రీజియన్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
ABN , Publish Date - Dec 14 , 2025 | 12:36 AM
విశాఖ ఎకనమిక్ రీజియన్ ఏర్పాటుతో శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకూ తొమ్మిది జిల్లాలు అన్నివిధాలా అభివృద్ధి చెందుతాయని విశాఖపట్నం జిల్లా ఇన్‌చార్జి మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి అన్నారు.
స్టీరింగ్ కమిటీలో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు
విశాఖ అంటే సీఎంకు ప్రత్యేక అభిమానం
వచ్చే నెలలో బీచ్ ఫెస్టివల్
ఇన్‌చార్జి మంత్రి డోలా
మార్చిలో గూగుల్ డేటా సెంటర్‌కు శంకుస్థాపన: ఎమ్మెల్యే గంటా
ఉక్కు కర్మాగారం విషయంలో యాజమాన్యం, కార్మికులు బాధ్యతగా ఉండాలి: ఎమ్మెల్యే పల్లా
జగన్‌ది దుర్మార్గపు పాలన: ఎమ్మెల్యే విష్షుకుమార్‌రాజు
వైఎస్ హయాంలో బ్రాండిక్స్‌కు రూపాయికి ఎకరా ఇచ్చాం: ఎమ్మెల్యే కొణతాల
విశాఖపట్నం, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి):
విశాఖ ఎకనమిక్ రీజియన్ ఏర్పాటుతో శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకూ తొమ్మిది జిల్లాలు అన్నివిధాలా అభివృద్ధి చెందుతాయని విశాఖపట్నం జిల్లా ఇన్‌చార్జి మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి అన్నారు. ఉత్తరాంధ్రను ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ముందుకు వెళుతున్నారని పేర్కొన్నారు. శనివారం సర్య్కూట్‌హౌస్‌లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పి.విష్ణుకుమార్‌రాజు, కొణతాల రామకృష్ణతో కలిసి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖపట్నం అంటే సీఎంకు ప్రత్యేక అభిమానం ఉందన్నారు. నీతి ఆయోగ్ సూచన మేరకు ఏర్పాటుచేసిన విశాఖ ఎకనమిక్ రీజియన్ స్టీరింగ్ కమిటీలో సీఎం, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, ఇతర మంత్రులు ఉంటారన్నారు. తొమ్మిది జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించామన్నారు. వచ్చే నెలలో బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తామని, దీంతో పర్యాటక రంగంలో విశాఖ బ్రాండ్ మరింత పెరుగుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తంచేశారు.
భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రపంచంలో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖ ముందుందని పేర్కొన్నారు. శుక్రవారం ఒక్కరోజే ప్రఖ్యాత కాగ్నిజెంట్‌తోసహా తొమ్మిది ఐటీ కంపెనీలకు శంకుస్థాపనలు జరిగాయని గుర్తుచేశారు. వచ్చే మార్చి నెలలో గూగుల్‌కు శంకుస్థాపన జరగబోతుందని, ఐటీ కంపెనీలు భీమిలి నియోజకవర్గంలో ఏర్పాటుకావడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. వైసీపీ హయాంలో జగన్మోహన్‌రెడ్డి పాలన చూసి పారిశ్రామికవేత్తలు రాష్ట్రం నుంచి పారిపోయారని వ్యాఖ్యానించారు. పరిశ్రమలు తీసుకురావడం వైసీపీకి చేతకాదని, అందువల్ల పెట్టుబడులకు అనుకూలంగా మారిన వాతావరణాన్ని చెడగొట్టవద్దని గంటా అన్నారు.
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ వైసీపీ ఫేక్ ప్రచారంతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో కన్వేయర్ బెల్టు ఇటీవల రెండుసార్లు తెగి పోయిందని...ఇది ప్రమాదవశాత్తూ జరిగిందా?, లేక దీనివెనుక ఎవరైనా ఉన్నారా?...అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. దీనిపై విచారణ జరుగుతుందని, కుట్ర కోణం ఉంటే మాత్రం బాధ్యులపై చర్యలు ఉంటాయని స్పష్టంచేశారు. కేంద్రాన్ని అతి కష్టం మీద ఒప్పించి విశాఖ ఉక్కు కర్మాగారానికి నిధులు తీసుకువచ్చామని, రాష్ట్రం కొన్ని నిధులు ఇచ్చిందని గుర్తుచేశారు. కర్మాగారం విషయంలో యాజమాన్యం, కార్మికులు బాధ్యతగా ఉండాలన్నారు.
విశాఖ ఉత్తర ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ జగన్మోహన్‌రెడ్డి హయాంలో రాష్ట్రంలో దుర్మార్గపు పాలన నడిచిందని ఆరోపించారు. జగన్ వంటి వ్యక్తులను ప్రజలు ఎప్పుడూ ఆదరించకూడదన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో జరుగుతున్న ఘటనలపై విచారణ జరుగుతుందని, త్వరలో వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు.
అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ ఐటీ సంస్థలకు ఎకరా 99 పైసలకే ఇచ్చారని విమర్శలు చేస్తున్న వ్యక్తులు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అనకాపల్లి జిల్లా అచ్యుతాపుర వద్ద బ్రాండిక్స్‌కు ఎకరా రూపాయి వంతున 1,000 ఎకరాలు కేటాయించారని గుర్తుచేశారు. తక్కువ ధరకు పారిశ్రామిక సంస్థలకు భూములు కేటాయించడం కొత్తకాదన్నారు. ఉక్కు కర్మాగారంలో సీఎండీ ఒక వ్యతిరేక శక్తిగా ఉన్నారని ధ్వజమెత్తారు. ఈ నెలాఖరుతో గడువు ముగుస్తున్న సీఎండీని తక్షణమే సాగనంపాలని డిమాండ్ చేశారు. సమర్థులైన అధికారులను నియమించి ప్లాంటును కాపాడాలన్నారు. కర్మాగారంలో జరుగుతున్న వ్యవహారాలపై విజిలెన్స్ విచారణ చేయాలన్నారు. విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, టీడీపీ విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు గండి బాబ్జీ పాల్గొన్నారు.