Share News

ఊగని ‘ఊయల’

ABN , Publish Date - Dec 29 , 2025 | 12:39 AM

ఊయల పథకం అమలుపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.

ఊగని ‘ఊయల’

వేధిస్తున్న నిధుల లేమి

అమలుకు గతంలోనే అధికారుల ఆదేశం

జిల్లాలో 20 చోట్ల ఏర్పాటుకు నిర్ణయం

నిధులు విడుదల కాకపోవడంతో జాప్యం

మర్రిపాలెం శిశుగృహలో మాత్రమే ఏర్పాటు

విశాఖపట్నం, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి):

ఊయల పథకం అమలుపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ కార్యక్రమాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని అధికారులు ఆదేశించినప్పటికీ నిధులు విడు దల చేయకపోవడంతో ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. ఒక్కోచోట ఊయల ఏర్పాటుకు కనీసం రూ.10 వేల వరకు ఖర్చవుతుందని, పర్యవేక్షణ సిబ్బందిని కేటాయించే అంశంపైనా స్పష్టత లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

నవజాత శిశువుల ప్రాణాలను కాపాడి, అవసరమైన వారికి దత్తత ఇచ్చే ఉద్దేశంతో గత టీడీపీ ప్రభుత్వం ఊయల పథకాన్ని ప్రారంభించింది. ఆర్థిక ఇబ్బందులు, అవాంఛిత గర్భాలు, ఇతర కారణాలతో పిల్లలను వద్దనుకునే తల్లులు నవజాత శిశువులను రోడ్లు, పొదలు, కాలువల్లో పడేస్తున్నారు. దీంతో శిశువుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. సకాలంలో గుర్తించిన స్థానికులు అధికారులకు సమాచారం ఇస్తే కాపాడుతున్నారు. ఈ నేపథ్యంలో పిల్లలను వద్దనుకునే వారి చిన్నారులను ఊయల పథకం ద్వారా కాపాడాలని ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా పిల్లలను వదిలివేసే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి, అక్కడ ఊయలలు ఏర్పాటు చేయాలని సంకల్పించింది. బిడ్డను వద్దనుకునే తల్లులు ఈ ఊయలలో వేసి వెళ్లిపోవచ్చు. ఆ చిన్నారులను బాలల సంరక్షణ విభాగం ఆధ్వర్యంలోని అధికారులు అక్కున చేర్చుకుని సంరక్షణ బాధ్యతను చూస్తారు. పిల్లలు లేని తల్లిదండ్రులకు దత్తతఇచ్చి వారికో కుటుంబాన్ని అందిస్తారు.

ఇంతటి మహత్కార్యం గత వైసీపీ ప్రభుత్వ హయాం లో పూర్తిగా నిలిచిపోయింది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజాప్రతినిధులు, అధికారులు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మళ్లీ ఈ కార్యక్రమాన్ని అమలుచేయాలని ఆదేశించారు. అయితే నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు జిల్లాలో ఊయల ఏర్పాటు ప్రక్రియ ముందుకు సాగలేదు. దీనికి ప్రధాన కారణం నిధుల కొరతేనని సమాచారం.

ఒక్క చోటే ఏర్పాటు..

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలోని 20 ప్రాంతాల్లో ఊయల ఏర్పాటుచేయాలని అధికారులు నిర్ణయించారు. కొద్ది నెలలు మర్రిపాలెం శిశుగృహలో ఒకటి ఏర్పాటుచేశారు. మిగిలిన వాటిని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైనప్పటికీ నిధులు లేకపోవడంతో ముందుకు సాగలేదు. ప్రభుత్వ ఆస్పత్రులు, రద్దీ ప్రాంతాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు వంటి చోట్ల ఊయల ఏర్పాటు చేయాలని అధికారులు గుర్తించారు. వీటిలో కేజీహెచ్‌, ఘోషా, ఆర్టీసీకాంప్లెక్స్‌, రైల్వేస్టేషన్‌, హెల్త్‌ సిటీ, ఇతర ప్రైవేటు ఆస్పత్రులు అధికంగా ఉండే ప్రాంతాలున్నాయి. ఊయలను నిరంతరం పర్యవేక్షించేలా ఏఎన్‌ఎంకు బాధ్యతలను అప్పగించనున్నారు. అదే ప్రాంతంలో బెల్‌ కూడా ఏర్పాటుచేస్తారు. బిడ్డను వేసిన తరువాత బెల్‌ కొట్టి వెళ్లిపోతే దానికి దగ్గరలో ఉండే సిబ్బంది బిడ్డ సంరక్షణ బాధ్యత తీసుకుంటారు.

చిన్నారుల దత్తత..

అమ్మతనం ప్రతి మహిళ జీవితంలో గొప్ప అనుభూతి. కొందరికి ఆ అవకాశం లభించదు. అలాంటి వారు అమ్మ పిలుపునకు పరితపిస్తుంటారు. దీంతో అమ్మతనాన్ని వద్దనుకునే వారికి, పిల్లలు కావాలనునే వారికి ఊయల మేలు చేస్తుందని అఽధికారులు చెబుతున్నారు. ఊయలలో వేసి వెళ్లిపోయే చిన్నారులను బాలసదనాలు, శిశు గృహల్లో ఆశ్రయం కల్పిస్తారు. అనంతరం నిబంధనల మేరకు పిల్లలు కావాలని కోరుకునే వారికి దత్తత ఇస్తారు.

Updated Date - Dec 29 , 2025 | 12:39 AM