Share News

సేంద్రీయ సాగులో ముందడుగు

ABN , Publish Date - Apr 21 , 2025 | 12:50 AM

మండలంలోని అమృతపురం గ్రామం ఉద్యాన పంటలకు పెట్టింది పేరు. ఈ పంటల సాగులో రైతులు ఎప్పటికప్పుడు ఆధునిక పద్ధతులు అవలంబిస్తుంటారు. విశాఖ నగరానికి చేరువగా ఉండడంతో కూరగాయలకు గిరాకీ వుంది. దీంతో ఎక్కువ మంది రైతులు ఏడాది పొడవునా వివిధ రకాల కూరగాయ పంటలను పండిస్తున్నారు. ఉద్యాన పంటలను సాగు చేసే రైతుల్లో గండి ముత్యాలనాయుడు మిగిలిన రైతులకన్నా ఒక అడుగు ముందుకు వుంటారు.

సేంద్రీయ సాగులో ముందడుగు
ట్రెల్లీ విధాంలో టమాటా పండిస్తున్న రైతు ముత్యాలనాయుడు

ఆధునిక పద్ధతులతో నాణ్యమైన అధిక దిగుబడులు

మార్కెట్‌లో డిమాండ్‌తో మెరుగైన ధర

ఖర్చులకు రెట్టింపు ఆదాయం

పదేళ్ల నుంచి ప్రకృతి సేద్యం

ఆదర్శంగా నిలుస్తున్న అమృతపురం రైతు గండి ముత్యాలనాయుడు

సబ్బవరం, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): మండలంలోని అమృతపురం గ్రామం ఉద్యాన పంటలకు పెట్టింది పేరు. ఈ పంటల సాగులో రైతులు ఎప్పటికప్పుడు ఆధునిక పద్ధతులు అవలంబిస్తుంటారు. విశాఖ నగరానికి చేరువగా ఉండడంతో కూరగాయలకు గిరాకీ వుంది. దీంతో ఎక్కువ మంది రైతులు ఏడాది పొడవునా వివిధ రకాల కూరగాయ పంటలను పండిస్తున్నారు. ఉద్యాన పంటలను సాగు చేసే రైతుల్లో గండి ముత్యాలనాయుడు మిగిలిన రైతులకన్నా ఒక అడుగు ముందుకు వుంటారు. గత పదేళ్లుగా ఇక్కడ పూర్తిగా సేంద్రీయ విధానంలోనే పంటలు సాగు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆధునిక విధానాలు పాటిస్తూ తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధిస్తున్నారు. వ్యవసాయం దండగ కాదు.. పండుగ అని నిరూపిస్తున్న ఆయనతో ‘ఆంధ్రజ్యోతి’ మాటామంతీ...

రసాయన ఎరువులు, పురుగు మందులు వినియోగించి పంటలను సాగు చేయడం వల్ల పెట్టుబడులు పెరగడమే కాకుండా భూమి భౌతిక పరిస్థితి దెబ్బతింటుంది. పంటలకు మేలు చేసే పలు రకాల పురుగులు, కీటకాలు నశిస్తాయి. మరోవైపు ఎరువులు, పురుగు మందులు వినియోగించి పండించిన పంటలపై.. ముఖ్యంగా కూరగాయలు, ఆకు కూరలపై వీటి అవశేషాలు వుంటాయి. వీటిని ఆహారంగా తీసుకుంటే పలురకాల దీర్ఘకాలిక వ్యాధులబారిన పడే ప్రమాదం వుందని శాస్త్రవేత్తలు పరిశోధనల ద్వారా నిర్ధారించారు. దీంతో పంటల సాగులో రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు వినియోగించకూడదని సుమారు పదేళ్ల క్రితం నిర్ణయించుకున్నాను. ఇదే సమయంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రకృతి సాగును ప్రోత్సహించింది. దీంతో సేంద్రీయ వ్యవసాయంపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాను. ద్రవ జీవామృతం, ఘన జీవామృతం, కషాయాలు తయారు చేసి వినియోగిస్తున్నాను. వీటి కోసం దేశవాళీ గోవులను కొనుగోలు చేసి పోషిస్తున్నాను.

కూరగాయ పంటలకు ప్రాధానం

మాకు సమీపంలో ఇటు విశాఖ నగరం, అటు అనకాపల్లి పట్టణం వుండడంతో కూరగాయలకు అధిక గిరాకీ వుంటుంది. దీంతో కూరగాయల సాగుకు ప్రాధాన్యం ఇస్తున్నాను.. టమాటా, వంగ, బెండ, మిరప, మునగ, బీర, బరబాటీ, క్యాబేజీ, కాలీఫ్లవర్‌ పంటలు పండిస్తున్నాను. ఇంకా వరి, కొర్ర పంటలతోపాటు బొప్పాయి, పుచ్చ వంటి పండ్ల తోటలను కూడా సాగు చేస్తున్నాను. వీలైనంత వరకు పెట్టుబడి, ఖర్చులను తగ్గించుకుంటూ, నాణ్యమైన అధిక దిగుబడుల సాధనకు ఆధునిక పద్ధతులను అవలంబిస్తున్నాను. టమాటా సాగులో ట్రెల్లీ విధానాన్ని పాటిస్తున్నాను. నీటి వినియోగాన్ని తగ్గించడానికి, కలుపు బెడద లేకుండా వుండడానికి బెడ్‌లు ఏర్పాటు చేసి మల్చింగ్‌ ఫీట్స్‌ వినియోగిస్తున్నాను.

వంగలో గ్రాఫ్టింగ్‌ విధానం.. రెండేళ్లపాటు కాపు

ఈ ఏడాది ప్రయోగాత్మకంగా అంటు కట్టే విధానంలో వంగ సాగు ప్రారంభించాను. ఆనందపురం మండలం తర్లువాడ వద్ద నర్సీలో అంటు కట్టి మొక్కలు సరఫరా చేస్తున్నారు. మనం ఇచ్చిన విత్తనం నారు పోసి మొక్కలు ఎదిగిన తరువాత వారి వద్ద వుండే అడవి వంగకు అంటు కట్టి ఇస్తున్నారు. ఒక్కో వంగ మొక్కకు రూ.10 తీసుకుంటున్నారు. పొలంలో మొక్కల మధ్య నాలుగు అడుగులు, వరసల మధ్య ఆరు అడుగుల దూరం వుండేలా నాటాం. కాపు మొదలైనప్పటి నుంచి రెండేళ్లపాటు దిగుబడులు వస్తాయి.

మార్కెట్‌లో డిమాండ్‌.. మంచి ధర

సేంద్రీయ విధానంలో సాగు చేసిన పంటలకు డిమాండ్‌ ఉంది. విశాఖలోని గోపాలపట్నంలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల విక్రయ కేంద్రం ఏర్పాటు చేశారు. ఇతరచోట్ల కంటే ఇక్కడ కిలోకు రూ.2-3 ఎక్కువ ధర లభిస్తున్నది. సేంద్రీయ విధానంలో సాగు చేసే రైతులు పరిమితంగా వుండడంతో మార్కెట్‌లో డిమాండ్‌కు తగ్గట్టు దిగుబడులు లేవు. గత ఏడాది 1.5 ఎకరాల్లో బొప్పాయి వేశాను. ఇంతవరకు అన్నీ కలిపి సుమారు రూ.2 లక్షలు ఖర్చుచేశాను. ఏడాదిలో సుమారు 15 టన్నుల దిగుబడి వచ్చింది. టన్ను సగటున రూ.30 వేల ధర లభించింది. ఖర్చులు పోను రూ.2.5 లక్షలు మిగిలాయి. వాతావరణం అనుకూలిస్తే మరో ఏడెనిమిది నెలలపాటు దిగుబడి వస్తుంది. మొదటి ఏడాదితో పోలిస్తే ఖర్చులు సగం కూడా వుండవు. మరో రెండు లక్షల రూపాయల వరకు మిగిలే అవకాశం వుంది.

రెండు ఎకరాల్లో వరికి రూ.1.6 లక్షలు మిగులు

ఫొటో(10ఎస్‌బిఎమ్‌10) : గండి ముత్యాలనాయుడు, సేంద్రీయ సాగు రైతు

రెండు ఎకరాల్లో వరి ఎకరాలు వేసాను. పెట్టుబడి, ఇతర ఖర్చులు కలిసి లక్షా 20 వేల రూపాయల వరకు అయ్యాయి. 55 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వచ్చింది. ధాన్యం మరపట్టించి 25 కిలోల చొప్పున బియ్యం ప్యాకింగ్‌ చేస్తే 115 బ్యాగులు వచ్చాయి. తవుడు, నూక, చిట్టు వంటివి మిల్లింగ్‌ ఖర్చులకు సరిపోయాయి. సేంద్రీయ పంట కావడంతో ఒక్కో బస్తా రూ.2,500 ధర పలికింది. సుమారు రూ.2.8 లక్షల ఆదాయం వచ్చింది. ఖర్చులుపోను రూ.1.6 లక్షలు మిగిలాయి.

Updated Date - Apr 21 , 2025 | 12:50 AM