంతరం ఏయూ పరిపాలనా భవనం నుంచి బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌ వద్దకు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటుచేసిన రతన్‌టాటా చిత్రపటానికి నివాళులర్పించారు. ఆ తరువాత ప్రధాన వేదికపై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. వ్యవస్థాపక ఉపకులపతి కట్టమంచి రామలింగారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు.

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు..

ఈ సందర్భంగా భారతీయ సంస్కృతీ, సంప్రదాయాలకు అద్దం పడుతూ విద్యార్థులు ప్రదర్శించిన శాస్ర్తీయ, జానపద నృత్యాలు ఎంతగానో అలరించాయి. ఏయూలోని విదేశీ విద్యార్థులు కూడా తమ సంస్కృతిని ప్రతిబింబిస్తూ ప్రదర్శన ఇచ్చారు.

తెలుగులో మాట్లాడిన సుధామూర్తి..

ముఖ్య అతిథిగా హాజరైన సుధామూర్తి తన ప్రసంగాన్ని తొలుత తెలుగులో ప్రారంభించారు. అందరికీ నమస్కారం అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన ఆమె...తనకు తెలుగు అర్థం అవుతుందన్నారు. ఈ మధ్య విడుదలైన చిరంజీవి, నయనతార సినిమా టీజర్‌ ఎంతో బాగుందన్నారు. కర్ణాటక, తెలుగు భాషలు ఒకేలా ఉంటాయని, రెండు ప్రాంతాలకు చెందిన ప్రజల జీవన విధానం ఒకేవిధంగా ఉంటుందన్నారు. ఉన్న దాంతో ఆనందంగా ఉండేందుకు ఇష్టపడతారన్నారు.

Updated Date - Dec 14 , 2025 | 12:44 AM