Share News

అటకెక్కిన విచారణ!?

ABN , Publish Date - May 24 , 2025 | 01:18 AM

ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ పీవీజీడీ ప్రసాదరెడ్డి తీసుకున్న నిర్ణయాలపై విచారణ జరిపిస్తామని అసెంబ్లీ వేదికగా మంత్రి నారా లోకేష్‌ చేసిన ప్రకటన ఇంకా కార్యరూపం దాల్చలేదు.

అటకెక్కిన విచారణ!?

ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డిపై విచారణ జరిపిస్తామని రెండు నెలల కిందట అసెంబ్లీలో ప్రకటించిన మంత్రి నారా లోకేష్‌

ఇప్పటివరకూ ప్రారంభమే కాని వైనం

ఆ ఊసే పట్టని స్థానిక కూటమి నేతలు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ పీవీజీడీ ప్రసాదరెడ్డి తీసుకున్న నిర్ణయాలపై విచారణ జరిపిస్తామని అసెంబ్లీ వేదికగా మంత్రి నారా లోకేష్‌ చేసిన ప్రకటన ఇంకా కార్యరూపం దాల్చలేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రసాదరెడ్డి అనేక అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయన వీసీగా ఉన్న సమయంలో తీసుకున్న అనేక నిర్ణయాలపై తెలుగుదేశం, జనసేన పార్టీలకు చెందిన నాయకులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తరువాత ప్రసాదరెడ్డిపై విచారణ చేయిస్తామని ప్రకటించారు. అయితే, దాదాపు తొమ్మిది నెలలు ఆయనపై చర్యలు తీసుకోక పోవడంతో రెండు నెలల కిందట అసెంబ్లీలో నగరానికి చెందిన ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస రావు, విష్ణుకుమార్‌రాజు వంటి వారంతా ప్రసాద రెడ్డి వ్యవహారాన్ని ప్రస్తావించారు. దీంతో అసెంబ్లీ వేదికగా మంత్రి నారా లోకేష్‌ స్పందించారు. రెండు నెలల్లో మాజీ వీసీ ప్రసాదరెడ్డిపై విజిలెన్స్‌ విచారణ పూర్తిచేసి చర్యలు తీసుకుంటామని మార్చి రెండో వారంలో ప్రకటించారు. అయితే, ఇప్పటి వరకూ విజిలెన్స్‌ విచారణను చేపట్టలేదు. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ప్రసాదరెడ్డి సంగతి తేలుస్తామంటూ మాట్లాడిన కూటమి నేతలు ఇప్పుడు సైలెంట్‌ అయిపోవడం కూడా అనేక అనుమానాలకు తావిస్తోంది.

ఆరోపణలు అనేకం

మాజీ వీసీ ప్రసాదరెడ్డి హయాంలో అనేక అక్రమాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. రూ.20 కోట్ల రూసా నిధులు వినియోగం, ఇస్రో నుంచి వచ్చిన రూ.25 లక్షల ఖర్చులో నిబంధనల ఉల్లంఘించారనే విమర్శలు వచ్చాయి. అలాగే పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు భారీ వేతనాలతో ఉద్యోగాల కల్పన, రిటైర్డ్‌ ప్రొఫెసర్లకు అడ్డగోలుగా పదవులు, అర్హత లేని వారికి ఉన్నత పదవులు ఇవ్వడం, టీడీఆర్‌ హబ్‌ ద్వారా పీహెచ్‌డీ ప్రవేశాల్లో అక్రమాలు, నార్త్‌ క్యాంపస్‌ పరిధిలో భారీవృక్షాల తొలగింపు వంటి అంశాల్లో అవకతవకలు చోటుచేసు కున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పటి కైనా విచారణ దిశగా అడుగులు వేస్తుందో, లేదో చూడాలి.

Updated Date - May 24 , 2025 | 01:18 AM