Share News

క్రికెట్‌లో రాణిస్తున్న ఆదివాసీ బిడ్డ

ABN , Publish Date - Dec 09 , 2025 | 02:04 AM

పాడేరు మండలం వంట్లమామిడి గ్రామంలో కడు పేదరిక కుటుంబంలో పుట్టి పెరిగిన ఆదిమ జాతి గిరిజన విద్యార్థిని పాంగి కరుణకుమారి టీ20 ప్రపంచ కప్‌-2025 విజేతగా నిలిచిన భారతదేశ జట్టు నుంచి ప్రాతినిధ్యం వహించడంపై మన్యం వాసులు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

క్రికెట్‌లో రాణిస్తున్న ఆదివాసీ బిడ్డ

కుగ్రామం నుంచి ప్రపంచ స్థాయికి...

అంధుల టీ 20 ప్రపంచ కప్‌ విజేత జట్టులో సత్తాచాటిన వంట్లమామిడి విద్యార్థిని కరుణకుమారి

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

పాడేరు మండలం వంట్లమామిడి గ్రామంలో కడు పేదరిక కుటుంబంలో పుట్టి పెరిగిన ఆదిమ జాతి గిరిజన విద్యార్థిని పాంగి కరుణకుమారి టీ20 ప్రపంచ కప్‌-2025 విజేతగా నిలిచిన భారతదేశ జట్టు నుంచి ప్రాతినిధ్యం వహించడంపై మన్యం వాసులు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కరుణకుమారి తల్లిదండ్రులు రాంబాబు, సంధ్య కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి పెద్దకుమారుడు శివ కాగా, రెండో సంతానం కరుణకుమారి. తరువాత మరో ఇద్దరు కుమార్తెలు దీపా, చిన్నారి ఉన్నారు. పుట్టుకతోనే అంధురాలైన కరుణకుమారి ఒకటి నుంచి 5వ తరగతి వరకు పాడేరులోని బాలసదనంలో చదివింది. తరువాత 6, 7 తరగతులు వంట్లమామిడిలో పూర్తి చేసింది. అంధురాలు కావడంతో టీచర్ల సహకారంతో విశాఖపట్నంలోని అంధుల పాఠశాలలో 2023లో 8వ తరగతిలో చేరింది. అక్కడ ఆటలు ఆడే క్రమంలో క్రికెట్‌పై ఆసక్తితో సాధన ప్రారంభించింది. ఈమె ప్రతిభను గుర్తించిన ఉపాధ్యాయులు, ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించారు. రెండేళ్ల నుంచి జాతీయ స్థాయిలో రాణిస్తున్నది. ఇటీవల శ్రీలంకలో జరిగిన అండర్‌-19 టీ20 ప్రపంచ కప్‌లో విజేతగా నిలిచిన భారత్‌ జట్టులో సభ్యురాలిగా వున్న ఆమె 42 పరుగులతో చక్కటి ప్రతిభ చూపింది. ఈ సందర్భంగా కరుణకుమారి ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ ప్రభుత్వం, క్రికెట్‌ అసోసియేషన్‌ సహకారంతో దేశానికి మరిన్ని విజయాలు చేకూరుస్తానని పేర్కొన్నారు.

కరుణకుమారికి సంపూర్ణ సహకారం: కలెక్టర్‌

పాడేరు మండలం వంట్లమామిడి గ్రామానికి చెందిన అంధ క్రికెటర్‌ పాంగి కరుణకుమారికి ప్రభుత్వం తరపున సంపూర్ణంగా సహకరిస్తామని కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆమెను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అండర్‌-19 టీ20 ప్రపంచ కప్‌ విజేతగా నిలిచిన భారత జట్టులో కరుణకుమారి ఒకరు కావడం జిల్లాకు గర్వకారణమని పేర్కొన్నారు. స్వగ్రామంలో పీఎం జన్‌మన్‌ పథకం కింద పక్కా ఇల్లు నిర్మిస్తామని, ఉన్నత విద్యకు ప్రోత్సాహాన్ని అందించడంతోపాటు అన్ని విధాలా సహకరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి డీఆర్‌వో పి.అంబేడ్కర్‌, కరుణకుమారి తల్లిదండ్రులు రాంబాబు, సంధ్య, వంట్లమామిడి ఎంపీటీసీ సభ్యుడు టి.ఈశ్వరరావు, సర్పంచ్‌ పాంగి రాంబాబు, అరకు పార్లమెంట్‌ టీడీపీ దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు వై.అప్పారావు పాల్గొన్నారు.

Updated Date - Dec 09 , 2025 | 02:04 AM